iDreamPost

ఆకాశంలో 100 చిన్నపిల్లలతో సూర్య

ఆకాశంలో 100 చిన్నపిల్లలతో సూర్య

గత కొంతకాలంగా తనకు సక్సెస్ దూరంగా ఉన్నా హీరో సూర్య బెంబేలెత్తిపోవడం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సాగుతూనే ఉన్నాడు. గత ఏడాది వచ్చిన ఎన్జికె దారుణంగా నిరాశపరిచినప్పటికీ ఇప్పుడు రాబోతున్న సూరారై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇప్పటికే టీజర్ జనాన్ని బాగా ఆకట్టుకుంది.

సామాన్యుడికి విమానయానం చేరువ చేయాలనే లక్ష్యంతో ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ గోపినాథ్ బయోపిక్ ఇది. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి కావొస్తోంది. ప్రమోషన్ కూడా వేగవంతం చేయబోతున్నారు.

అందులో భాగంగా రేపు ఈ సినిమాలోని రెండో ఆడియో సింగల్ ని చాలా స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారు. మాములుగా ఉంటే అందులో ప్రత్యేకత ఏముంది. అందులో నిర్మాతల్లో ఒకరైన సూర్య దానికోసం వినూత్నమైన ఐడియా వేశారు.

దాని ప్రకారం సూర్య స్పైస్ జెట్ సంస్థకు చెందిన బోయింగ్ 737 ఫ్లైట్ లో 100 మంది చిన్న పిల్లలను అందులో తీసుకెళ్లి ఆకాశంలో పాటను రిలీజ్ చేయబోతున్నాడు. విశేషం ఏంటంటే ఈ విమానం ప్రత్యేకంగా దీని కోసమే డిజైన్ చేశారట.

ఇందులో ప్రయాణం చేసే పిల్లలు ఇప్పటిదాకా ఫ్లైట్ అనుభవం లేని వాళ్ళు కావడంతో వాళ్లకు ఆ థ్రిల్ ని ఇస్తూనే ఇది ఎప్పటికి మర్చిపోలేని జ్ఞాపకంగా వాళ్లకు మిగల్చబోతున్నాడు. ఈ ఆకాశయానం 30 నిమిషాల పాటు సాగుతుంది. మాములుగా ఏదో సభ పెట్టి అభిమానుల హడావిడి మధ్య పాటలను రిలీజ్ చేయడం అందరూ ఫాలో అయ్యేదే. కానీ ఇలా చిన్నపిల్లలను తీసుకెళ్లి తనకు కూడా జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ప్లాన్ చేసుకోవడం చూస్తే నిజంగా సూర్య ఐడియాకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. వెంకటేష్ తో గురు తీసిన సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ ఆకాశమే నీ హద్దురా ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి