iDreamPost
android-app
ios-app

హెచ్చరిక: తెలంగాణలోని ఆ ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చే అవకాశం!

హెచ్చరిక: తెలంగాణలోని ఆ ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చే అవకాశం!

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ఎడ తెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షా పాతం నమోదయింది. భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో ముందెన్నడూ లేని విధంగా రికార్డు బ్రేకింగ్‌ వర్షపాతం నమోదైంది. ఏకంగా 616.5 మిల్లీ మీటర్ల వర్షపాతం పడింది. అన్ని ప్రాంతాల్లో 183 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే పలు జిల్లాల్లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఈ మేరకు తెలంగాణ వెధర్‌మ్యాన్‌ ట్విటర్‌ ఖాతాలో భారీ వరదలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. తెలంగాణ వెధర్‌మ్యాన్‌ ప్రకారం.. ‘‘ తూర్పు, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉన్నట్టుండి భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. గోదావరి డేంజర్‌ మార్కును దాటే అవకాశం కూడా ఉంది. ఇక, వరంగల్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, మమబూబాబాద్‌, భద్రాద్రికి ప్రమాదకర వరదలు రావచ్చు. ప్రతీ ఒక్కరూ ఇళ్లలో ఉండాలని ప్రార్థన. ఎవ్వరూ బయటకు రావద్దు​.

అనవసరంగా బయట తిరగద్దు.. కొన్ని ప్రాంతాల్లో దారుణమైన వరదలు వస్తున్నాయి’’ అని పేర్కొంది. ఇక, ఈ రోజంతా( గురువారం) వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు.. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. దాదాపు 10 జిల్లాల్లో అతి భారీ నుంచి.. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను జారీ చేశారు. మరికొన్ని జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్‌ అలర్డ్‌ను జారీ చేశారు.