iDreamPost

పార్టీలకు కోట్లలో విరాళాలు! BJP, BRS, INC, YCP, TDP లెక్కలివే!

  • Published Jul 12, 2023 | 11:12 AMUpdated Jul 12, 2023 | 11:12 AM
  • Published Jul 12, 2023 | 11:12 AMUpdated Jul 12, 2023 | 11:12 AM
పార్టీలకు కోట్లలో విరాళాలు! BJP, BRS, INC, YCP, TDP లెక్కలివే!

రాజకీయ పార్టీలకు పలువురు వ్యాపారవేత్తలు, కార్యకర్తలు స్వతంత్రంగా విరాళాలు ఇస్తారనే విషయం తెలిసిందే. తాజాగా ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో కూడా భారీగా విరాళాలు వచ్చి పడ్డాయి. అయితే.. ఆ విరాళాలు ఏ చిన్నా చితకా మొత్తంలో ఉంటాయని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ట్రెండ్‌ చూసుకుంటే.. భారీ సభలు, ఆకాశాన్ని తాకే కటౌట్లు, ఎటు చూసినా కనిపించే ఫ్లెక్సీలు, ర్యాలీలు, యాత్రలు, పార్టీ అంతర్గత సమావేశాలు, విందులు ఇలా ఒకటా రెండో.. హంగూ ఆర్భాటం అనే పదానికి మించి రిచ్‌ రాజకీయం మన దేశంలో నడుస్తోంది.

కొన్ని పార్టీలైతే తమ సమావేశాలను వైవ్‌ స్టార్‌, సెవెన్‌స్టార్‌ హోటల్స్‌లో నిర్వహిస్తున్నాయంటే వాళ్ల మెయింటేనెన్స్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే.. ఇదిగో ఇలా విరాళాల సేకరణ నుంచే. తాజాగా అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) అనే సంస్థ చేసిన అధ్యయంలో 2016 నుంచి 2022 మధ్య కాలంలో దేశంలోని రాజకీయ పార్టీలు సేకరించిన విరాళాల లెక్కలు వెల్లడయ్యాయి.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అన్ని పార్టీల కంటే అతి భారీగా అక్షరాల రూ.10 వేల కోట్ల విరాళాలు సేకరించింది. ఇది మిగతా అన్ని పార్టీల మొత్తం విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువ. బీజేపీ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ రూ.1547.439 కోట్ల విరాళాలతో దేశంలో రెండో స్థానంలో ఉంది. కానీ.. బీజేపీకి కాంగ్రెస్‌కి దాదాపు 8.5 వేల కోట్ల తేడా ఉంది. కాంగ్రెస్‌ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రూ.823.301 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎం)కి రూ.367.167 కోట్లు, ఎన్సీపీకి రూ.231.614 కోట్ల విరాళాలు వచ్చాయి.

ప్రాంతీయ పార్టీలు..
జాతీయ పార్టీల పరిస్థతి విరాళాలలో కళకళగా ఉంటే.. మేమేం తక్కువ తిన్నామా అంటూ.. ప్రాంతీయ పార్టీలు సైతం భారీగానే విరాళాలు సేకరించాయి. ప్రాంతీయ పార్టీల్లో బిజు జనతాదళ్‌(బీజేడీ) అత్యధికంగా రూ.692.60 కోట్ల విరాళాలు సేకరించింది. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న భారత్‌ రాష్ట్ర సమితికి రూ.476.89 కోట్ల విరాళం వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు సేకరించిన రెండో ప్రాంతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ నిలిచింది.

మూడో స్థానంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ రూ.475.73 కోట్లు సేకరించింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూ.456.20 కోట్ల విరాళాలు సేకరించింది. ఆ తర్వాత శివసేన రూ.267.90 కోట్లు, ఆమ్‌ ఆద్మీ పార్టీ రూ.169.70 కోట్లు, తెలుగుదేశం పార్టీ రూ.168.67 కోట్ల విరాళాలు సేకరించాయి. మరి ఈ పార్టీలకు వచ్చిన విరాళాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: సిధి ఘటన.. గిరిజనుడిపై మూత్రం పోసిన వ్యక్తి ఇల్లు ధ్వంసం..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి