iDreamPost

ఇలాంటి దమ్మున్న “దామిని”లు కావాలి – Nostalgia

ఇలాంటి దమ్మున్న “దామిని”లు కావాలి – Nostalgia

ఎందుకీ ప్రస్తావన ?
ప్రతిరోజూ మహిళలపై లైంగిక వేధింపులు, హత్యాచారాలు దేశంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. శిక్షలు విధించడంలో చట్ట పరిమితుల సాకుతో ప్రభుత్వాలు చూపుతున్న అలసత్వం కారణంగా వీటికి ఇప్పటికిప్పుడు అడ్డుకట్ట పడే మార్గం కనిపించడం లేదు. ఫలితంగా నిత్యం దినపత్రికల్లో, టీవీ మీడియాలో కనీసం ఐదు నుంచి పది దాకా ఇలాంటి సంఘటనలు వార్తల రూపంలో ప్రజలు చదివి నిట్టూర్చే దారుణమైన పరిస్థితి తలెత్తింది. ఈ దురాగతాలు పరంపర ఇప్పటిది కాదు.

పోనీ ఈ వ్యవస్థలో మార్పు కోసం నాయకులెవరైనా తీవ్రంగా కృషి చేశారా అంటే అదీ లేదు. బాధితుల కుటుంబాలను ఓదార్చి మైకుల ముందు నాలుగు కంటితుడుపు మాటలతో సరిపుచ్చుతున్నారు తప్పించి వాళ్లలో నిజాయితీ కొరవడిందన్నది కాదనలేని సత్యం. ఇక్కడ కామ వాంఛలకు బలవుతున్నది ప్రత్యేకించి ఏ వర్గం వారో కాదు. ఎక్కడో బీహార్ లో ఓ దళిత బాలిక మొదలుకుని ఇక్కడి హైదరాబాద్ లో ఉన్నత కులానికి చెందిన డాక్టర్ దాకా అందరూ ఉన్నారు. సామాజిక వర్గం కోణంలోనే వీటిని ఆపాదించాలనుకోవడం హేయం. ఇలాంటి నేపధ్యాన్ని తీసుకుని పాతికేళ్ళ క్రితం 1993లో బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి ఆవిష్కరించిన ఓ వెండితెర అద్భుతం దామిని గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా కథలోకి వెళ్తే

ఎవరీ దామిని
మధ్యతరగతికి చెందిన అమ్మాయి దామిని(మీనాక్షి శేషాద్రి). అందంతో పాటు చక్కని సుగుణాలు కలిగిన ఈ లావణ్య రాశిని ఓ డాన్స్ ప్రోగ్రాంలో చూసిన శేఖర్ గుప్తా(రిషి కపూర్)తన మీద మనసు పారేసుకుంటాడు. నగరంలో అత్యంత ధనవంతుల కుటుంబాల్లో ఒకరైన బిజినెస్ ఫ్యామిలీకి చెందిన శేఖర్ ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్ళకు బొత్తిగా ఇష్టం ఉండదు. అయినా శేఖర్ పట్టుబట్టడంతో పెళ్లి చేసి దామినిని కోడలిగా స్వాగతిస్తారు. ఆ ఇంట్లో పనిమనిషిగా ఉన్న ఉర్మి(ప్రజక్తి)దామినికి బాగా దగ్గరవుతుంది. హోలీ పండగ సందర్భంలో ఇంట్లో అందరూ కోలాహలంలో మునిగి ఉండగా శేఖర్ చిన్నతమ్ముడు రాకేశ్(అశ్విన్ కౌశల్)అతని స్నేహితులు మందు నిషాలో ఉర్మిని దారుణంగా మానభంగం చేస్తారు. ఇది శేఖర్ దామినిలు కళ్ళారా చూస్తారు. ఉర్మి ఆసుపత్రి పాలవుతుంది.  

ఉర్మికి న్యాయం జరగడం కోసం స్వంత కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడి దామిని న్యాయ పోరాటం మొదలుపెడుతుంది. గుప్తా ఫ్యామిలీ కోసం సుప్రసిద్ధ లాయర్ చడ్డా(అమ్రిష్ పూరి)రంగంలోకి దిగుతాడు. కోర్టులో తన వాగ్ధాటితో అనూహ్యంగా దామినినే మతిస్థిమితం లేని దానిగా రుజువు చేసి పిచ్చాసుపత్రిలో చేరేలా చేస్తాడు. మరోవైపు ఉర్మి పరిస్థితి విషమంగా మారి చనిపోతుంది. తన చావును పోలీసులు ఆత్మహత్య గా చిత్రీకరించే క్రమంలో దామిని ఆసుపత్రి నుంచి తప్పించుకుని ప్రాక్టీసు మానేసి తాగుబోతైన లాయర్ గోవింద్(సన్నీ డియోల్) ఆశ్రయం పొందుతుంది. దామిని నిజాయతి గుర్తించిన గోవింద్ చడ్డాకు దీటుగా కోర్టులో పోరాటం చేస్తాడు. కథ ఎన్నో మలుపులు తిరిగాక ఆఖరికి శేఖర్ తన భార్యకు మద్దతుగా నిలవడంతో నిందితులకు శిక్ష పడుతుంది. దామిని విజయం సాధిస్తుంది.

దామిని నేర్పించే పాఠం
ఇందులో నేర్చుకోవాల్సిన విషయాలు, నగ్నసత్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుంటే చాలు మనం ఏం చేసినా చెల్లుతుందనే బడా బాబుల స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఇప్పటికీ కోర్టు గడపలు ఎక్కకుండా పంచాయితీల పేరుతో పోలీస్ స్టేషన్ లోనే సెటిలైపోయే కేసులు రోజుకు కోకొల్లలు. ఇక్కడ ప్రధాన పాత్ర వహించేది కరెన్సీనే. అత్యాచారాలు జరిగినప్పుడు ఎక్కువ శిక్ష పడిన వాళ్ళ జాబితాను కనక పరిశీలిస్తే పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. మరి ధనవంతుల బిడ్డలు చేసే దుర్మార్గాలు ఎక్కడ దారి మళ్లుతున్నాయి. 

వీటికి సమాధానం వెతకడం సులభమే కానీ సాక్షాధారాలతో చట్టం ముంగిట్లో నిలబెట్టడమే అసాధ్యం. అందుకే కొందరు లాయర్ల ధన దాహం వీళ్లకు అండగా నిలబడి ఏమైనా చేసుకోమనే భరోసాను ఇస్తున్నాయి. దామినిలో ఓ అమాయక ఆడపిల్లను తమ బిడ్డ చెరిచి చావుని ప్రసాదిస్తే  ఆ కుటుంబంలో ఎలాంటి ప్రాయశ్చిత్తం ఉండదు. పైగా పరువు పోతుందనే భయంతో లక్షలు కుమ్మరించి తప్పు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తారు.  ఆఖరికి స్వంత కొడుకు కోడలిపై దాడులు చేసేందుకు కూడా తెగబడతారు. తాము అన్నింటికీ అతీతం అనే భావన ఇలా ఉసిగొల్పుతుంది.

దామినిలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ప్రధాన పాత్ర చూపిన తెగువ. అప్పుడే కాదు ఇప్పుడూ మనకు సరైన న్యాయం జరగాలంటే బోనులో కుందేలులా ఉంటె సరిపోదు. ఎన్ని గండాలు వచ్చినా ధీటుగా నిలబడే వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయ్ తరహా తెగువ కావాలి. దాన్ని దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి దామిని పాత్ర రూపంలో మీనాక్షి శేషాద్రి ద్వారా నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ స్థాయిలో పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. 

ఒకవేళ దామిని కనక నిస్సహాయ స్థితిలో బేలగా మిగిలిపోయి ఉంటే ఉర్మి ఉదంతం చరిత్రలో కలిసిపోయిన ఎన్నో దుర్ఘటన పుటల్లో దాగిపోయేది. కానీ దామిని అలా చేయలేదు. ఆఖరికి తనకు పిచ్చి అని ముద్ర వేసి షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చినా ఉర్మి కోసమే చివరంటా పోరాడింది. పరుగెత్తింది. దెబ్బలు తింది. కనిపెంచిన అమ్మానాన్నలతోనే ఛీ అనిపించుకుంది. ఇన్ని చేసినా పట్టుసడలని స్థైర్యం దామినిని మరింత బలపరిచిందే తప్ప నిబ్బరాన్ని కోల్పోనివ్వలేదు. దామినిలో ఇప్పటి తరం ఆడపిల్లలు రోల్ మోడల్ గా ఎంచుకోవాల్సి గుణం ఇదే

ఇదో నిజ జీవితం నుంచి స్ఫూర్తిగా రాసుకున్న కథగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి చెప్పారు కానీ ఆ ఘటన ఏదో వెలుగులోకి రాలేదు. కానీ కథాంశం ఇప్పటి వర్తమాన పరిస్థితులకు అద్దం పడుతుందంటే మూడు దశాబ్దాలు దాటుతున్నా ఆడపిల్ల రక్షణ విషయంలో సమాజం ప్రభుత్వాలు ఎంత నిర్దయతో ఉన్నాయో అర్థమవుతుంది. 

న్యాయం జరగాలంటే ఏళ్లకేళ్లు , వాయిదాల మీద వాయిదాలు, పైకోర్టులకు అప్పీళ్లు, పెరోళ్ళు, బెయిళ్ళు ఒకటా రెండా ఎలాంటి ఆగడానికి తెగబడ్డా ఎలాగోలా బయటికి వచ్చే మార్గాలు ఉండనే ఉన్నాయి. వాటిని ఆసరాగా చేసుకునే కీచకులు పేట్రేగిపోతున్నారు. సొమ్ముంటే చాలు ఏదైనా చేయొచ్చనే ధోరణి విపరీతంగా పెరిగిపోతోంది. దామినిలో అన్నింటికి కాకపోయినా కొన్ని ప్రశ్నలకు మాత్రం ఖచ్చితంగా సమాధానం దొరికుతుంది

ఈ కారణంగానే దామినికి 1993లో ఘన విజయం దక్కింది. ఆ ఏడాది టాప్ బ్లాక్ బస్టర్స్ లో 6వ స్థానంలో నిలిచింది. క్యాస్టింగ్ ని సెట్ చేసుకోవడంలో కూడా రాజ్ కుమార్ సంతోషి తీసుకున్న శ్రద్ధ రిచ్ నెస్ తీసుకొచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నీ డియోల్- అమ్రిష్ పూరిల కోర్ట్ డ్రామాకు మాస్ ప్రేక్షకులు విజిల్స్ తో బ్రహ్మరధం పట్టారు. మొదటిపాటలో స్పెషల్ అప్పియరెన్స్ లో అమీర్ ఖాన్ మీనాక్షి శేషాద్రితో డాన్స్ చేస్తాడు. పాటలు తక్కువగానే ఉన్నప్పటికీ ఆడియో పరంగానూ దామిని అలరిస్తుంది. సపోర్టింగ్ యాక్టర్స్ లో రోహిణి హట్టంగడి, టిన్ను ఆనంద్, పరేష్ రావల్ లాంటి అనుభవజ్ఞులు నిండుదనం తెచ్చారు. దీన్ని రేవతి ప్రధాన పాత్రలో తమిళ్ లో ప్రియాంకా పేరుతో రీమేక్ చేస్తే అక్కడా హిట్ అయ్యింది. కాని తెలుగులో మాలాశ్రీతో ఊర్మిళగా తీస్తే ఇక్కడ మాత్రం చేదు ఫలితాన్ని అందుకుంది.

చివరి మాట
ఇప్పుడు దామిని ప్రస్తావన రావడానికి ఒక కారణం ఉంది. ఇటీవలే జరిగిన సంఘటనలో షాద్ నగర్ బాధితురాలు దిశా వందకు ఫోన్ చేయాల్సింది లేదా ఫలానా యాప్ ని స్మార్ట్ ఫోన్ లో ఇన్స్ స్టాల్ చేసుకోవాల్సిందని రకరకాలుగా సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇవేవి అందుబాటులో లేని సమయంలోనూ మృగాళ్ళ దాష్టికానికి ఎందరో అబలలు బలయ్యారు. మరి వాటికి ఏ కారణాలు వెతుకుదాం. నిస్సహాయత అలమినప్పుడు ఏ అమ్మాయికైనా దిక్కు తోచకపోవడం సహజం.

మగాడి కండబలం ముందు తమ మానసిక స్థైర్యం చాలక మానాన్ని అర్పించిన మహిళలు ఎందరో. ఇలాంటి సందర్భాలను ఏ యాప్ లు రక్షిస్తాయి. మారాల్సింది అమ్మాయిలు కాదు. చట్టాలు. స్తోమత ఉన్న వాడైనా లేనివాడైనా ఒకేరీతిలో త్వరితగతిన దండన లభించినప్పుడే నేరస్థుల్లో భయం పెరుగుతుంది. ప్రతిసారి ఉర్మికి అండగా నిలిచే దామినిలు అందరికి దొరకరు. అలా కావాలంటే ప్రతి ఒక్క స్త్రీ దామినిగా మారాలి. మగువల కన్నీటి నెత్తుటితో తడుస్తున్న భారత మాత దేహాన్ని మృగాల నుంచి కాపాడుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి