iDreamPost

ఎన్నికలకన్నా ముందే అధికారంలోకి వస్తాం : బాలకృష్ణ

ఎన్నికలకన్నా ముందే అధికారంలోకి వస్తాం : బాలకృష్ణ

బాలకృష్ణ గురించి టీడీపీ నాయకులు ఎవరైనా మాట్లాడాల్సిన సందర్భం వస్తే చాలా ఆచితూచి మాట్లాడతారు . మా బాలయ్యది పసిపిల్లోడి మనస్తత్వం అండీ , మనసులో ఏదీ ఉంచుకోడు .బోలా శంకరుడి లాంటి వాడు లాంటి పదజాలం వాడుతూ ఇబ్బందికరంగా చూస్తూ రెండు ముక్కల్లో ముగించే ప్రయత్నం చేస్తారు . ఎవరి పట్ల అయినా దురుసుగా ప్రవర్తించిన విషయం కానీ చెయ్యి చేసుకొన్న ఘటనలు కానీ ప్రస్తావనకు వస్తే అబ్బే ఆయన కోపం తాటాకు మంట లాంటిది , తాత్కాలికంగా ఆవేశపడ్డా కోపం చల్లారగానే ఆయనే పిలిచి పరామర్శిస్తారు లాంటి కబుర్లు అలవోకగా చెప్పేస్తారు .

వాస్తవానికి ఈ ప్రశ్నోత్తరాలు బాలయ్య మానసిక పరిపక్వత రాబట్టటానికి , కప్పెట్టటానికి జరిగే సంఘర్షణగా వీక్షకులకు సులువుగానే అర్ధమవుతుంది . ప్రశ్నించేవారు సూటిగా అడగలేరు . జవాబిచ్చేవారు దాటవేయకుండా ఉండలేరు . జనాలు అర్థం చేసుకోలేని అమాయకులు కారు . అయినా చంద్రబాబుకి నందమూరి వారసత్వం ఇమేజ్ అవసరమున్నంత కాలం ఈ ముసుగు తప్పదు . బాలకృష్ణ ఏదొకటి వాగి నవ్వుల పాలైనా పల్లబిగువున నవ్వకతప్పదు .

బహిరంగ సభలో ప్రధాని పై తీవ్ర వ్యాఖ్యలు చేసినా , అమ్మాయిలు కనపడితే ముద్దైనా పెట్టాలి , కడుపైనా చేయాలి లాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసినా , మా బ్లడ్డు వేరు బ్రీడ్ వేరు అంటూ అభిజాత్యపు వ్యాఖ్యలు చేసినా , పలు మీటింగుల్లో అభిమానుల చెంపలు చెల్లుమనిపించినా , చివరికి ఎన్నికల ప్రచారంలో వాహనం దిగి అభిమానుల్ని కాలితో తన్నినా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి కాస్తో కూస్తో ప్రజాకర్షణ ఉన్న వారసుడిగా బాలయ్యని బలవంతంగా భరాయించక తప్పని స్థితి బాబుది .

ఇలాంటి క్లిష్టపరిస్థితే మొన్న జూమ్ మహానాడులో బాలకృష్ణ మాట్లాడేప్పుడు బాబుకి ఎదురయ్యింది .

జూమ్ మహానాడులో బాలయ్య మాట్లాడుతూ అధికారం కోసం ఐదేళ్లు ఆగక్కర్లేదు అని ఎన్టీఆర్ ఆశీస్సులతో ముందే అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు .

ఇక్కడ బాలయ్యకి అర్థం కానిది ఏంటంటే తనని వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కుని పరోక్షంగా తన మృతికి కారణమైన బాబుకి ఎన్టీఆర్ ఆశీస్సులు అందిస్తాడా ? .

తన అధికారాన్నే కాపాడుకోలేక వైస్రాయ్ హోటల్ ముందు సొంత పార్టీ నాయకుల చేత చెప్పులు వేయించిన బాబుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయమని సంకల్పించి మంత్రించి గద్దెనెక్కిస్తాడా ? .

అసెంబ్లీలో ఒక్క మాట మాట్లాడడానికి మైకు కూడా ఇవ్వకపోతే కన్నీళ్లు పెట్టుకొని అసహాయంగా బయటికి వచ్చిన ఎన్టీఆర్ ఆశీస్సులకి బాబుని గద్దెనెక్కించేంత శక్తి ఉంటుందా ? .

తాము అధికారంలో ఉన్నా, 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కొని భవిష్యత్తులో కూడా విజయం సాధించాలని కలలు కన్న బాబు కుట్రలకు విసిగి వేసారిన జనం ఇచ్చిన విస్పష్ట తీర్పుతో 175 కి 151 మంది ఎమ్మెల్యేలతో అధికారం చేపట్టిన జగన్ నుండి అధికారం లాక్కోవాలని అందుకు తండ్రి ఆశీస్సులు కావాలని బాలకృష్ణ కోరుకోవడం అన్నది హాస్యాస్పదము,సినిమా డైలాగులు రాజకీయాల్లో చెల్లవు.

బావమరిది బతకగోరతాడు మా బాలయ్య ఎదో కారణం లేనిదే అలా చెప్పడు అని చంద్రబాబు భావించాలి. ఈ మధ్య కొందరు వేస్తున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాల మీద సోషల్ మీడియాలో ఒక జోక్ నడుస్తుంది..న్యాయవ్యవస్థ అవకాశం ఇవ్వలేదు కానీ లేకుంటే ఎవరో ఒకరు చంద్రబాబును ముఖ్యమంత్రిగా నియమించాలని ఎవరైనా కోర్టు వెళ్లేవారే … రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ సినిమా డైలాగులు మాని తనను గెలిపించిన హిందూపూర్ ప్రజల సమస్యలు పట్టించుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి