iDreamPost

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త.. సెప్టెంబర్‌లో పక్కా!

  • Author Dharani Published - 09:57 AM, Mon - 14 August 23
  • Author Dharani Published - 09:57 AM, Mon - 14 August 23
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త.. సెప్టెంబర్‌లో పక్కా!

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తీసుకున్న అతి గొప్ప నిర్ణయాల్లో.. సచివాలయ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల ఇంటి వద్దకే తీసుకురావడం.. అర్హులందరికి.. ప్రభుత్వ పథకాలు అందించడం కోసం సీఎం జగన్‌ సచివాలయ వ్యవస్థను తీసుకు వచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాన్ని.. సచివాలయాల ఉద్యోగులకు కూడా వర్తింప చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. సచివాలయాలతో పాటుగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పనిచేసే ఉద్యోగులకు సైతం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్‌) పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్) అమలుకు చర్యలు తీసుకున్నామన్నారు. అంతేకాక మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కూడా మరో ఏడాది పొడిగించామని.. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు చివరి నాటికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ ఈహెచ్‌ఎస్ (ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్) కార్డులు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు సీఎజ్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి సుమారు 22 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వారందరికీ హెల్త్‌కార్డులు అందించేలా కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి ప్రభుత్వ వాటా నిధులు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సకాలంలో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎస్‌ జవహర్‌రెడ్డి.. అధికారులకు సూచించారు. గుండె, కిడ్నీ, క్యాన్సర్‌ వంటి 10 ప్రధాన ప్రొసీజర్లకు ప్రస్తుతం ఇస్తున్న ప్యాకేజీ రేట్లను సవరించాల్సిన అవసరం ఉందని.. దానిపై తగిన ప్రతిపాదనలు సిద్ధంచేసి పంపాలని ఆరోగ్యశ్రీ సీఈవోను ఆదేశించారు సీఎస్‌ జవహర్‌ రెడ్డి.

అంతేకాక మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని మరింత స్ట్రీమ్‌లైన్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. గుండె జబ్బు రోగులకు కేంద్రం నిర్దేశించిన టాప్‌ బ్రాండ్‌ స్టంట్‌కే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని.. ఆ స్టంటే వేసేలా నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. ఈహెచ్‌ఎస్ అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు వెంటనే సమావేశాలు నిర్వహించేలా ఆదేశిస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను సెప్టెంబర్‌ నాటికి ఈ పథకం కిందకు తీసుకొస్తామని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి