iDreamPost

ఏపిలో జగన్ పాలనపై ప్రజా తీర్పు: సిపిఎస్ సర్వే రిపోర్ట్స్

ఏపిలో జగన్ పాలనపై ప్రజా తీర్పు: సిపిఎస్ సర్వే రిపోర్ట్స్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రజా పాలన అందిస్తున్నారని మరోసారి స్పష్టం అయింది. ప్రఖ్యాత సర్వే ఏజెన్సీ, హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సిపిఎస్) నిర్వహించిన సర్వేలో వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని స్పష్టం అయింది. జగన్ ప్రజా పాలన అందిస్తోన్నారని సర్వే పేర్కొంది. సిపిఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం ఏడాది పాలనపై సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కొనసాగించడానికి కూడా 96 శాతం మంది ప్రజలు జై కొట్టినట్టు సిపిఎస్ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వేలో పాల్గొన్న 75.8 శాతం మంది ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా వైరస్ (కోవిడ్ -19)ను చాలా బాగా ఎదుర్కొంటుందని భావిస్తున్నారు.

63.9 శాతం మంది ప్రజలు జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చారని అభిప్రాయపడ్డారు. వాగ్దానాలను పూర్తిస్థాయిలో ఇంకా నెరవేర్చలేదని 35 శాతం మంది భావిస్తున్నారు.

ఈ సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మంచిగా పాలిస్తోన్నారని 62.6 శాతం మంది ప్రజలు భావిస్తున్నారు. 36 శాతం మంది దానికి విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడనికి 32.2 శాతం మంది మాత్రమే మద్దతిచ్చారు. 61.7 శాతం మంది ప్రతిపక్ష పార్టీల విధానం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందనే అంశంపై సాధారణంగా ఆసక్తి ఏర్పడుతుంటుంది. అధికారాన్ని అందుకున్న పార్టీకి ఏడాది గడువును కూడా ఇస్తుంటారు రాజకీయ ప్రత్యర్థులు. పరిపాలనపై అవగాహన తెచ్చుకోవడానికి అధికార పార్టీకి ఆ మాత్రం గడువు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోన్న వ్యవహారమే. ఈ ఏడాది కాలంలో అధికార పార్టీ ఏవైనా పొరపాట్లు చేసినా.. తొలి ఏడాది కాబట్టి సరిబెట్టుకుంటున్నామనే వ్యాఖ్యలు తరచూ ప్రతిపక్ష పార్టీల నుంచీ వినిపిస్తుంటాయి. కాని ఆంధ్రప్రదేశ్‌లో తొలినుంచి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న అంశాలను కూడా రాద్దాంతం చేస్తూ వస్తున్నాయి. అయినప్పటికీ ప్రతిపక్షాల విమర్శలతో కుంగిపోకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోంది. అది ఈ సర్వేలో తేటతెల్లం అయింది.

ఈ ఏడాది కాలంలో ఏపిలో అధికార వైసిపి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రతిపక్ష పార్టీల స్థానం ఎలా ఉంది? పాలనా తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రతిపక్ష నేతలు ఆరోపించినట్లుగా ఈ ఏడాది కాలంలోనే వైసిపి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందా? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌లో విద్యా బోధనపై ప్రజల అభిప్రాయాలేంటీ? మూడు రాజధానుల ప్రకటన తరువాత అమరావతి పరిధిలో ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి? ఏపిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అధికారం ఎవరిని వరిస్తుందనే ప్రశ్నలకు సిపిఎస్ సమాధానాలు ఇచ్చింది.

ఏపిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే.. వైసిపి మరోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటుందని స్పష్టం చేసింది. ఇదివరకు కంటే కూడా వైసిపి ఓటు బ్యాంకు మెరుగుపడిందని పేర్కొంది. గత ఏడాది ముగిసిన ఎన్నికల సందర్భంగా వైసిపి 51 శాతం ఓట్లను సాధించుకోగా.. ఈ సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే అధికార వైసిపికి 55.8 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు అనేవి ఏ మాత్రం లేవని తమ సర్వేలో తేటతెల్లం అయింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీ ఓట్లశాతం మరింత తగ్గుతుందని సిపిఎస్ సర్వే అంచనా వేసింది. టిడిపికి కేవలం 38.3 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వేలో స్పష్టం చేసింది. బిజెపి-జనసేన ఉమ్మడిగా పోటీ చేసినా 5.3 శాతానికి ఓట్ల శాతం పెరగపోవచ్చని పేర్కొంది. ఇది వరకు కంటే కూడా టిడిపి ఓటు బ్యాంకు తగ్గడానికి ప్రధాన కారణం..ప్రజలు ఎక్కువ మంది వైసిపి వైపు మొగ్గు చూపడమేనని సర్వే అంచనా వేసింది. సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలను నెరవేర్చడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది.

మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తరువాత అమరావతి ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు నిరసన ప్రదర్శనలు, ఆందోళన చేయించారు. కాని అలాంటి చోట కూడా వైసిపికి ఆదరణ తగ్గలేదని సిపిఎస్ సర్వే వెల్లడించింది. వైఎస్ జగన్ పరిపాలనపై అమరావతి ప్రాంత ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ అంచనాలకు అనుగుణంగా పాలిస్తున్నారని 54.9 శాతం మంది అమరావతి ప్రాంత ప్రజలు వెల్లడించారు. 42.1 శాతం మంది బాగోలేదని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వారి సంఖ్య మరింత అధికంగా ఉంటోంది. 74 శాతం మంది ప్రజలు జగన్ పాలనపై సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పేర్కొంది. రాయలసీమలో 67.1 శాతం సంతృప్తి వ్యక్తమైందని సిపిఎస్ సర్వే వెల్లడించింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందని ప్రజలు అభిప్రాయపడినట్లు సిపిఎస్ సర్వే వెల్లడించింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపిలో తక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడానికి ఇదే ప్రధానకారణమని పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి