Idream media
Idream media
రాబోయే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అంటూ పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… పొత్తులకు తాను సిద్ధమేనంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అలా పవన్ అన్నారో లేదో.. ఇలా టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి స్వాగతించారు. పొత్తులకు తాము సిద్ధమేనంటూ ప్రకటించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితరులు పవన్ ప్రకటనను స్వాగతిస్తూనే, పొత్తుల అంశం తమ అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారంటూ ముక్తాయించారు.
పవన్ ప్రకటన, టీడీపీ నేతల స్పందన అంతా బాగానే ఉంది. మరి టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడు చెప్పిన ‘లెక్క’ సంగతి ఏమిటి..? అనే ప్రశ్న వినిపిస్తోంది. పొత్తులు పెట్టుకుంటే అచ్చెం నాయుడు చెప్పిన లెక్క తప్పుతుంది. ఇటీవల పలుమార్లు వచ్చే ఎన్నికల్లో తమకు 160 సీట్లు వస్తాయని అచ్చెం నాయుడు బల్లగుద్ది మరీ చెప్పారు. 175 సీట్లలో 160 సీట్లు గెలవడం అంటే అదో చరిత్ర. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ రికార్డును బ్రేక్ చేస్తామనేలా అచ్చెం నాయుడు స్టేట్‌మెంట్లు ఇచ్చారు.
160 సీట్లు రావాలంటే 175 సీట్లలో పోటీ చేయాలి. మరి జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి సీట్లు ఇవ్వాలి. 15 సీట్లు ఇచ్చి మిగతా 160 సీట్లలో పోటీచేస్తే.. పోటీచేసిన ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ గెలవాలి. చివరకు పులివెందులలోనూ టీడీపీ విజయం సాధించాలి. అప్పుడే అచ్చెం నాయుడు లెక్క కరెక్ట్ అవుతుంది. లేదంటే 2014 ఎన్నికల్లో మాదిరిగా జనసేన పోటీకి దూరంగా ఉండి, టీడీపీకి భేషరతుగా మద్ధతు ఇవ్వాలి.కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు.గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీచేసి ఓడిపోయిన విషయాన్ని ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుని బాధపడుతూనే ఉన్నారు. కనీసం అసెంబ్లీకి వెళ్లలేకపోయాననే బాధ ఆయనలో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. అధికారంలోకి వస్తామని పవన్ ప్రకటించారు.
అధికారంలోకి రావాలనుకునే మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటే..10 లేదా 15 సీట్లలో పోటీచేయదు. ఒంటరిగా అయితే మొత్తం సీట్లలో పోటీ, పొత్తు అయితే సగం సీట్లలోనైనా పోటీ చేస్తుంది.వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అంటూ ఒంటరిగా పోటీ లేదని పవన్ కళ్యాణ్ క్లారిటీగా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అనేది ఇప్పుడిప్పుడే క్లారిటీ రాదు. పొత్తులతోనే పోటీ చేస్తామని టీడీపీ నేతలు ఎప్పటి నుంచో పరోక్షంగా చెబుతూనే ఉన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అటు బీజేపీ, ఇటు జనసేనతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా అచ్చెం నాయుడు 160 సీట్లు గెలుస్తామని ప్రకటించడం.. నీరసించిపోయిన నేతలను, డీలాపడ్డ కార్యకర్తలను ఉత్తేజితులను చేయడం కోసమే తప్పా.. మరేమీ లేదని తేటతెల్లమైంది. ఈ పరిణామాల తర్వాత కూడా అచ్చెం నాయుడు మేము 160 సీట్లు గెలుస్తామనే మాట మాట్లాడతారా..? లేదా..? చూడాలి.