iDreamPost

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్​ఆర్టీసీ!

  • Author singhj Published - 09:16 AM, Wed - 9 August 23
  • Author singhj Published - 09:16 AM, Wed - 9 August 23
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్​ఆర్టీసీ!

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులకు ఏపీఎస్​ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఏపీఎస్​ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వచ్చే భక్తులకు అందించే దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు పెంచింది. ఈ కోటాలో మొన్నటి వరకు ప్రతి రోజూ ఆర్టీసీ ప్రయాణికులకు రాష్ట్రవ్యాప్తంగా 600 టికెట్లు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సంఖ్యను 1,000కి పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. బస్సులో ప్రయాణించే భక్తులు బస్సు ఛార్జీకి తోడు వెంకన్న దర్శనానికి రూ.300 దర్శన టికెట్​ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

వెంకన్న భక్తులు ఇప్పుడు బుక్ చేసుకునే టికెట్లు ఈ నెల 15 నుంచి అక్టోబర్ 7లోపు ప్రయాణాలు, దర్శనానికి ఉపయోగపడతాయి. దర్శన కోటా టికెట్ల బుకింగ్ మంగళవారం నుంచి ఏపీఎస్​ఆర్టీసీ వెబ్​సైట్​లో అందుబాటులోకి వచ్చిందని పల్నాడు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్​వీ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకునే భక్తులు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఏపీఎస్​ఆర్టీసీనే కాదు టీఎస్​ఆర్టీసీ కూడా తిరుమలకు వెళ్లే భక్తులకు రూ.300 శీఘ్ర దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తిరుమలకు వెళ్లే బస్సులకు సంబంధించిన టికెట్లను ఆన్​లైన్​లో రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే రూ.300 దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. తమిళనాడు, కర్ణాటక ఆర్టీసీలు కూడా ప్యాసింజర్లకు బస్ టికెట్లతో పాటు రూ.300 టికెట్లను అందిస్తున్నాయి. ఇకపోతే, టీటీడీ ఛైర్మన్​గా వైవీ సుబ్బారెడ్డి అందించిన సేవలను నూతనంగా టీటీడీ ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించనున్న భూమన కరుణాకర్ రెడ్డి మెచ్చుకున్నారు. ఈ మేరకు పాలకమండలి సమావేశంలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. తన పదవీకాలంలో వైవీ సుబ్బారెడ్డి సామాన్య భక్తులకు మెరుగైన వసతులు అందించేందుకు, దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. ఆయన సేవలను బోర్డు సభ్యులంతా కొనియాడారు. ఆ తర్వాత సుబ్బారెడ్డిని శాలువాతో సత్కరించారు భూమన.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి