iDreamPost

గెహ్లాట్‌ సర్కారుకు రాజ్యసభ గండం!

గెహ్లాట్‌ సర్కారుకు రాజ్యసభ గండం!

కాంగ్రెస్‌ను పడగొట్టేందుకు కుట్రా..?

రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిందా?  ఈ నెల 19న రాజస్థాన్‌లోని 3 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ సుస్థిరతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి.

ప్రతిపక్ష బిజెపి తమ ఎమ్మెల్యేలను ఎగరేసుకుపోవచ్చన్న భయంతో సిఎం అశోక్ గెహ్లాట్‌ ఆదేశంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఢిల్లీ-జైపూర్ హైవేపై శివ్ సిలాస్ రిసార్టుకు తరలించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం బిజెపి నైజమని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఆరోపించారు. కాంగ్రెస్‌లో అభద్రతా భావన నెలకొందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా కొట్టిపారేశారు.

రాజస్థాన్‌లో తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ తరహాలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయని రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ విప్ మహేష్ జోషి విమర్శించారు.

ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిపై విచారణ జరపాలని ఎసిబికి మహేష్ జోషి లేఖ రాశారు. తమ ఎమ్మెల్యేలను డబ్బులతో ప్రలోభ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు లేఖలో తెలిపారు.

జూన్ 19న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అనైతికంగా గెలిచేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని జోషి మండిపడ్డారు. రాజస్థాన్‌లో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగనుండగా.. ఎమ్మెల్యేల మెజారిటీ ప్రకారం రెండు కాంగ్రెస్‌, ఒకటి బిజెపి గెలిచే అవకాశం ఉందని అన్నారు.

కానీ, బిజెపి రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

బిజెపి తరపున రాజేంద్ర గెహ్లాట్, ఓంకర్ సింగ్ లఖవత్ లు బరిలో ఉన్నారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓటును రాజేంద్ర గెహ్లాట్ కి వేయాలని బిజెపి తన ఎమ్మెల్యేలకు సూచించింది. రెండో ప్రాధాన్యత ఓటును ఓంకర్ సింగ్ లఖవత్ కు వేయాలని బిజెపి నిర్ణయించింది.

బిజెపికి 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు ఆర్ఎల్పీ ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతు ఇస్తారు. ఆర్ఎల్పీ ఎన్డీఎ భాగస్వామి.

మొత్తం 75 మంది ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు. ఇందులో రాజేంద్ర గెహ్లాట్ కి 51 ఓట్లు వేయాలని, మిగిలిన 24 ఓట్లు ఓంకర్ సింగ్ లఖవత్ కు వేయాలని‌ బిజెపి నిర్ణయించింది.

కాంగ్రెస్ కు 107 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను బరిలో దింపింది. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ సీనియర్ నేత కెసి వేణుగోపాల్, నీరాజ్ డంగీలను పోటీ చేస్తున్నారు. అయితే జూన్ 19న రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలెట్ అనుచర ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి