iDreamPost

ఫాదర్స్ డే స్పెషల్: ఎన్ని గిఫ్టులు ఇచ్చినా వెలకట్టలేని బహుమతి ఇదే.. దీన్ని మించింది లేదు

Father's Day 2024 Special- You Must Need To Give This Gift To Your Father: ఫాదర్స్ డే సందర్భంగా మీ ఫాదర్ కి ఏదైనా బహుమతి ఇవ్వాలి అని ప్లాన్ చేస్తున్నారా? మీరు ఎలాంటి కొనిచ్చినా వారికి రాని.. సంతోషం ఈ బహుమతితో వస్తుంది. మరి.. ఆ బహుమతి ఏంటి? మీరు ఇవ్వగలరా? అసలు అది మీవల్ల అవుతుందా? మీరే తెలుసుకోండి.

Father's Day 2024 Special- You Must Need To Give This Gift To Your Father: ఫాదర్స్ డే సందర్భంగా మీ ఫాదర్ కి ఏదైనా బహుమతి ఇవ్వాలి అని ప్లాన్ చేస్తున్నారా? మీరు ఎలాంటి కొనిచ్చినా వారికి రాని.. సంతోషం ఈ బహుమతితో వస్తుంది. మరి.. ఆ బహుమతి ఏంటి? మీరు ఇవ్వగలరా? అసలు అది మీవల్ల అవుతుందా? మీరే తెలుసుకోండి.

ఫాదర్స్ డే స్పెషల్: ఎన్ని గిఫ్టులు ఇచ్చినా వెలకట్టలేని బహుమతి ఇదే.. దీన్ని మించింది లేదు

ఈ లోకంలో స్వార్థం, సొంత ప్రయోజనాలు, తన సంతోషం, తన కోరికలు, తన ఆశలు, తన జీవితం అనేది లేకుండా తాను పడే ప్రతి కష్టం, తాను చేసే ప్రతి పని, తాను సంపాదించే ప్రతి రూపాయి, తాను ఎక్కే ప్రతి మెట్టు తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం, వారి సంతోషం కోసం ఉపయోగపడాలి అని కోరుకునే వ్యక్తి నాన్న. నవమాసాలు మోసేది తల్లే కావచ్చు. కానీ, పుట్టిన తర్వాత ఆ బిడ్డను తండ్రి తన తుది శ్వాస వరకు గుండెల మీద పెట్టుకుని మోస్తాడు. ప్రతి బిడ్డ ఈ ప్రపంచాన్ని మొదటిగా చూసేది నాన్న భుజాల మీద నుంచే. ఏ తండ్రికైనా కూతురు లోకం కావచ్చు. కొడుకుని తిడుతున్నాడని తప్పుగా అనుకోవద్దు. ఆ తిట్లలో బాధ్యత ఉంటుంది. ఆ కోపంలో ఆవేదన ఉంటుంది. ఆ చిరాకులో తన ప్రేమ ఉంటుంది. తండ్రి గారాబం చేస్తే ఎక్కడ చెడిపోతాడో అనే భయం ఉంటుంది. అలాంటి తండ్రికి మీరు ఈ ఫాదర్స్ డే సందర్భంగా కచ్చితంగా ఇవ్వాల్సిన ఒక బహుమతి ఉంది. అది మీరు కచ్చితంగా ఇవ్వాలి కూడా..

ఏ తండ్రైనా తన పిల్లలే తన లోకంగా బతుకుతాడు. తన పిల్లల విజయమే తన విజయంగా మురిసిపోతాడు. తన పిల్లల సంతోషమే తన సంతోషంగా భావిస్తాడు. తన పిల్లల ఓటమి తన ఓటమిగా కుంగి పోతాడు, కుమిలి పోతాడు. తిరిగి వాళ్లు గెలుపు బాట పట్టే వరకు తాను విశ్రమించడు. తాను చెప్పులు లేకుండా అయినా నడుస్తాడేమో గానీ.. తన పిల్లలు మాత్రం కాలు కందకుండా పెరగాలి అని కోరుకుంటాడు. తాను పస్తులుండైనా తన పిల్లల కడుపునింపాలి అని తాపత్రయ పడుతూ ఉంటాడు. పిల్లల కోసం ఒక తండ్రి పడే తపన.. మీరు తండ్రైతే కానీ తెలియదు అంటారు. అది నూటికి నూరుపాళ్లు నిజం. ఒక తండ్రి ఆవేదన, ఒక తండ్రి తపన, ఒక తండ్రి ఆకాంక్షలు, ఒక తండ్రి పోరాటం, ఒక తండ్రి బాధ్యత, ఒక తండ్రి సంతోషం.. ఆ పిల్లలు ఆ స్థానానికి వచ్చిన తర్వాతే తెలుసుకుంటారు.

మీకోసం నిరంతరం శ్రమించే ఆ తండ్రికి, మీకోసం అహర్నిశలు పోరాడే ఆ తండ్రికి, మీ భవిష్యత్ కోసం అలుపెరగకుండా ఆయన చేసే కృషికి మీరు కచ్చితంగా రుణపడి ఉండాల్సిందే. జీవితాంతం ఆ తండ్రి సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిందే. అలాంటి తండ్రికి మీరు ఈ ఫాదర్స్ డేకి మర్చిపోలేని ఒక బహుమతి ఇవ్వాల్సిందే. తప్పకుండా ఇవ్వాలి కూడా. ఆ బహుమతి మరేదో కాదు.. మీ విజయం, మీ సత్ప్రవర్తన మాత్రమే. అవును.. మీరు మీ తండ్రికి ఇవ్వాల్సిన పెద్ద బహుమతి అదే. ఏ తండ్రైనా తన పిల్లల సంతోషం, విజయం కోరుకుంటాడు. అలాగని మీ ఓటమిని ఆయన జీర్ణించుకోలేరు అని భ్రమ పడకండి. మీకంటే ఎక్కువ ఆయనే కుంగిపోతాడు. మీరు లేచి నిలబడేలా చేస్తాడు. కానీ, మీరు ఆయనకు అలాంటి పరిస్థితి తీసుకురాకూడదు.

ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఆ తండ్రిని గెలిపిస్తాం అని మాట ఇవ్వండి. మేము గెలిచి ఆ విజయాన్ని మీకు కానుకగా ఇస్తామని చెప్పండి. మీ వల్ల, మీ ప్రవర్తన వల్ల ఆ తండ్రికి మంచి పేరు రాకపోయినా పర్వాలేదు. కానీ, చెడ్డపేరు మాత్రం తీసుకురావొద్దు. లోకం మొత్తం నిన్ను తప్పుబట్టినా.. ఆ తండ్రి మాత్రం వెనకేసుకునే వస్తాడు. కానీ, ఆయనకు ఆ అవసరం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. త్రేతాయుగంలో ‘తండ్రి మాటకు కట్టుబడి కొడుకు అడవికి వెళ్లాడు. కానీ, కలియుగంలో కొడుకు మాట కోసం తండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్తున్నారు’ ఇలాంటి పోస్టులు మీరు కూడా చూసే ఉంటారు. మీ తండ్రికి మాత్రం ఇలాంటి పరిస్థితి తీసుకురామని ఈ ఫాదర్స్ డే సందర్భంగా మాటివ్వండి. మీ సూపర్ హీరోకి మీరే సూపర్ హీరో అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ తండ్రి ప్రపంచం మీరే అని విషయాన్ని మర్చిపోవద్దు. ఆ ప్రపంచం ఆనందంగా ఉండేలా చూసే బాధ్యత మీదే. కాబట్టి మరోసారి ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఆ తండ్రికి ఈ మంచి బహుమతిని ఇచ్చేయండి. ఆయన కళ్లల్లో సంతోషం చూడండి. నాన్నే మన మొదటి గురువు.. మన బెస్ట్ ఫ్రెండ్ అని మరోసారి గుర్తు చేసుకోండి.

ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రౌడ్ ఫాదర్ కి ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

మీరే మా సూపర్ హీరోస్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి