iDreamPost

కరోనాపై భయమొద్దు .. వైద్య పరీక్షలు చేయించుకోండి : సీఎం వైఎస్‌ జగన్‌

కరోనాపై భయమొద్దు .. వైద్య పరీక్షలు చేయించుకోండి : సీఎం వైఎస్‌ జగన్‌

కరోనా వైరస్‌పై ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. పరీక్షలు చేయించుకున్నంత మాత్రాన ఏదో తప్పు జరిగినట్లు కాదన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. అనుమానిత లక్షణాలను ఉన్న వారు పరీక్షలు చేయించుకుంటే వారితోపాటు, వారి కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందన్నారు.

ఏపీ నుంచి ఢిల్లీలోని మత సదస్సుకు వెళ్లిన వారికే ఎక్కువగా కరోనా సోకిందని సీఎం తెలిపారు. ఆ సదస్సుకు ఏపీ నుంచి 1085 మంది వెళ్లారని తెలిపారు. ఇప్పటి వరకూ 585 మందికి పరీక్ష చేయగా 70 మందికి వైరస్‌ సోకి నట్లు తెలిందన్నారు. మరో 500 మందికి ఫలితాలు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 87 కేసులు నమోదైతే 70 కేసులు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారివేన్నారు. వీరికి సన్నిహితంగా మెలిగిన వారు ఉంటే 104కు ఫోన్‌ చేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాం. ఇదొక జ్వరంలాంటిది. ఇది వస్తే ఏదో తప్పు జరిగినట్లు కూడా కాదు. జ్వరం వచ్చినట్లు వచ్చి . . తగ్గిపోతోంది. 14 రోజుల తర్వాత వారిని ఇళ్లకు పంపిస్తారు. వారితో కాంటాక్ట్‌తో ఉన్న వారు పరీక్షలు చేయించుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.

ప్రతి ఇంటికి కూడా గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాయలంలో ఉన్న ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఆర్పీలు వెళ్లి వారి బాగోగులపై సర్వే చేస్తున్నారు. జలుబు, జర్వం, గొంతనొప్పి ఉన్నా సంకోచం లేకుండా వారికి చెప్పాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. 81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి, వైద్యం చేయించుకుని నయం అయిన విషయం ప్రపంచ మొత్తం చూస్తున్నాం కాబట్టి ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు. ఇది ఒక చిన్న విషయం.. జ్వరం వస్తే ఎలా వైద్యం చేయించుకుంటామో ఇలా చేయించుకోవాలని చెప్పారు.

కరోనా వైరస్‌ నయం అయే వ్యాధి అని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. వైద్యం తీసుకుంటే సరిపోతుంది. కరోనా వైరస్‌ ఎవరికైనా వస్తే.. ఏదో జరిగిపోయినట్లు ప్రజలు భావించవద్దన్నారు. వారి పట్ల వివక్ష చూపరాదని జగన్‌ తెలిపారు. ఎవరికైనా కరోనా వస్తే వారిపై మరింత మానవత్వం, అప్యాయత, ప్రేమ, అభిమానం చూపించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలను కోరారు.

కరోనా ను ఎదుర్కొనేందుకు ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు, డాక్టర్లు ముందుకు రావాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. ఆయా జిల్లాల వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని కరోనాపై పోరులో భాగస్వామ్యులు కావాలని విన్నవించారు.

గ్రామాల్లో వ్యవసాయ, ఆక్వా పనులు యథావిధిగా చేసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. మనిషికి మనిషికి ఒక మీటర్‌ దూరం పాటించాలని సూచించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పనులు చేసుకోవాలని, ఎక్కడ ఎవరూ ఇబ్బంది పడకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. రైతులు, రైతు కూలీలు ఇబ్బంది లేకుండా జీవనం సాగించాలని ఆయన ఆకాంక్షించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి