iDreamPost

కరోనా ఎదుర్కోవ‌డంలో క్యూబా: ప్ర‌పంచ‌దేశాల‌కే ఆద‌ర్శంగా ఎలా మారింది?

కరోనా ఎదుర్కోవ‌డంలో క్యూబా: ప్ర‌పంచ‌దేశాల‌కే ఆద‌ర్శంగా ఎలా మారింది?

క్యూబా..ప్ర‌స్తుతం క‌రోనా స‌మయంలో ఈ దేశం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. వాస్త‌వానికి చిన్న దేశ‌మే అయిన‌ప్ప‌టికీ. అమెరికా ఆంక్ష‌లు, ఇత‌ర అడ్డంకుల‌ను అధిగ‌మించి ముందుకు సాగ‌డం ద్వారా త‌న విశిష్ట‌త‌ను కాపాడుకుంటోంది. ఫెడ‌ల్ క్యాస్ట్రో కాలం నుంచి క్యూబా త‌న ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకుంటోంది. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత కూడా క్యూబా త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతోంది. క‌మ్యూనిస్టు దేశంగా ఉన్న క్యూబాలో గతంలో ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చిన స‌మ‌యంలో ఎదుర‌యిన అనుభ‌వాల నుంచి ప్ర‌త్యేక దృష్టి సారించింది. దానికి త‌గ్గ‌ట్టుగా అంత‌ర్జాతీయంగానే గుర్తింపు సాధించింది. వైద్యుల విష‌యంలో ఇండియాలో ప‌దివేల మంది జ‌నాభాకి 0.8 మంది చొప్పున డాక్ట‌ర్లు ఉంటే క్యూబాలో 8.2 మంది ఉన్నారంటే అక్క‌డి ప్ర‌భుత్వం సాధించిన విజ‌యం అర్థం అవుతుంది.

క‌రోనా తాకిడికి అమెరికా విల‌విల్లాడుతుంటే క్యూబా మాత్రం మాన‌వ‌త్వంతో ప్ర‌పంచాన్ని ఆక‌ర్షిస్తోంది. ఇప్ప‌టికే 16 దేశాల‌కు వైద్యుల‌ను పంపించి సేవ‌లు అందించ‌డం ద్వారా క‌మ్యూనిస్టు క్యూబా కీర్తి నిలుపుకుంటోంది. చివ‌ర‌కు క్యూబాపై అనేక ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఛీదరించుకునే అమెరికాలో, ఇటలీలో కూడా క్యూబా వైద్యులు క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నారంటే వారి ప్ర‌త్యేక‌త అర్థ‌మ‌వుతోంది. క్యాస్ట్రో, చేగువేరా వంటి వారి దేశ విప్ల‌వ వీరుల స్ఫూర్తితో సాగుతూనే , ఆప‌ద‌లో ఉన్న స‌మ‌యంలో శ‌త్రువులే అయిన‌ప్ప‌టికీ ఆయా దేశాల సామాన్య పౌరుల ప్రాణాలు కాపాడేందుకు క్యూబా అందిస్తున్న తోడ్పాటు అసామాన్యంగా అంతా భావిస్తున్నారు.

అమెరికాతో పాటుగా ఇటలీ, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా క్యూబాపై ఆంక్షల అస్త్రశస్త్రాలు విసురుతూనే ఉంటాయి. అయినా క్యూబా వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ప్రాణాలు కాపాడేందుకు రంగంలో దిగ‌డంతో ఇట‌లీ పౌరులు కరతాళ ధ్వనులతో వారికి గొప్ప స్వాగతం ప‌లక‌డం విశేషమే. ప్ర‌స్తుతం అమెరికా, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ ఇలా 16 దేశాల్లో ప్రస్తుతం వేలాది మంది క్యూబన్ వైద్యులు కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. మొదటి నుంచి క్యూబాకి అలాంటి చ‌రిత్ర ఉంది. హైతీలో కలరా వ్యాపించి జనం పిట్టల్లా రాలిపోయిన స‌మ‌యంలో చేదోడుగా నిలిచింది. పశ్చిమాసియా దేశాలకు ఎబోలా ప్రబలినప్పుడు కూడా క్యూబా వైద్యులే ఆపద్భాందవుల్లా కదిలారు. విపత్కర పరిస్థితులలో సరిహద్దులకు అతీతంగా వైద్య సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుండే క్యూబా డాక్టర్లు ఇప్పుడు విశ్వ‌మే క‌ష్టాల్లో చిక్కుకున్న స‌మ‌యంలో కూడా ముందుకు వ‌చ్చారు.

ఆయుధాల కంటే ఆరోగ్యమే గొప్ప అని నమ్మిన దేశంగా క్యూబా ఘ‌న‌తను ఇప్పుడు అంతా అభినందిస్తున్నారు. అగ్ర‌రాజ్యంలో అడ్డూఅదుపులేని స్వేచ్ఛ పేరుతో అడ్డ‌గోలు విధానాల కార‌ణంగా క‌ష్టాల్లో కూరుకుంటే క్యూబా వంటి దేశం అందిస్తున్న స‌హాయం మాన‌వ‌త్వానికి మ‌చ్చుతున‌క‌లా మిగులుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఒక వైద్యుడిగా చేగువేరా ప్ర‌పంచంలో పెను మార్పుల‌కు విప్ల‌వాల బాట ప‌డితే ఇప్పుడు చే స్ఫూర్తితో క్యాస్ట్రో విధానాల కొన‌సాగింపుగా క్యూబా కీర్తి పెంచుకునే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్న క్యూబా విధానాలు అనేక‌మందిని ఆక‌ట్టుకుంటున్నాయి. త‌మ దేశంలో వైద్యం అంద‌క సామాన్యులు విల‌విల్లాడుతున్న స‌మ‌యంలో వైద్య‌రంగం పై దృష్టి పెట్టి ఇప్పుడు తిరుగులేని స్ఫూర్తితో మంచి స్థానానికి ఎదిగిన క్యూబా కీర్తి ప్ర‌పంచ దేశాల‌కు స్పూర్తి నింపుతుంద‌న‌డంలో సందేహం లేదు.

ఒక‌నాడు అమెరికా ఆంక్ష‌ల‌తో క్యూబాలో చిన్న‌పిల్ల‌ల‌కు ఆహారం గానీ, మందులు గానీ లేకపోవ‌డంతో అనేక దేశాల స‌హాయం అర్థించిన దేశం ఇప్పుడు అంద‌రికీ చేయూత‌నందించే స్థాయికి ఎద‌గ‌డంలో వారి ప‌ట్టుద‌ల అర్థం అవుతుంది. సోవియ‌ట్ ప‌త‌నం త‌ర్వాత క్యూబాకి స‌హాయం అందించ‌డంలో అనేక దేశాల నుంచి పాలపొడి స‌హా అనేక ప‌థార్థాలు పంపిస్తే. ఇప్పుడు క్యూబా త‌న కాళ్ల మీద నిల‌బ‌డి అంద‌రి ప్రాణాలు నిల‌బెట్టే స్థాయికి చేర‌డం అక్క‌డి ప్ర‌భుత్వ విధానాలు, ప్ర‌జ‌ల్లో ఉన్న చైత‌న్యం తార్కాణంగా ఉన్నాయి. త‌మ అధినాయ‌కుల స్ఫూర్తితో అడుగులేస్తున్న క్యూబన్ వైద్యుల‌కు అభినంద‌న‌లు చెప్పాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి