iDreamPost

సుప్రీంకోర్టు కి కాబోయే సీజే ఆయనేనా..? జస్టిస్ ఎన్ వీ రమణకు లైన్ క్లియర్ అయినట్టేనా..?

సుప్రీంకోర్టు కి కాబోయే సీజే ఆయనేనా..? జస్టిస్ ఎన్ వీ రమణకు లైన్ క్లియర్ అయినట్టేనా..?

ఆసక్తిగా మారిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టే కనిపిస్తోంది. జస్టిస్ ఎన్ వీ రమణకు లైన్ క్లియర్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ఏప్రిల్ 23న రిటైర్ కాబోతున్న జస్టిస్ బాబ్డే ఇప్పటికే ప్రభుత్వానికి రమణ పేరుని సిఫార్సు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జిగా ఆయన పేరుని ప్రతిపాదించారు. దాంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల వివాదాల్లో వినిపించిన జస్టిస్ రమణ కాబోయే సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ గా కథనాలు వస్తున్నాయి.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సీజే రిటైర్మెంంట్ కి ముందే తదుపరి చీఫ్ జస్టిస్ గా సీనియర్ మోస్ట్ పేరుని ప్రతిపాదించాల్సి ఉంటుంది. అయితే ఈసారి జస్టిస్ ఎన్ వీ రమణ విషయంలో ఇప్పటికే అంతర్గత విచారణ జరిగిన నేపథ్యంలో అది కొంత ఆలశ్యమయ్యింది. దాంతో కొత్త సీజే పేరుని ప్రతిపాదించాల్సిందిగా కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ రాశారు. దానికి స్పందిస్తూ జస్టిస్ బాబ్డే తాజాగా ఎన్ వీ రమణ పేరుని ప్రతిపాదించడం ఆసక్తికరంగా మారింది. జస్టిస్ రమణకు చీఫ్ జస్టిస్ పీఠం దక్కితే జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత ఆ స్థానానికి చేరుకున్న తెలుగు వ్యక్తి అవుతారు. అయితే అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం తరుపున కోకా సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. రాజ‌మండ్రికి చెందిన కోకా సుబ్బారావు 1966-67 మ‌ధ్య సుప్రీం కోర్టు సీజేగా వ్య‌వ‌హ‌రించారు

ప్రస్తుతం సుప్రీంకోర్టు సీజేగా రమణ పేరు ప్రతిపాదనకు రావడంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటోందననే చర్చ మొదలయ్యింది. ఏప్రిల్ 24న కొత్త సీజే గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా సీనియారిటీ ప్రాతిపదికన జస్టిస్ రమణ పేరు ముందుకు రావడంతో కేంద్రం ఆమోదముద్ర వేస్తుందా లేదా అన్నది చూడాలి. సుప్రీంకోర్టులో సీనియారిటీ ప్రాతిప‌దిక‌న ప‌ద‌వులు ఇచ్చే సంప్ర‌దాయాన్ని అన్ని సంద‌ర్భాల‌లోనూ పాటించాలనే నిబంధన లేదు. దాంతో కేంద్రం తీసుకోబోయే నిర్ణయం అంతిమం అవుతుంది.

ఇటీవల జస్టిస్ రమణ మీద పలు విమర్శలు వచ్చాయి. నేరుగా ఏపీ ముఖ్యమంత్రి ఆయన మీద లేఖాస్త్రం సంధించారు. ఆ లేఖపై జస్టిస్ రమణ వివరణను కూడా అప్పట్లో సీజే తీసుకున్నారు. దాంతో జస్టిస్ రమణ పేరు పై ఊగిసలాట మొదలయ్యింది. అయితే జస్టిస్ బాబ్డే మాత్రం వాటికి తెరదించారు. ఇక ప్రస్తుతం జస్టిస్ రమణ పేరుని రాష్ట్రపతికి ప్రతిపాదించడమే మిగిలింది. అది కేంద్రం చేతుల్లో ఉంది. మోడీ దానికి ఆమోదముద్ర వేస్తే నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ రెండో తెలుగు సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్యతలు స్వీకరించేందుకు అడ్డంకులు తొలగిపోతాయి.
.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి