iDreamPost

నాలుగు రోజులలోనే సత్తా చాటిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో

నాలుగు రోజులలోనే సత్తా చాటిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో

ఇసుక, మద్యం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) సత్తా చాటుతోంది. యువ ఐపీఎస్‌లు కదన రంగంలో దూసుకుపోతున్నారు. మద్యానికి సంబంధించి ఎక్కడ అక్రమాలు కనిపించినా కొరడా ఘుళిపిస్తున్నారు. నాలుగు రోజుల కిందటే బాధ్యతలు చేపట్టిన యువ ఐపీఎస్‌లు. మొదటి రోజు నుంచే తమ కార్యకలాపాలు మొదలుపెట్టారు.

రాష్ట్రంలో మద్య నిషేధం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్ల పర్యవేక్షణలో ఎస్‌ఈబీ బాధ్యులైన యువ ఐపీఎస్‌లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి అక్రమ మద్యం తరలిస్తున్న, తయారుచేస్తున్న 953 మందిని అరెస్టు చేశారు. వారిపై ఎక్సైజ్, ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌లలో కేసులు నమోదు చేశారు.

అలాగే దాదాపు పది వేల లీటర్ల మద్యం బాటిల్స్, ఏడు వేల లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. 12వేల కిలోల బెల్లం, 25,794 లీటర్ల బెల్లం ఊటను, 172 కిలోల గంజాయి, 309 వాహనాలు సీజ్‌ చేశారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 253 మందిని అరెస్టు చేశారు. ప్రతి రోజూ ప్రత్యేక బృందాల ద్వారా సెర్చ్‌ అపరేషన్లు నిర్వహిస్తూ అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తెలంగాణ బోర్డర్‌ నుంచి ఎక్కువ అక్రమ మద్యం వస్తున్నట్లు తేలడంతో ఆయా సరిహద్దుల్లో తనిఖీలు మరింత కఠినతరం చేశారు.

అక్రమాలను కూకటివేళ్లతో సహా పెకలించేలా..

గత ప్రభుత్వం హయాంలో ఇసుక, మద్యం మాఫియాలు రాష్ట్రవ్యాప్తంగా చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అప్పటి అధికార టీడీపీ నేతలే దగ్గరుండి అక్రమాలను ప్రోత్సహించి వందల, వేల కోట్లు సంపాదించుకున్నారు. ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారు. అందుకే రాజకీయాలతో సంబంధం లేకుండా మద్యం, ఇసుక అక్రమాలను పూర్తిగా రూపుమాపడానికి స్వయం ప్రతిపత్తి గల స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ను ఏర్పాటు చేశారు.

అనుకున్నదే తడువుగా ఏడుగురు యువ ఐపీఎస్‌లను నియమించారు. ఎస్‌ఈబీ కమిషనర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌ వ్యవహరించనున్నారు. ఆయనతోపాటు కె.ఆరిఫ్‌ హఫీజ్, గరుడ్‌ సుమిత్‌ సునీల్, రాహుల్‌దేవ్‌ సింగ్, అజిత వేజెండ్ల, గౌతమి శాలి, వకుల్‌ జిందాల్, వై.రిషాంత్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షణలో ఈ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పనిచేస్తుంది. నాటుసారా, అక్రమ మద్యం తయారీ, రవాణా, అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను అడ్డుకునేలా ఈ బృందం పనిచేస్తుంది.

ప్రస్తుతం ఉన్న ఏడుగురు ఐపీఎస్‌లకు తోడుగా మరో 11 మంది కూడా బాధ్యతలు చేపట్టారు. వీరంతా రాష్ట్రంలోని 18 పోలీస్‌ యూనిట్‌లను పర్యవేక్షిస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులతోపాటు ఆయా జిల్లాల పోలీసులతో జిల్లాల వారీగా టీమ్‌లు ఏర్పాటు చేస్తారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ మూలన కూడా అక్రమ మద్యం, అక్రమ ఇసుక తవ్వకాలు లేకుండా సమూలంగా నిర్మూలించే దిశగా సీఎం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతానికి ఆరుగురు ఐపీఎస్‌లకు జిల్లాలవారీగా బాధ్యతలు అప్పగించారు. గుంటూరు రూరల్‌కు కె.ఆరిఫ్‌ హఫీజ్, తూర్పుగోదావరికి గరుడ్‌ సుమిత్‌ సునీల్, విశాఖపట్నం రూరల్‌కు రాహుల్‌దేవ్‌ సింగ్, విశాఖ సిటీకి అజిత వేజెండ్ల, కర్నూలుకు గౌతమి శాలి, కృష్ణ జిల్లాకు వకుల్‌ జిందాల్, చిత్తూరుకు వై.రిషాంత్‌ రెడ్డిని నియమించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి