iDreamPost

ఏపీలో పెట్టుబ‌డుల‌కు ముందుకొచ్చిన ఎల‌క్ట్రిక్ బైక్ కంపెనీ

ఏపీలో పెట్టుబ‌డుల‌కు ముందుకొచ్చిన ఎల‌క్ట్రిక్ బైక్ కంపెనీ

ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి. ప‌లువురు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికే అనంత‌పురంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల యూనిట్ ఏర్పాటు చేయ‌డానికి రంగం సిద్ధం అవుతుండ‌గా, తాజాగా కృష్ణ‌ప‌ట్నంలో మ‌రో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ 1 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డుల‌కు ముందుకొచ్చింది. త్వ‌ర‌లోనే ఉత్ప‌త్తి ప్రారంభించ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

ఎల‌క్ట్రిక్ వాహ‌న సంస్థ డావో ఈవీటెక్ సొంతంగా ప్లాంట్ నిర్మించ‌డానికి ఏర్పాట్లు చేస్తోంది. కొత్త ప్లాంట్ ని కృష్ణ‌ప‌ట్నం తీరంలో నిర్మించ‌బోతున్న‌ట్టు సంస్థ సీఈవో , చైర్మ‌న్ మైకేల్ లియూ తెలిపారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ సంస్థ అసెంబ్లింగ్ యూనిట్ నిర్వ‌హిస్తోంది. ఏపీలో ఏడాదిలోగా ప్లాంట్ నిర్మిస్తామ‌ని చెబుతోంది. మూడేళ్ల‌లో మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డి పెడుతున్న‌ట్టు తెలిపింది. హైద‌రాబాద్ లో ఫిబ్ర‌వ‌రిలో తొలి ఉత్ప‌త్తి రాబోతోంద‌ని తెలిపిన లియు ఏపీ యూనిట్ ద్వారా మ‌రింత వేగ‌వంత‌మైన ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్లు సిద్ధం చేస్తామ‌న్నారు.

కంపెనీ సీఎఫ్ ఓ అచ్యుతుని బాలాజీ కూడా ఏపీ లో యూనిట్ ఏర్పాటు త‌మ‌కు మేలు చేకూరుస్తుంద‌న్నారు. ప్రస్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 150 మోడ‌ళ్ల‌లో ఎల‌క్ట్రిక్ బైక్స్ ఉన్నాయ‌ని, ఇండియాలో 15 మోడ‌ళ్ల వ‌ర‌కూ ఉత్ప‌త్తి చేస్తామ‌ని వివ‌రించారు ఈ యూనిట్ ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి చెందిన వేల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని వివ‌రించారు. కృష్ణ‌ప‌ట్నం ప్రాంతం ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువుగా ఉంద‌ని, అందుకే అక్క‌డ ఎంపిక చేసుకున్నామ‌ని వివ‌రించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి