iDreamPost

నాన్న ఎందుకో వెనకబడిపోయాడు.. ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పిల్లలుగా మీదే!

Father's Day Special: పెళ్లయ్యాక భార్య కోసం.. పిల్లలు పుట్టాక పిల్లల కోసం ఆలోచించి ఆలోచించి తనకంటూ ఒక జీవితం ఉంటుందన్న విషయం మర్చిపోయి కుటుంబమే తన జీవితం, తన సర్వస్వం అని బతికే నాన్న ఎందుకో వెనకబడిపోయాడు. ఆ నాన్నని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పిల్లలుగా ప్రతి ఒక్కరికీ ఉంది. దాని కోసం ఏం చేయాలంటే?

Father's Day Special: పెళ్లయ్యాక భార్య కోసం.. పిల్లలు పుట్టాక పిల్లల కోసం ఆలోచించి ఆలోచించి తనకంటూ ఒక జీవితం ఉంటుందన్న విషయం మర్చిపోయి కుటుంబమే తన జీవితం, తన సర్వస్వం అని బతికే నాన్న ఎందుకో వెనకబడిపోయాడు. ఆ నాన్నని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పిల్లలుగా ప్రతి ఒక్కరికీ ఉంది. దాని కోసం ఏం చేయాలంటే?

నాన్న ఎందుకో వెనకబడిపోయాడు.. ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పిల్లలుగా మీదే!

నాన్న ఒక సూపర్ హీరో. ఈ ప్రపంచంలో నాన్నను మించిన సూపర్ హీరో మరొకరు లేరు. జీవితంలో ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ చూసే హీరో నాన్న. ఏం కావాలన్నా తీసుకొచ్చి ఇస్తాడు. కటిక పేదరికంలో కూడా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తాడు. రోజూ పని చేస్తే వచ్చే జీతం.. ఏరోజుకారోజు ఖర్చయిపోయే పరిస్థితి. అలాంటిది పండగలు, ఫంక్షన్ లు వస్తే నాన్న ఓవర్ టైం డ్యూటీ చేయాల్సిందే. పిల్లలకు పుట్టినరోజు నాడు బట్టలు కొనడం కోసం ముందు రోజు ఎక్స్ ట్రా పని చేసి ఆ డబ్బులతో బట్టల షాప్ కి వెళ్లి బట్టలు కొనే తండ్రులు ఎంతోమంది ఉన్నారు. పెంకుటిల్లు పైకప్పు రంధ్రాల నుంచి వర్షం నీరు పడుతుంటే మంచం మీద గిన్నెలు పెట్టి పిల్లలను నిద్రపుచ్చే తండ్రులు ఉన్నారు.

నా పిల్లలను మంచి ఇంట్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి తన శక్తికి మించి ఒక ఇంద్రభవనాన్ని కడతాడు. పిల్లల చదువుల కోసం కష్టపడతాడు. వేలు, లక్షల ఫీజుల కోసం నలిగిపోతాడు. ఒళ్ళు హూనం చేసుకుంటాడు. జీవితంలో అనుకున్నది ఒకటి అయితే.. చేసేది మరొకటి. ఈ భూమ్మీద చాలా మంది నచ్చని పనే చేస్తున్నారు. నచ్చని పని ఎందుకు చేయాలి అని చెప్పి మానేసి నచ్చిన పని చేసుకుంటున్నారు. కానీ కొంతమంది నాన్నలు కేవలం పిల్లల కోసం నచ్చని పని అయినా నచ్చినట్టు చేస్తున్నారు. ఎందుకొచ్చిన పని అని అనుకోవడం లేదు. పిల్లల కోసం జీవితంలో రాజీపడిపోతున్నారు. పిల్లల్ని పెంచే క్రమంలో నాన్న ఆర్థికంగా చితికిపోతున్నాడు. అవమానాలు పడుతున్నాడు. పిల్లల కోసం తన కలని సమాధి చేసుకుంటున్నాడు.

అమ్మది ఇంట్లో కనిపించే శ్రమ అయితే నాన్నది కంటికి కనిపించని శ్రమ, ప్రేమ. ఇద్దరిదీ వెలకట్టలేని ప్రేమే అయినా గానీ నాన్న ఎందుకో వెనకబడిపోయాడు. అమ్మ కోసం పేజీల పేజీల డైలాగులు రాస్తారు.. నాన్న కోసం ఒక పేజీ నిండా ప్రేమను కురిపించలేని పరిస్థితి. అమ్మ ప్రేమ ముందు నాన్న ఎందుకో వెనకబడిపోయాడు. పిల్లల  ప్రేమ కోసం తన లక్ష్యాన్ని, కలను వదిలేసి వెనకబడిపోయాడు. పిల్లలకేనా లక్ష్యం, కోరికలు.. ఏ నాన్నకి ఉండవా? ఏరోజైనా నాన్న నీకు ఏమిష్టం అని అడిగారా? నీ లక్ష్యం ఏంటి నాన్న అని అడిగారా? నాన్న నీ లైఫ్ లో ఏదైనా మిస్ అయ్యావా? అని అడిగారా? ప్రతి ఏటా వచ్చే ఫాదర్స్ డేకి డబ్బుతో కొనే వస్తువులను గిఫ్ట్ ఇవ్వడం గొప్ప విషయం కాదు.. నాన్న మనసులో ఏముందో తెలుసుకుని అది చేసి చూపించడం గొప్ప.

Fathers day special

నాన్న తన జీవితంలో కోల్పోయిన సంతోషాలను మీ రూపంలో తిరిగి ఇవ్వడమే మీరిచ్చే అతి పెద్ద బహుమతి. మీ భవిష్యత్తు కోసం వెనకబడిపోయిన నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం పిల్లలుగా మీ బాధ్యత. అదే నాన్నకు మీరు ప్రేమతో ఇచ్చే అతి పెద్ద బహుమతి. తాను కోల్పోయిన జీవితాన్ని పిల్లల్లో చూసుకుని మురిసిపోయే అల్పజీవి నాన్న. మీ కోసం జీవితంలో చాలా వెనుకబడిపోయాడు.. ముందుకు తీసుకెళ్తారు కదూ. నాన్నకి మంచి పేరు తెచ్చేలా సత్ప్రవర్తనతో బతుకుతారు కదూ. సమస్యలు, సవాళ్లు, పిల్లల భవిష్యత్తు, వారి అవసరాలు, అప్పుల బాధలు.. ఇలా కష్టాల కడలిలో ఈదుతూ ఒడ్డుకు చేరలేని నౌక నాన్న.. ప్రతికూల పరిస్థితులతో పోరాడే ఒక యుద్ధనౌక నాన్న.

పిల్లల కోసం ఒక ఛట్రంలో ఇరుక్కుపోయిన ఛత్రపతి నాన్న. తనకంటూ ఒక జీవితం ఉంటుందన్న విషయాన్నే మర్చిపోయాడు నాన్న. అలాంటి వెనకబడిపోయిన నాన్నని మీ గెలుపు ద్వారా వెలుగులోకి తీసుకొస్తారు కదూ. మీకు జీవితాన్ని ఇచ్చిన నాన్నకు మీ గొప్ప జీవితాన్ని బహుమతిగా ఇస్తారు కదూ. మీ కోసం బతికే నాన్న కోసం ఆలోచించి బతుకుతారని ఆశిస్తూ పితృ దినోత్సవ శుభాకాంక్షలు. నాన్న ఒక సూపర్ హీరో అంతే. హ్యాట్సాఫ్ నాన్న. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి