iDreamPost

చీరాల – పేరాల ఉద్యమం : స్వాతంత్ర్య సంగ్రామంలో ఓ మైలు రాయి

చీరాల – పేరాల ఉద్యమం : స్వాతంత్ర్య సంగ్రామంలో ఓ మైలు రాయి

చీరాల – పేరాల చరిత్రలో నిలిచిపోయిన ఓ ప్రత్యేక ఉద్యమం. స్వాతంత్ర సంగ్రామంలో ఇదో ఘట్టం. అలుపెరగని పోరాటానికి నిదర్శనం. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చిరస్మరణీయుడు. చీరాల, పేరాల ఉద్యమానికి సోమవారంతో వందేళ్లు పూర్తవుతున్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ చీరాల, పేరాల ఉద్యమానికి వందేళ్లు నిండినందున చీరాలలో పాదయాత్ర నిర్వహణకు సిద్ధమైంది.

చీరాల, పేరాల రెండు గ్రామాలు. రెండు పంచాయతీలు. 1919వ సంవత్సరంలో చీరాల, పేరాల గ్రామాలలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఖర్చులకుగాను ఆదాయవనరులను పెంపొందించుకునేందుకు ఆ రెండు పంచాయతీలను కలిపి పురపాలక సంఘంగా ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజలు అందుకు అంగీకరించలేదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పన్నులు భారం మోయలేకపోవడం అందుకు కారణం. వారి నిరసన చుక్కానిలేని నావగా ఉంది. ఈ క్రమంలో ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వారికి నాయకత్వం వహించేందుకు సిద్ధపడ్డారు. విషయాన్ని ఆయన మహాత్మాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. పన్నులు చెల్లించకుండా శాంతియుతంగా నిరసన తెలపాలని.. లేకపోతే గ్రామాలను ఖాళీచేసి గ్రామ బహిష్కరణ చేయడం ఇంకో మార్గమని గాంధీజీ సూచించారు.

1921 ఏప్రిల్‌ 6న మహాత్ముడు చీరాల వచ్చారు. ఆ రోజు ఆయన ప్రతిపాదించిన అంశాల్లో దుగ్గిరాల బహిష్కరణకే మొగ్గుచూపారు. ఆ ఏడాది ఏప్రిల్‌ 25న చీరాల, పేరాల ప్రజలు గ్రామాలను వీడి ఈపూరుపాలెం కరకట్టలపై గుడిసెలు వేసుకున్నారు. పన్నులు చెల్లించబోమని బ్రిటీష్‌ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అప్పటికే శ్రీరామదండు పేరుతో ఓ సైన్యాన్ని తయారుచేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటున్న దుగ్గిరాల.. చీరాల, పేరాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. సుమారు 15వేలమంది ఆయన మాటపై నిలిచారు. పాకలు వేసుకున్న ప్రాంతానికి రామనగర్‌ అని నామకరణం చేశారు.

అయితే కొత్తగా గుడిసెల నిర్మాణాలకు, జీవనభృతికి కొంత సమస్య ఏర్పడింది. దుగ్గిరాల ఎన్నో చోట్ల ప్రసంగాలు చేసి విరాళాలు సేకరించి వారికి అండగా నిలిచారు. సుమారు 11 నెలల పాటు ఈ పోరాటం, సహాయనిరాకరణ కొనసాగింది. చర్చల పేరుతో సహాయనిరాకరణ, గ్రామ బహిష్కరణను వీడాలని బ్రిటీష్‌ ప్రభుత్వం సూచించింది. అందుకు జనం ఒప్పుకోలేదు. తర్వాత బరంపురంలో దుగ్గిరాలను బ్రిటీష్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మరికొందరిని అరెస్టు చేశారు. వీరిలో స్వాతంత్ర్యోద్యమంలో జైలుకు వెళ్లిన తొలిమహిళగా గుర్తింపుపొందిన వేటపాలెంకు చెందిన అలివేలు మంగతాయారు కూడా ఉన్నారు. అయినా ప్రజలు వెనక్కి తగ్గలేదు.. దీంతో బ్రిటిష్‌ ప్రభుత్వమే దిగివచ్చింది. మున్సిపాలిటీని రద్దు చేసింది. చీరాల-పేరాల ప్రజల ఉద్యమం స్వాతంత్య్రపోరాటంలో ఓ మైలురాయిగా నిలిచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి