iDreamPost

75 ఏళ్ల వయస్సులో 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు

75 ఏళ్ల వయస్సులో 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు

‘మన లైఫ్‌లో మనకు ముఖ్యం అనుకునే వ్యక్తులు మనల్ని వదిలి వెళ్లిపోతే.. మనము వెళ్లిపోనక్కర్లేదు. ఏదో ఒక రోజు మన లైఫ్ మనకు నచ్చినట్లు మారుతుంది’ అని అట్లీ దర్శకత్వం వహించిన రాజారాణి సినిమాలో ఓ హీరోయిన్ చెబుతుంది. ప్రయత్నించాలే గానీ అది అక్షర సత్యం. ముఖ్యంగా భార్య, భర్తల విషయంలో.  భార్య/ భర్త చిన్న వయస్సులో చనిపోతే.. ఒంటరిగా మిగిలిన వ్యక్తులు కష్టపడి పిల్లల్ని పెంచుకుంటారు. జీవిత భాగస్వామి లేరన్న బాధను అణచివేసుకుని.. జీవచ్ఛవంలా బ్రతుకు ఈడస్తూ ఉంటారు. సెకండ్ మ్యారేజ్ అనేది (ముఖ్యంగా మహిళల విషయంలో) పెద్ద తప్పు అని సమాజంలోని మాటలను పట్టించుకుని.. ఒంటరిగా జీవిస్తుంటారు. అయితే వృద్ధాప్య దశకు వచ్చేసరికి.. పిల్లలు ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాల నిమిత్తం వేరో ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఆ వయస్సులో తమకు ఓ తోడు కావాలని పరితపిస్తుంటారు. కానీ సమాజం కోసం తమ అభిప్రాయాలను మనస్సులోనే అణచివేసుకుంటారు. అయితే వీరిద్దరూ తమకు ఆదరణ కావాలని భావించి పెళ్లితో ఏకమయ్యారు. అయితే ఇందులో ఒకరికి 35 ఏళ్లు కాగా, మరొకరికి 75 ఏళ్లు.

ఆసరా, ఆదరణ, పోషణ తమకు అవసరం అనుకున్న ఓ జంట పెళ్లి చేసుకుని ఓ వర్గానికి స్ఫూర్తి దాయకంగా నిలిచింది. ఇందులో పెళ్లికొడుకు వయస్సు 75 ఏళ్లు కాగా, వధువు వయస్సు 35 సంవత్సరాలు. అయితే వీరు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కళ్లు చెమర్చే కన్నీటి గాధలున్నాయి. ఇంతకు ఈ పెళ్లి ఎక్కడ జరిగిందటే.. కర్ణాటకలో రాష్ట్రంలో. వివరాల్లోకి వెళితే చిక్కబళ్లాపూర్ జిల్లా, సిడ్లఘట్ట తాలూకా మేలూరు గ్రామానికి చెందిన 75 ఏళ్ల ఈరన్న, మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన 35 ఏళ్ల అనుశ్రీ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ గతంలో వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు కాగా, ఇది రెండో వివాహం. ఈరన్నకు వివాహం కాగా, భార్య చనిపోయింది. ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిని పెంచి పెద్ద చేసి ఉన్నత స్థానంలో నిలబెట్టాడు తండ్రి. పిల్లలకు ఎకరం భూమి రాసిచ్చాడు. కుమార్తెకు దాదాపు రూ. 25 లక్షలు ఇచ్చాడు. అయితే ఆస్తి గొడవల కారణంగా పిల్లులు పట్టించుకోవడం లేదు. గత 5-6 నుండి ఒంటరిగా జీవిస్తున్నారు.

అయితే ఇదే సమయంలో ఈరన్నకు వృద్ధాప్య సమస్యలు వెంటాడటం మొదలు పెట్టాయి. శరీరం కూడా సహకరించకపోవడంతో తనకు ఓ తోడు కావాలని నిర్ణయించుకుని అనుశ్రీని వివాహం చేసుకున్నాడు. ఇక అనుశ్రీ విషయానికి వస్తే.. ఆమెదొక వింత గాధ. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కాగా, అతడు ఆమెను మోసం చేసి వెళ్లిపోయాడు. వీరికి 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. తమ మాట కాదని ప్రేమ పెళ్లి చేసుకుందన్న కారణంగా తల్లిదండ్రులు, బంధువులు ఆమెను పట్టించుకోలేదు. భర్త వదిలేయడంతో ఆమెకు ఎవ్వరూ ఆశ్రయం కల్పించలేదు. ఓ నర్సు ఆమెను చేరదీసింది. ఇదే సమయంలో పెళ్లి చేసుకోవాలన్న ఈరన్న బ్రోకర్లను సంప్రదించగా.. వారి ద్వారా ఈ సంబంధం కుదిర్చారు. తనకు నాలుగు ఎకరాల భూమి, ఇల్లు ఉందని, తన పోషణ కోసం పెళ్లి చేసుకుంటున్నానని చెప్పడంతో.. ఆమె కూడా తన కుమారుడికి తండ్రినివ్వాలని భావించి.. పెళ్లికి అంగీకరించింది. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి