iDreamPost

స్వరం మార్చిన బాబు.. కేంద్రానికి లేఖ రాస్తారా..?

స్వరం మార్చిన బాబు.. కేంద్రానికి లేఖ రాస్తారా..?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వరం మార్చారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని అధికార పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో డిమాండ్‌ చేస్తున్న తరుణంలో.. వైసీపీ 16 నెలల పాలనపై, విశాఖ ఒన్‌సైడ్‌ భూముల కొనుగోళ్లపై సీబీఐ విచారణ చేయాలని నిన్నటి వరకూ డిమాండ్‌ చేసిన చంద్రబాబు.. తాజాగా తన డిమాండ్‌లో కొత్త పదాన్ని చేర్చారు. సీబీఐ విచారణ టీడీపీ హయాంపైనే కాదు,.. గత పదహారు నెలల వైసీపీ పాలనపై కూడా చేయాలన్నారు.

అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ, సిట్‌ దర్యాప్తులు, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల చర్యలపై స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దర్యాప్తులను నిలిపివేయాలని టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు కోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ ప్రాథమిక దశలోనే హైకోర్టు స్టే ఇవ్వడంతో దేశంలోని ప్రముఖులు ఆశ్చర్యపోయారు. అదే సమయంలో చంద్రబాబు.. ఈ విషయాన్ని వదిలి.. వైసీపీ పాలనపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేయడం రాష్ట్ర ప్రజలు ఆలోచించేలా చేసింది. అమరావతిపై దర్యాప్తును అడ్డుకుంటూ.. మరో వైపు వైసీపీ పాలనపై సీబీఐ దర్యాప్తు చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయనే భావన టీడీపీ నేతలు గుర్తించినట్లుగా ఉంది. అందుకే చంద్రబాబు.. టీడీపీ హాయంపైనే కాదు.. 16 నెలల వైసీపీ పాలనపై కూడా సీబీఐ దర్యాప్తు చేయాలనే డిమాండ్‌ను ఎత్తుకున్నారనే టాక్‌ నడుస్తోంది.

కారణం ఏమైనా చంద్రబాబు తమ పాలనతోపాటు వైసీపీ పాలనపై కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. మరి ఇక హైకోర్టులో వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు వేసిన పిటిషన్లు ఉపసంహరించుకుంటారా..? పిటిషన్లు ఉపసంహరించుకున్న తర్వాత రెండు ప్రభుత్వాల పాలనపై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారా..? అనే అంశమే ఇప్పుడు మిగిలి ఉంది. ప్రజల దృష్టిని మరల్చేందుకు తూతూ మంత్ర ప్రకటనలు చేయడం ద్వారా జరిగిన నష్టాన్ని పూరించలేమనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలనే సూచనలు వస్తున్నాయి. చేసిన డిమాండ్‌కు కట్టుబడి పిటిషన్లు విరమించుకుని, కేంద్రానికి లేఖ రాయాలని సలహాలు బాబుకు ఎవరూ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి బాబు తన మాటకు ఈ విషయంలోనైనా కట్టుబడి ఉంటారా..? లేదా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి