iDreamPost

ఖర్చులు తగ్గించుకునేందుకు రైతులే దొరికారా..!?

ఖర్చులు తగ్గించుకునేందుకు రైతులే దొరికారా..!?

కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని స్తంభింపజేసింది. అన్ని దేశాలతో పాటు భారతదేశ కూడా లాక్ డౌన్ ను విధించుకుంది. అయినా కూడా ఈ దేశంలో కొంత మంది పనిచేస్తున్నారు. ఈ దేశానికి అన్నం పెట్టేందుకు రేయింబవళ్ళు పని చేస్తున్నారు. వారే అన్నదాతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ నుంచి వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చాయి అంటే రైతన్నకు ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయిన వ్యవసాయ మాత్రం నిరంతరం కొనసాగాల్సిందే. రైతన్న నిత్యము శ్రమదానం చేయాల్సిందే. లేదంటే ప్రపంచం మొత్తం ఆకలితో అలమటిస్తుంది.

ఆపత్కాలంలో దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు ప్రభుత్వాలు అండాదండా ఇవ్వాల్సింది పోయి వారి నెత్తిన చేయి పెడుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోవడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీలో కోత విధించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. యూరియా మినహా ఇతర అన్ని ఎరువుల సబ్సిడీలో కోత విధించాలని ఈరోజు తీర్మానం చేసింది. వీటి విలువ 22 వేల కోట్ల రూపాయలుగా ఉంది. రాబోయే ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీపై కోత పడనుంది.

ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పండించిన పంటలకు గిరాకి లేక మార్కెటింగ్ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు తమ ధాన్యాన్ని అయిన కాడికి తెగనమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. ఉద్యాన రైతుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. అరటి రైతులు తమ పంటను తోటల్లోనే వదిలేస్తున్నారు. పశువులకు దాణాగా పడేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతన్నకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఆ పని చేయకపోగా తిరిగి వారి జేబుకి చిల్లు పెట్టేలా చర్యలు తీసుకోవడం అత్యంత విచారకరం.

కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా వ్యాపార సమాజం నష్టపోయింది అంటూ కేంద్ర ప్రభుత్వం అనేక ఉద్దీపన చర్యలు ప్రకటించింది. ఆయా వ్యాపారాల సమాఖ్యలు, సంఘాలు కూడా తమకు ఇవి కావాలంటూ ప్రభుత్వం ముందు డిమాండ్లు పెడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా వెనకో ముందో వ్యాపార సమాజానికి రాయితీలు, సబ్సిడీలు తప్పక ఇస్తాయి. ఆయా కంపెనీలు తీసుకున్న రుణాలపై వడ్డీలు కూడా మాఫీ చేసే అవకాశం ఉంది. ఈ దిశగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వ్యాపారానికి ఇచ్చే ప్రాముఖ్యత వ్యవసాయానికి ఇవ్వకపోవడమే ఇక్కడ విచారకరం.

లాక్ డౌన్ వల్ల ప్రభుత్వాలు, ప్రజలు ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలో కరోనా వైరస్ చాటిచెప్పింది. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ రంగాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తేటతెల్లం చేసింది. వ్యాపారాలు, వాణిజ్యాలు వినోదాలు లేకపోయినా సరే ప్రజల బతికేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వ్యవసాయం, వైద్యం లేకపోతే ప్రపంచం ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో అందరికీ కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఆ పని చేయకపోగా తిరిగి వారికి నష్టం చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం గర్హనీయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి