iDreamPost

పరిపాలన రాజధానికి ప్రగతి హారతి

పరిపాలన రాజధానికి ప్రగతి హారతి

పర్యాటక రాజధానిగా భాసిల్లుతున్న విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో వేగంగా అడుగులు వేస్తోంది. రాజధాని అయ్యాక పెరిగే జనాభా, సందర్శకుల రద్దీకి అవసరమైన మౌలిక వసతులు, ప్రత్యేక ప్రాజెక్టుల మంజూరుకు నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా విశాఖ నుంచి కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ వరకు రోడ్ కనెక్టివిటీ పెంచడం.. ఆ మార్గాన్ని పర్యాటక స్వర్గధామంగానూ, ఐటీ కేంద్రంగానూ తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

8 వరసల కోస్టల్ హైవే

విశాఖ పరిపాలన రాజధాని అయితే రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రాకపోకల రద్దీ పెరుగుతుంది. ఇప్పటికే పర్యాటక, పారిశ్రామిక రాజధానిగా ఉన్న నగరంపై అదనపు భారం పడుతుంది. దాన్ని తట్టుకొని భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ-భోగాపురం హైవేపై ఇప్పటికే వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. రాజధాని అయితే అది మరింత పెరుగుతుంది. జాతీయ రహదారిపై ఒత్తిడిని తగ్గించేందుకు దానికి సమాంతరంగా విశాఖ నగరంలోని కైలాసగిరి 
నుంచి భోగాపురం వరకు 19 కిలోమీటర్ల బీచ్ రోడ్డును 
ఎనిమిది వరసలకు విస్తరించి కోస్టల్ హైవే నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సుమారు రూ.1700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికే డీపీఅర్ తయారు చేసి ఆమోదానికి కేంద్రానికి పంపారు. ఈ రోడ్డు నిర్మాణంతో పాటు రోడ్డుకు ఇరువైపులా పారిశ్రామిక, ఐటీ పార్కులు అభివృద్ధి చేయనున్నారు. అలాగే ఈ రహదారి నిర్మాణంలో భాగంగా గోస్తనీ నదిపై 2.6 కిలోమీటర్ల పొడవునా వంతెన నిర్మాణం చేపడతారు.

11 బీచ్ ల అభివృద్ధి

ప్రతిపాదిత కోస్టల్ హైవే వెంబడి 11 కొత్త బీచ్ లను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మార్గంలో ఇప్పటికే రుషి కొండ బీచ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతోపాటు సాగర్ నగర్, కాపులుప్పాడ, మంగమారిపేట, భీమిలితో సహా భోగాపురం వరకు ఉన్న 11 బీచ్ లను గోవా తరహాలో అభివృద్ధి చేస్తారు. కైలాసగిరి వద్ద స్కై టవర్, విశాఖ బీచ్ రోడ్డులో ఇప్పుడున్న కురుసుర సబ్ మెరైన్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలకు అదనంగా నౌకా రెస్టారెంట్ ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇవన్నీ పూర్తి అయితే పర్యాటకంగాను విశాఖ పరుగులు తీస్తుంది. ప్రజా రవాణాను విస్తృతం చేసేందుకు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును పొడిగించాలని ఇప్పటికే నిర్ణయించారు. గాజువాక నుంచి కొమ్మాది వరకు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం వరకు పొడిగించారు. రూ. 14 వేల కోట్ల అంచనాతో 76 కిలోమీటర్ల నిడివిన నిర్మించే ఈ కారిడార్ లో 53 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి