The Railway Men Web Series Review in Telugu: “ది రైల్వేమెన్‌” వెబ్‌ సిరీస్‌ రివ్యూ!

The Railway Men Web Series Review in Telugu: ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలోకి వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించింది ‘ ది రైల్వే మెన్‌’ వెబ్‌ సిరీస్‌. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ వెబ్‌ సిరీస్‌ హవానే నడుస్తోంది...

The Railway Men Web Series Review in Telugu: ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలోకి వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించింది ‘ ది రైల్వే మెన్‌’ వెబ్‌ సిరీస్‌. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ వెబ్‌ సిరీస్‌ హవానే నడుస్తోంది...

ఓటీటీ ట్రెండ్ మొదలయ్యాక సినిమా పరిధి మరింత పెరిగి పోయింది. ముఖ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే చిత్రాలకు, వెబ్ సిరీస్ లకు ఆదరణ ఎక్కువ అయ్యింది. ఈ నేపథ్యంలోనే తాజాగా “ది రైల్వేమెన్‌” అనే వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. 1984లో జరిగిన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన ఈ వెబ్ సిరీస్ మూల కథ. మరి.. చరిత్ర మిగిల్చిన చేదు జ్ఞాపకాలను ఈ సిరీస్ ఎంత వరకు కళ్ళకు కట్టకలిగింది? ఈ ప్రయత్నంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఎంత వరకు సక్సెస్ అయ్యింది? అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరం నడిబొడ్డులో యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇదో పురుగుల మందు ప్లాంట్. ఆ ప్లాంట్ లో “మిథైల్ ఐసోసనియేట్” అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనాన్ని తయారు చేస్తుంటారు. ఇది అమెరికన్ బేస్డ్ కార్బన్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ నుండి లాభాలు రావడం లేదని యజమానులు దీని భద్రత విషయంలో అంతగా శ్రద్ద వహించరు. దీని కారణంగా గ్యాస్ లీక్ కావచ్చు! అదే జరిగితే ఊహించని ప్రమాదం జరుగుతుందని ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఇమద్, మరో రిపోర్ట్రర్ పోరాటం చేస్తూనే ఉంటారు. కానీ.., అంతలో ఆ దుర్ఘటన జరిగిపోతుంది. భోపాల్ పట్టణం అంతా “మిథైల్ ఐసోసనియేట్” గ్యాస్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇక అక్కడ నుండి ఇఫ్తికార్‌ సిద్ధిఖీ అనే ఓ స్టేషన్ మాస్టర్, కంపెనీ మాజీ ఉద్యోగి ఇమద్, బల్వంత్ యాదవ్ అనే ఓ దొంగ, సెంట్రల్ రైల్వే జోన్ జెనరల్ మేనేజర్ అయిన పాటిల్ పాండే ప్రజలను కాపాడటానికి ఎంత వరకు పోరాడారు? వీరి వల్ల ప్రాణ నష్టం ఎంత వరకు తగ్గింది అన్నదే ఈ సిరీస్ కథ.

విశ్లేషణ:

“హిస్టారికల్ డ్రామా డిజాస్టర్”.. ఇలాంటి ఓ జోనర్ మూవీ చేయాలంటే ముఖ్యంగా దర్శకుడికి దైర్యం ఉండాలి. చరిత్రపైన పట్టు ఉండాలి. సినిమాటిక్ నాలెడ్జ్ కన్నా.. హ్యూమన్ ఎమోషన్స్ ని సరిగ్గా క్యాచ్ చేయగల సెన్స్ బిలిటీ ఉండాలి. వాస్తవాన్ని దైర్యంగా చూపించగల తెగింపు ఉండాలి. “ది రైల్వేమెన్‌” అనే వెబ్ సిరీస్ తెరకెక్కించిన దర్శకుడు శివ్‌ రావైల్‌ ఈ అన్నీ విషయాల్లో సమర్ధుడని సిరీస్ చూస్తుండగానే అర్ధం అయిపోతుంది. భోపాల్ దుర్ఘటనలో 15 వేల మంది అమాయకులు చనిపోయారు. కానీ.., వందల మంది నాయకులు ఈ విషయంలో నోరు తెరిచి ఆ అన్యాయాన్ని ఎదురించలేక మౌనంగా ఉండిపోయారు. అంత మంది మరణానికి కారణమైన కంపెనీ యజమానులు స్పెషల్ ఫ్లైట్ ఎక్కి మరీ తమ దేశానికి వెళ్ళిపోతే.. ఏమి చేయగలిగాము? అందుకే.. “మన దేశంలో ఉప్పు, పప్పు కన్నా చౌకగాగా దొరికేది సామాన్యుడి జీవితం” అని బలమైన డైలాగ్స్ రాసుకున్నాడు డైరెక్టర్. నిజానికి ఇంత పెద్ద పాయింట్ ని ఓ చిన్న లేయర్ గానే చూపించిన శివ్‌ రావైల్‌.. ఇందులో మానవీయకోణాన్ని బలంగా స్పృశించగలిగాడు.

ఇఫ్తికార్‌ సిద్ధిఖీ, ఇమద్, బల్వంత్ యాదవ్, పాటిల్ పాండే, ఇంకా కొంతమంది రైల్వే స్టాఫ్.. వీరంతా ఈ కథలో హీరోలు. ఎన్నో రెట్లు పెరగాల్సిన మరణాలని వీరే అడ్డుకుంటారు. తమ ప్రాణాలకు తెగించి అందరినీ కాపాడుతూ ఉంటారు. నిజ జీవితంలో ఈ దుర్ఘటన జరిగిన సమయాన.. వీరిలో కొంతమంది నిజంగానే అలా ఫైట్ చేశారు. వాస్తవంగా.. భోపాల్ రైల్వే స్టేషన్ మాస్టర్ ఆ రాత్రి మిగతా స్టేషన్స్ కి సిగ్నల్స్ పంపించకుండా ఉంటే.. ఒక్క భోపాల్ రైల్వే స్టేషన్ లోనే కొన్ని వేల మంది చనిపోయి ఉండేవాళ్ళు. ఇక పాటిల్ పాండే అనే రైల్వే జెనరల్ మేనేజర్ తన ప్రాణాలకు తెగించి, ఆ అర్ధరాత్రి భోపాల్ కి చేరుకోకుండా ఉండుంటే.. ఆ మరణాల సంఖ్యని ఊహించడం కూడా కష్టం. ఇలా ఇలాంటి ఓ డిజాస్టర్ వెనుక కూడా ప్రాణాలకు తెగించి పోరాడిన హీరోలు ఉన్నారన్న అంశాన్ని గుర్తించడంతోనే దర్శకుడు సగం విజయాన్ని సాధించేశాడు. ముందుగా కథలోని పాత్రలను నిదానంగా పరిచయం చేసుకుంటూ పోయిన దర్శకుడు.. ఆ తరువాత వ్యూ పాయింట్ నేరేషన్ లో నేరుగా కాంఫ్లిక్ట్ ని ఓపెన్ చేసి కథని పరుగులు పెట్టించాడు. ఇంతటి పక్కా ఎస్టాబ్లిష్ మెంట్ తరువాత.. ఎమోషన్ పర్ఫెక్ట్ గా క్యారీ కావడంతో ఈ సిరీస్ ని మధ్యలో ఆపేయడం కూడా ఆడియన్స్ కి కష్టం అవుతుంది. ఇక చివరి ఎపిసోడ్ లో దర్శకుడు చాలా చోట్ల రియల్ ఫ్యూటేజ్ వాడుకుంటూ పోవడం.. మొత్తం సిరీస్ కే హైలెట్ టచ్.

నటీనటుల పనితీరు, టెక్నీకల్ విభాగం:

“ది రైల్వేమెన్‌” సిరీస్ అంతా చూశాక కేకే మేనన్‌ నటనకి హేట్సాఫ్ చెప్పకుండా ఉండలేము. భోపాల్ జంక్షన్ స్టేషన్ మాస్టర్ గా ఇఫ్తికార్‌ సిద్ధిఖీ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అమోఘం. ఇక.. మాధవన్‌, దివ్యేందు, బాబిల్‌ఖాన్‌, సున్నీ హిందూజా, దివ్యేందు భట్టాచార్య, జుహీచావ్లా, మందిరాబేడి వంటి నటీనటులు అంతా తమతమ పాత్రలకి ప్రాణం పోసేశారు. ముఖ్యంగా సీరియస్ నోట్ లో సాగే ఈ వెబ్ సిరీస్ కి.. దివ్యేందు సరదా పాత్ర బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక టెక్నీకల్ గా కూడా “ది రైల్వేమెన్‌” ఆకట్టుకుంటుంది. సామ్‌ స్లాటర్‌ బీజీఎమ్, రూబైస్‌ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 1984 నాటి పరిస్థితులను రీ క్రియేట్ చేయడంలో టీమ్ సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. “హిస్టారికల్ డ్రామా డిజాస్టర్” మూవీ చేసే సమయంలో సర్వైవల్‌ సీక్వెన్స్ ఎలా ప్రెజెంట్ చేశాము అన్నదే ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు శివ్‌ రావైల్‌ సూపర్ సక్సెస్ అయ్యాడని బల్లగుద్ది చెప్పుకోవచ్చు.

ప్లస్:

  • కథ, కథనం
  • నటీనటులు,
  • ఎమోషన్స్,
  • దర్శకుడు

మైనస్:

  • మంచి కథని మూవీగా తీయకపోవడం
  • మొదట్లో కాస్త స్లో నేరేషన్

రేటింగ్: 3.5/5

చివరి మాట: “ది రైల్వేమెన్‌”.. మనసుని తడిపే సినిమా

Show comments