iDreamPost

ఆంధ్రప్రదేశ్.. అన్నపూర్ణ

ఆంధ్రప్రదేశ్.. అన్నపూర్ణ

‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్.. ఆ పేరుకు తగ్గట్లుగా దేశానికి ఆపత్కాలంలో అన్నం పెడుతోంది. కరోనా ఆపద సమయంలో దేశానికి ఆహార భద్రత కల్పించడంలో ప్రధానపాత్ర ఆంధ్రప్రదేశ్ పోషిస్తోంది. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల కొన్ని రాష్ట్రాలకు ఆహార కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లోని భారత ఆహార సంస్థ(ఎఫ్ సి ఐ) గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని ప్రత్యేక గూడ్స్ రైలు ద్వారా వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని ఎఫ్ సి ఐ గోదాముల నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు 116 గూడ్స్ రైలు ద్వారా బియ్యాన్ని పంపించారు.

కరోనా విపత్తు ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆహార కొరత సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. ఏ ఏ రాష్ట్రాల లోని ప్రజలకు ఆహార ధాన్యాలు అవసరమవుతాయో ముందుగానే గుర్తించింది. ఆ మేరకు బియ్యాన్ని ఆయా రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఎఫ్సీఐ గోదాముల నుంచి 3.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించారు. కరువు కాటకాలు, ఇతర విపత్కర పరిస్థితుల్లో దేశంలో ఆహార కొరత సమస్య తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం మూడు ఏళ్లకు సరిపడా ఆహార ధాన్యాలను నిల్వ ఉంచుతుంది. ఆయా రాష్ట్రాల్లో పండే పంటలను ఆయా రాష్ట్రాల్లోనే ప్రత్యేక గోదాములలో భద్రపరుస్తుంది.

ఈ ఏడాది ఖరీఫ్ లో ఆంధ్రప్రదేశ్ లో వరి ధాన్యం తో పాటు ఇతర పంటలు పుష్కలంగా పండాయి. గత పదేళ్లలో లేనటువంటి విధంగా కృష్ణా నదికి గత సీజన్ లో వరద పోటెత్తింది. దీంతో రాయలసీమతో పాటు కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టు లో కూడా పుష్కలంగా సాగు నీరు అందింది. దింతో పాటు గోదావరి డెల్టా పరిధిలో పది లక్షల ఎకరాల్లో వరి ధాన్యం పండింది. గత ఖరీఫ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ప్రస్తుతం రబీ పంట చేతికొచ్చింది. దాన్యం కొనుగోలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి