iDreamPost

చైత్ర పాప కేసు – రైల్వే ట్రాక్ పై నిందితుడి శవం

చైత్ర పాప కేసు – రైల్వే ట్రాక్ పై నిందితుడి శవం

సైదాబాద్ అత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గత వారం రోజుల నుంచి పోలీసు యంత్రాంగాన్ని ముప్ప తిప్పలు పెడుతున్న అతను నేడు శవమై కనిపించాడు. వరంగల్ టూ ఘటకేసర్ రైల్వే ట్రాక్ మీద విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. అన్ని వైపులా నుంచి పోలీసులు, ప్రజలు పెద్ద ఎత్తున గాలిస్తున్న క్రమంలో తప్పించుకునే మార్గం లేక అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని భావిస్తున్నారు. ఈ నెల 9న అతను సింగరేణి కాలనీలో చిన్నారిని రేప్ చేసి హత్య చేసాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నారని వార్తలు వచ్చాయి.

పామునూరు వద్ద రైల్వే ట్రాక్ మీద అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యాచారం తర్వాత అతని ఆచూకీ కోసం పది లక్షల రివార్డు కూడా ప్రకటించారు. రెండు రాష్ట్రాల పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆంధ్రా తెలంగాణా సరిహద్దుల్లో అతని ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. అయినా సరే అతని విషయంలో ఏ ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఏడు రోజుల నుంచి అతని కోసం పోలీసులు మఫ్టీ లో కూడా తిరిగారు. ఇక ప్రజల్లో అవగాహన కోసం అతని ఫోటో లతో వాల్ పోస్టర్ లు అంటించారు. ఈ ఘటనపై సినీ హీరోలు కూడా స్పందించారు.

ఇక అతన్ని పట్టుకోవడానికి ఏకంగా డీజీపీ రంగంలోకి దిగడం గమనార్హం. నిన్నటి నుంచి ఈ విషయంలో పోలీసులు మరింత ఫోకస్ చేసి దాదాపుగా అతని కోసం 70 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. కాని అతని ఆచూకీ దొరకలేదు. ముందు అతను రాష్ట్రం ధాటి వెళ్ళిపోయాడు అని భావించారు. కాని కొన్ని సీసీ ఫూటేజ్ ల ఆధారంగా హైదరాబాద్ పరిసరాల్లోనే అతను ఉన్నాడని గుర్తించారు. ఇక ఎన్కౌంటర్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేసాయి. దిశా ఘటన తరహాలో చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

Also Read: ఆంధ్రాలో నేరాలు పెరిగిపోయాయా? అసలు నిజాలేంటి?

ఈ ఘటనపై సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ సోషల్ మీడియాలో స్పందించారు. హీరో మహేష్ బాబు, మంచు మనోజ్ ఘటనపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇక ఈ ఘటనకు సంబంధించి వైఎస్ షర్మిల అయితే నిరాహార దీక్షకు కూడా దిగారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీసు విభాగం పలు ఫోటోలను కూడా విడుదల చేసింది. అతని కుటుంబ సభ్యుల గురించి వివరాలను సేకరించింది.

అతని తల్లి తండ్రులు జనగామ జిల్లాకు చెందిన వారు అని పెళ్లి అయిన తర్వాత హైదరాబాద్ వచ్చారు అని రాజు హైదరాబాద్ లోనే పుట్టాడు అని గుర్తించారు. ఇక అతన్ని స్నేహితుడు తప్పించాడు అనే ప్రచారం కూడా జరిగింది. నేడు ఉదయం పది గంటల తర్వాత మృతదేహం గురించి సమాచారం రావడం అది రాజుది అని గుర్తించడం జరిగాయి. చేతిపై అతని భార్య మౌనిక అని టాటూ వేయించుకోవడంతో పోలీసులు రాజుగా గుర్తించారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని చెప్పారు.

Also Read: బిగ్‌బాస్ జోలి మీకెందుకు నారాయ‌ణ‌?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి