iDreamPost

NEET 2022: లోదుస్తులు తీసేయ‌మ‌న్నారు, క‌ప్పుకోవ‌డానికి చున్నీకూడా లేదు : కేరళ నీట్ ఎగ్జామ్ లో విద్యార్థినులకు చేదు అనుభవం, విచారణకు ఆదేశించిన కేంద్రం

NEET 2022: లోదుస్తులు తీసేయ‌మ‌న్నారు, క‌ప్పుకోవ‌డానికి చున్నీకూడా లేదు : కేరళ నీట్ ఎగ్జామ్ లో విద్యార్థినులకు చేదు అనుభవం, విచారణకు ఆదేశించిన కేంద్రం

ఆదివారం కేర‌ళ‌, కొల్లాం జిల్లాలో, నీట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన తన 17 ఏళ్ళ కూతురుతో బలవంతంగా లోదుస్తులు తీయించారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొందరు అమ్మాయిలుకూడా ఇలాంటి ఫిర్యాదులే చేశారు. ఆరోజు అసలేం జరిగిందో ఆ పదిహేడేళ్ళ విద్యార్థిని ఏడుస్తూ చెప్పుకొచ్చింది- “స్కానింగ్ సిబ్బంది నన్ను స్కాన్ చేసి మెటల్ హుక్ ఉన్న బ్రా వేసుకున్నావా అని అడిగారు. నేను అవును అన్నాను. అయితే పక్కనే ఇంకో లైన్ లో నిలబడాలి అన్నారు. అప్పటికే ఆ లైన్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ తర్వాత ఆ లైన్లో ఉన్న అమ్మాయిలందరినీ పిలిచి బ్రాలు తీసి టేబుల్ మీద పెట్టమన్నారు. పరీక్ష రాయడానికి బ్రా అక్కర్లేదంటూ వెటకారం చేశారు. చివరికి అమ్మాయిలమంతా ఒక చీకటి గదిలోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్లే చేసి ఎగ్జామ్ హాలులోకి వచ్చాము. శాలువాలు, స్కార్ఫులు వేసుకుంటామన్నా సిబ్బంది వినిపించుకోలేదు. సిగ్గుప‌డ్డాం. అయినా వాళ్లు ప‌ట్టించుకోలేదు. మేం జుట్టు ముందుకు వేసుకుని పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇదో చేదు అనుభవం.” దాదాపు వంద మంది అమ్మాయిలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని వల్ల పరీక్షకు ముందు ఆ తర్వాత కూడా తాము తీవ్రమైన మానసిక వేదన అనుభవించాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు.

కేరళ నీట్ ఎగ్జామ్ లో విద్యార్థినుల లోదుస్తులు బలవంతంగా తీయించిన ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై వెంటనే విచారణ జరపాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నివేదిక పంపాల్సిందిగా కేరళ విద్యాశాఖ అడిషినల్ సెక్రటరీకి సూచించారు. నీట్ పరీక్షల నిర్వహణ సంస్థ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (NTA)పై చర్యలు తీసుకోవాంటూ కేరళ విద్యా శాఖ మంత్రి ఆర్. బిందు రాసిన లేఖపై స్పందిస్తూ ప్రధాన్ ఈ ప్రకటన చేశారు.

అటు జాతీయ మహిళా కమిషన్ కూడా కొల్లాం ఘటనను తప్పుబట్టింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఛైర్ పర్సన్ రేఖా శర్మ NTA కి లేఖ రాశారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) కూడా కొల్లాం ఘటనపై ఆగ్రహం వ్యక్తిం చేసింది. దీనిపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. మొదట్లో ఈ ఆరోపణలను తోసిపుచ్చిన NTA, చివరికి నిజ నిర్ధారణ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. రాజకీయంగానూ ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. కేరళ ఎంపీలు కొల్లాం ఘటనపై పార్లమెంటులో చర్చకు పట్టుబడుతున్నారు.

ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు మహిళా సిబ్బందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు NTA హైర్ చేసిన సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేసేవారు కాగా, మరో ఇద్దరు ఎగ్జామ్ సెంటర్ సిబ్బంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి