iDreamPost

గుజరాత్‌లో కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన: 10 మంది మృతి

గుజరాత్‌లో కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన: 10 మంది మృతి

దాదాపు రెండు నెలల లాక్ డౌన్ తరువాత ప్రారంభమై పరిశ్రమల్లో పేలుడు, గ్యాస్ లీకేజీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి అంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్ గఢ్ లయో పాటు దేశంలో వివిధ రష్ట్రాల్లో పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా గుజరాత్ లో ఒక పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది వరకు మృతి చెందారు.

గుజరాత్‌లోని దహేజ్‌ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ పరిశ్రమలో బాయిలర్‌ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఆగ్రోకెమికల్‌ కంపెనీ యశశ్వీ రసాయన ప్రయివేటు లిమిటెడ్‌లో ఈ నెల 3న జరిగిన ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

కాగా, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పదిగా అధికారులు నిర్ధారించారు. మృతుల్లో తొమ్మిది మృత దేహాలను గుర్తించగా, మరొకరిని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగి రెండు రోజులైనా.. పేలుడుకు గల కారణాలను ఇంకా తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు.

ప్లాంట్‌ లోపల పనిచేస్తూ గాయపడిన వారిలో చాలా మంది రసాయనాలను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్లే. ఈ ప్లాంటులో ఎక్కువమంది కాంట్రాక్టు కార్మికులేననీ, వారంతా పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారేనని తెలుస్తున్నది.

తాను అప్పుడే ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి వెళ్ళాననీ, భారీ శబ్దం వినిపించిందనీ బరోడా హార్ట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఓ కార్మికుడు చెప్పాడు. దట్టమైన పొగ అలుముకుందానీ, ఏమీ కనిపించలేదని తెలిపాడు. ‘నేను హైడ్రోజన్‌తో నింపే వాహనాలను నడుపుతాను. బాయిలర్‌ పేలిన వెంటనే నా వాహనం కూడా మంటల్లో చిక్కుకుంది’ అని మరో బాధితుడు చెప్పాడు. అతనికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి.

‘ఇక్కడ ఎక్కువ మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే. వారి కుటుంబసభ్యులు ఇక్కడలేరు. ఎంత మంది గాయపడ్డారో చెప్పడం చాలా కష్టం. గాయపడిన కార్మికులను కంపెనీ యాజమాన్యం మూడు ఆస్పత్రులకు తరలించింది. పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలతో మాట్లాడొద్దని చెబుతున్నది’ అని గుజరాత్‌ వర్కింగ్‌ క్లాస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి నిలేశ్‌ పర్మార్‌ చెప్పారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనీ, యాజమాన్యానికి వంతపాడుతున్నారని బాధితులు, హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ‘పోలీసులు ఇప్పటికే యజమానిని ప్రశ్నించాలీ, అరెస్టు చేయాలి. కానీ, యజమాని ఇంకా తమను సంప్రదించలేదని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. తగిన భద్రత లేని ప్రమాదకరమైన పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. ఎలాంటి రక్షణ చర్యలూ లేవు’ అని నిలేశ్‌ పర్మార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కంపెనీలో 450 మందికిపైగా పనిచేస్తారనీ, సంఘటన జరిగినప్పుడు దాదాపు అందరూ పనిలోనే ఉన్నారని కార్మికులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి