iDreamPost

బంగ్లాదేశ్ ఏర్పడి… నేటికి 50 ఏళ్లు

బంగ్లాదేశ్ ఏర్పడి… నేటికి 50 ఏళ్లు

జాతి నిర్మూలన, అణచివేతలకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్థాన్‌లో ప్రారంభమైన తిరుగుబాటు భారత్‌ జోక్యంతో ఒక కొత్త దేశం పుట్టుకకు కారణమైంది. స్వాతంత్ర్య భానూదయంతో నూతన దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్‌కు భారత్‌తో విడదీయలేని పేగుబంధం ముడివడి ఉంది.

ఆంగ్లేయులు భారత్‌ నుంచి నిష్క్రమించేటప్పుడు దేశాన్ని రాజకీయంగా రెండు ముక్కలు చేశారు కానీ, భౌగోళికంగా భారత్‌ మూడు ముక్కలైంది. భారత్‌ నుంచి విడివడిన పాకిస్థాన్‌లోని పశ్చిమ, తూర్పు భాగాలు తల ఒకచోట, తోక మరోచోట విసిరేసినట్లుగా తయారయ్యాయి. ఈ రెండు భాగాల మధ్య 1,600 కిలోమీటర్ల పర్యంతం భారతీయ భూభాగం పరుచుకుని ఉండేది. మతం పేరిట పాకిస్థాన్‌ పెట్టిన వేరు కాపురం మూణ్నాళ్ల ముచ్చటైంది.

తూర్పు పాకిస్థాన్‌ బెంగాలీ భాషా ప్రాంతం; పశ్చిమ పాకిస్థాన్‌ పంజాబీ, సింధీ, బలూచీ, పఠాన్‌ వంటి జనవర్గాలకు నెలవు. ఏకమొత్తంగా చూస్తే ఉభయ పాకిస్థాన్‌ భూభాగాల్లో సైనికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పంజాబీ ముస్లిముల ఆధిక్యమే కొనసాగేది. పాక్‌లో ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొంది. దీనిపై 1960ల నాటికే తూర్పు పాకిస్థాన్‌లోని బెంగాలీ ముస్లిములలో తీవ్ర అసంతృప్తి రగిలింది.

అప్పటి పాక్‌ అధినేత ఆయూబ్‌ ఖాన్‌ పాలనలో తూర్పు, పశ్చిమ పాకిస్థాన్ల మధ్య విస్తృత ఆర్థిక అంతరాలు ఏర్పడ్డాయి. దీనిపై తూర్పు పాకిస్థానీ విద్యార్థులు, మేధావి వర్గాల్లో నిరసన గూడుకట్టుకోసాగింది. అంతలో 1965 భారత్‌-పాక్‌ యుద్థం సంభవించి తూర్పు పాక్‌ సైనిక దుర్బలత్వం బయటపడింది. పాక్‌లో తమకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్లనే వెనకబడి పోతున్నామని బెంగాలీ ముస్లిములు ఆవేదన చెందసాగారు. ఈ అసంతృప్తి తోనే షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ 1966లో ఆరు సూత్రాల స్వయంప్రతిపత్తి కార్యక్రమం ప్రకటించింది. తూర్పు, పశ్చిమ పాకిస్థాన్లతో సమాఖ్య వ్యవస్థ ఏర్పడాలని డిమాండ్‌ చేసింది. దీనిపై 1969 జనవరికల్లా విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది.

షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ తో పాటు అనేకమంది రాజకీయ, విద్యార్థి నాయకులు జైలుపాలయ్యారు. 1970 ఎన్నికల్లో అవామీ లీగ్‌ విజయాన్ని పాక్‌ నాయకత్వం గుర్తించడానికి నిరాకరించడమే కాదు.. ముజిబుర్‌ను అరెస్టు చేసింది కూడా. రోజురోజుకీ ఉద్ధృతమైన నిరసనోద్యమాన్ని అణచివేయడానికి అప్పటి పాక్‌ ప్రధాని యాహ్యాఖాన్‌ తూర్పు పాకిస్థాన్‌కు జనరల్‌ టిక్కా ఖాన్‌ను పంపారు. ఆయన 1971 మార్చి 25న పెద్దయెత్తున సైనిక చర్య చేపట్టారు.ఆ దమన కాండకు తట్టుకోలేక తూర్పు బెంగాలీ శరణార్థులు లక్షల సంఖ్యలో భారత్‌కు తరలివచ్చారు. పాక్ దాడి- భారత్ ప్రతిదాడి మరోవైపు బంగ్లా స్వాతంత్ర్య యోధులు ముక్తి వాహినిగా ఏర్పడి పాక్‌ సైన్యంపై గెరిల్లా పోరు సాగించారు.

Also Read : రఘురామకృష్ణ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్

ముక్తివాహినికి భారత్‌ సహాయ సహకారాలు అందిస్తోందంటూ పాకిస్థాన్‌ 1971 డిసెంబరు మూడున 12 భారతీయ వైమానిక స్థావరాలపై దాడులకు తెగబడింది. భారత్‌ ప్రతిచర్యకు దిగి తూర్పు పాకిస్థాన్‌పై దండెత్తింది. ఆ సందర్భంగా ‘లొంగిపోండి లేదా తుడిచిపెట్టేస్తాం’ అంటూ పాక్‌ సైనికులను ఉద్దేశించి నాటి ఫీల్డ్‌మార్షల్‌ మాణిక్‌షా చేసిన ప్రకటన ఎంతో ప్రసిద్ధి చెందింది. డిసెంబరు 14కల్లా పాక్‌ సైన్యం చేతులెత్తేసింది. 93,000 మందికిపైగా పాక్‌ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. అలా పశ్చిమ పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్థాన్ వేర్పడి.. స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఏర్పడి నేటికి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఆ దేశ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు.

బంగ్లా విముక్తి పోరాటానికి ఇందిరా గాంధీ సంపూర్ణ మద్దతు..!

1971 మార్చి 27న అప్పటి భారతదేశ ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్యపోరాటానికి పూర్తి మద్దతు తెలిపి బంగ్లా శరణార్థులకోసం భారత సరిహద్దులను తెరిపించారు. దాదాపు కోటి మంది శరణార్థులు పలురాష్ట్రాల్లోని శిబిరాల్లో తలదాచుకొన్నారు. అంతమంది శరణార్థులకు అవసరమయిన సౌకర్యాలు కలిపించడానికి వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టసాగింది భారత ప్రభుత్వం.

అమెరికా పశ్చిమ పాకిస్తానుకు మొదటినుంచి మిత్రదేశం కావడం వల్ల, పాకిస్తానుకు అవసరమయిన ఆయుధాలు, సామగ్రి సమకూర్చడానికి సిద్ధమయింది. వెంటనే ఇందిరా గాంధీ ఐరోపా పర్యటన జరిపి యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్లు పాకిస్తానుకు వ్యతిరేకంగా పనిచేసేలా ఒప్పించారు. ఆగష్టులో సోవియట్ యూనియన్‌తో ఇరవయ్యేళ్ళ మైత్రీ ఒప్పందం కుదుర్చుకొని ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. భారత్‌కు సోవియట్ యూనియన్ అండ చూసిన చైనా యుద్ధంలో పాల్గొనలేదు. కానీ, పాకిస్తానుకు కొన్ని ఆయుధాలు సరఫరా చేసింది.

పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్‌కు చెందిన బెంగాలి ప్రజల పై విస్తృతమైన జాతి నిర్మూలన మారణకాండ నిర్వహించింది, ముఖ్యంగా అల్పసంఖ్యాకులైన హిందు జనాభాని నిర్మూలించడం పై దృష్టి కేంద్రీకరించింది. దాని వల్ల, సుమారు కోటి మంది తూర్పు పాకిస్తాన్ వదిలి సరిహద్దు భారత రాష్ట్రాలలోకి శరణార్దులుగా వచ్చారు. తూర్పు పాకిస్తాన్-భారతదేశపు సరిహద్దుని శరణార్ధులకు భారతదేశంలో రక్షితమైన ఆశ్రయం కల్పించడం కోసం తెరిచారు. పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, మేఘాలయా, త్రిపురా రాష్ట్ర ప్రభుత్వాలు సరిహద్దులలో, శరణార్ధుల శిబిరాలు ఏర్పాటు చేసి, ఆదుకున్నాయి.

Also Read : “కోట్ల” రాజకీయ భవిషత్తు ఏమవుతుంది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి