iDreamPost

ఊరు దాటాలంటే ఇక అది తప్పనిసరి..!

ఊరు దాటాలంటే ఇక అది తప్పనిసరి..!

లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వైరస్ ను దేశంలో పూర్తిగా కట్టడి చేయలేమన్న భావనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ నుంచి అనేక అంశాలకు సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు నుంచి అత్యంత కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థను కూడా తిరిగి పట్టాలెక్కించింది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ నెల 17వ తేదీ తో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరుసటి రోజు నుంచి దేశీయంగా విమాన సర్వీసులు కూడా నడిపేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. పలు రాష్ట్రాల్లో ఆర్టీసీ సర్వీసులు కూడా పునరుద్ధరించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అతి త్వరలో ప్రగతి రథ చక్రాలు కూడా రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా వైరస్ సోకిన వారిని ట్రేస్ చేసేందుకు, వారి ద్వారా మరొకరికి వైరస్ రాకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ ను మరింత విస్తృతంగా వినియోగించుకొని కరోనా ను కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ యాప్ ను ఈ పాస్ లు జారీ చేసేందుకు, టెలీ మెడిసిన్ సదుపాయం పొందేందుకు తప్పనిసరి చేసింది. అంతేకాకుండా రైల్వే, విమాన ప్రయాణాలు సహా ఉద్యోగ, వ్యాపార నిమిత్తం పలు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే వారి మొబైల్ లో ఈ యాప్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి