iDreamPost

కార్పొరేషన్ అటెండర్ కోడలు మేయర్!

కార్పొరేషన్ అటెండర్ కోడలు మేయర్!

తన జీవితమంతా ధారపోసి, ఒక కిందిస్థాయి అటెండర్ వృత్తిని కడదాకా లాక్కొచ్చి, పిల్లలను పెంచి ప్రయోజకుల్ని చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆ ఆనందానికి హద్దే ఉండదు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ గా ఎన్నికైన డాక్టర్ శిరీష విషయంలో ఈ అరుదైన సందర్భం ఇప్పుడు అందరు గుర్తు చేసుకుంటున్నారు.

మునయ్య అందరికీ తెలిసిన వ్యక్తి!!

తిరుపతి నగరపాలక సంస్థ లో అటెండర్గా సంవత్సరాలపాటు పనిచేసిన జల్లి మునయ్య అందరికీ తెలిసిన వ్యక్తి. 33 ఏళ్లు తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేసిన ఆయన రెవెన్యూ విభాగంలో ఇటీవల దాఫెదారుగా పదవీ విరమణ చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మునిశేఖర్, రెండో కుమారుడు తులసి యాదవ్. మునిశేఖర్ ను డాక్టర్ చదివించి, చిన్న పిల్లల వైద్య నిపుణుడి గా ఎండి కోర్సు చదివించారు. తిరుపతి నగరంలో వైష్ణవి హాస్పిటల్ క్రమక్రమంగా ఎదిగింది.

ఇక రెండో కుమారుడు తులసి యాదవ్ రాజకీయాల్లో కీలకంగా ఉంటూ టౌన్ డైరెక్టర్గా ను గతంలో పని చేశారు. వైష్ణవి హాస్పిటల్ తిరుపతి లో పిడియాట్రిక్స్ లో ఉత్తమమైన ఆసుపత్రిగా పేరు గడించింది. ముని శేఖర్ కు కడప జిల్లా కొర్రపాడు కు చెందిన డాక్టర్ శిరీష తో వివాహం జరిపించారు. ఆమె కూడా గైనకాలజీ లో ఎండి చేయడంతో, ఇద్దరు వైష్ణవి హాస్పిటల్ బాధ్యతల్లో పాలు పంచుకునే వారు.

తిరుపతిలోనే విద్యాభ్యాసం

డాక్టర్ శిరీష తన వైద్య విద్యాభ్యాసం తిరుపతిలోనే చేశారు. 1980 లో జన్మించిన ఆమె చదువులో మొదటి నుంచి టాపర్ గా ఉన్నారు. తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. కుప్పం పీఎస్ఈ నుంచి గైనకాలజీ విభాగంలో డీజీఓ పట్టా తీసుకున్న ఆమె కొన్ని రోజులు తిరుపతిలోని ఆశాలత టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో సైతం పనిచేశారు. మునిశేఖర్ తో వివాహం తర్వాత వైష్ణవి హాస్పిటల్ లో ప్రధాని గైనకాలజిస్ట్ గా ఆమె సేవలందిస్తున్నారు.

డాక్టర్ దంపతులు ఇద్దరూ తిరుపతి వాసులకు సుపరిచితులు కావడంతోపాటు, వైద్యంలోనూ విశేష సేవలు అందిస్తారని పేరు సంపాదించుకున్నారు. అనుకోని రీతిలో రాజకీయాల్లోకి రావడం, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాల్సి రావడంతో 27 వ డివిజన్ నుంచి పోటీలో నిలబడ్డారు. అయితే అనూహ్యంగా ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి విత్డ్రా చేసుకోవడంతో ఆమె ఏకగ్రీవం అయ్యారు.

బీసీ యాదవ వర్గానికి చెందిన ఆమె ఎన్నిక విషయాన్నీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి జగన్ కు ప్రతిపాదించిన వెంటనే ఆయన నుంచి ఆమోదం లభించింది. బాగా చదువుకున్న వ్యక్తి తో పాటు వెనుకబడిన వర్గాలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అన్ని కలిసి రావడంతో మేయర్ గా డాక్టర్ శిరీష పేరును ఎంపిక చేశారు.

ఇక తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా మొదటి నుంచి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ రెడ్డి పేరు బలంగా వినిపించినప్పటికీ, అధిష్ఠానం ఆదేశాల తో బలహీన వర్గాలకు చెందిన ముద్ర నారాయణ పేరును ఖరారు చేశారు.

14 వ డివిజన్ నుంచి గెలిచిన ముద్ర నారాయణ 1980లో తిరుపతి వచ్చే సమయానికి డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్లో విభిన్నమైన పార్టీ పదవులు చేసిన ఆయన, జగన్ పార్టీ పెట్టిన వెంటనే వైఎస్ఆర్ సిపి లోకి వచ్చారు. అప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే భూమన ముఖ్య అనుచరుడిగా, పార్టీ కోసం కష్టపడి పని చేసే వ్యక్తిగా పేరు సంపాదించుకున్న ముద్ర నారాయణకు మంచి అవకాశం దక్కిందని అన్ని పక్షాలు సంతోషం వ్యక్తం చేయడం విశేషం.

Also Read : కొలువుదీరిన నగరపాలికలు.. 11 మంది మేయర్లు వీరే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి