iDreamPost

అయిదేళ్లలో లక్ష థియేటర్లతో కొత్త విప్లవం

అయిదేళ్లలో లక్ష థియేటర్లతో కొత్త విప్లవం

రాబోయే రోజుల్లో థియేటర్ డెఫినిషన్ మారబోతోంది. అందరికీ వెండితెర వినోదాన్ని అందించాలనే సంకల్పంతో ఇటు ప్రభుత్వాలు అటు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఔత్సాహికులతో త్వరలోనే దేశవ్యాప్తంగా వందా వెయ్యి కాదు ఏకంగా లక్ష స్క్రీన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అన్నీ అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం జరిగితే ఐదేళ్లలోనే ఇది సాధ్యమవొచ్చు. అయితే ఇది పట్టణాలు నగరాలకు తీసుకొస్తున్న స్కీం కాదు. పక్కా పల్లెటూళ్ళను లక్ష్యంగా చేసుకుని సిఎస్సి ఈ గవర్నెన్స్ ఈ విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. 2023 చివరికి పదిహేను వందలు ఆపై సంవత్సరం అయిదు వేలు ఇలా కౌంట్ పెంచుకుంటూ పోయి ఫైనల్ గా లక్షకు చేరుస్తారు.

దీని కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఏదైనా గ్రామంలో ఒక మినీ థియేటర్ ఏర్పాటు చేయాలనుకునే వాళ్ళు ఒక పదిహేను లక్షలు సమకూర్చుకుంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రా స్ట్రక్చర్ తో సహా ప్రొజెక్టర్ సీటింగ్ గట్రా వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే సిఎస్సి చూసుకుంటుంది. సీట్లు వంద నుంచి రెండు వందల మధ్యలో గ్రామా జనాభాను బట్టి నిర్ణయించుకోవాలి. జంక్షన్ కు దగ్గరగానో లేదా ఫ్లోటింగ్ కి అనుగుణంగానో ఉంటే దానికి తగ్గట్టే పెంచుకోవచ్చు. ఇప్పటికే అనంతపూర్, తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో హోమ్ థియేటర్ ని తలపించే ఇలాంటి సెటప్పులు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ మోడలే పెద్దది చేయబోతున్నారు

ఇది మంచి ఆలోచనే. అయితే ఇంత భారీ స్థాయిలో థియేటర్లను స్థాపించడం వల్ల అంత స్థాయిలో ఆడియన్స్ వీటికి వస్తారా అనేది కొత్త సినిమాలను బట్టి ఉంటుంది. ఇందులోనూ డైరెక్ట్ రిలీజులు ఉంటాయి. డేట్ మారాక రావడం లాంటిది కాదు. ఒకే రోజు ప్రపంచవ్యాప్తంగా ఏ రోజైతే రిలీజ్ ఉంటుందో అదే తేదీకి వీటిలోనూ చూసుకోవచ్చు. అయితే చిన్న సినిమాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో వీటి పాత్ర కీలకం కానుంది. టికెట్ రేట్లను కనక ప్రజల ఆర్ధిక స్థితిగతులకు తగ్గట్టు నిర్ణయిస్తే మంచి ఫలితాలు చూడొచ్చు. ఎలాగూ పంచాయితీ పరిధిలో టాక్సులు తక్కువగా ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే ఆక్యుపెన్సీలు వస్తాయి.మూవీ లవర్స్ కిది శుభవార్తే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి