iDreamPost

Cyclone Michaung: మిచౌంగ్‌ తుఫాను ఎఫెక్ట్‌.. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక!

మిచౌంగ్‌ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది. భారీ వర్షాలు సైతం కురుస్తున్నాయి. సుడిగాలుల కారణంగా ఆస్తి నష్టం సంభవిస్తోంది..

మిచౌంగ్‌ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది. భారీ వర్షాలు సైతం కురుస్తున్నాయి. సుడిగాలుల కారణంగా ఆస్తి నష్టం సంభవిస్తోంది..

Cyclone Michaung: మిచౌంగ్‌ తుఫాను ఎఫెక్ట్‌.. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక!

మిచౌంగ్‌ తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురు, సుడిగాలులు వీస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది.  చెన్నైలో భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ తుఫానుకు సంబంధించి ఏపీకి పలు హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను మంగళవారం అర్థరాత్రి దాటాక తీవ్ర వాయుగుండంగా.. తర్వాత వాయుగుండగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని తెలిపింది. ఇక, దిశ మార్చుకున్నందున తెలంగాణ, ఛత్తీష్‌గఢ్‌లలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని, బుధవారం కోస్తా, రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ­గోదావరి, బీఆర్‌ అంబేద్కర్‌ కోన­సీమ, కాకినాడ, తూర్పుగోదా­వరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాను బలహీన పడినప్పటికి పలు జిల్లాల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని ప్రకటించింది.

తుఫాను ప్రభావంతో వణికిన కోస్తా జిల్లాలు

మిచౌంగ్‌ తుఫాను ప్రభావం కోస్తా జిల్లాలపై బాగా పడింది. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు సైతం వీస్తున్నాయి. దీంతో కోస్తా జిల్లాల ప్రజలు వణికిపోయారు. గత మూడు రోజులుగా కోస్తా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తుఫాను తీరం దాటుతున్నపుడు భీభత్సం సృష్టించింది. బాపట్ల జిల్లాలో తుఫాను అలజడి సృష్టించింది. గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో పరిస్థితి దారుణంగా మారింది. తీరంలోని షెడ్లు, కరెంట్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కోస్తా తీరంలో తుఫాను ప్రభావానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

సూర్యలంక బీచ్‌ వద్ద కొత్తగా నిర్మించిన పోలీస్‌ వాచ్‌ టవర్‌ సైతం పాడైంది. భారీ ఎత్తున పంట నష్టం సంభవించింది. నెల్లూరులోనూ తుఫాను తన ప్రతాపం చూపించింది. పెనుగాలుల కారణంగా చిన్న చిన్న వృక్షాలే కాదు.. భారీ వృక్షాలు కూడా దెబ్బకు ఎగిరిపోయాయి. రోడ్ల మీద ఇండ్ల మీద చెట్లు పడ్డాయి. వీటిని తొలగించడానికి అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటించింది. మరి, ఏపీలో తుఫాను ప్రభావంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి