బద్వేల్‌ ఉప ఎన్నిక: చప్పుడు లేని బీజేపీ, జనసేన..!

బద్వేల్‌ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.  రేపు నోటిఫికేషన్‌ జారీ కాబోతోంది. 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30వ తేదీన ఎన్నికలు, నవంబర్‌ 2వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. షెడ్యూల్‌ రాకమునుపే టీడీపీ తమ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్‌ను ప్రకటించింది. షెడ్యూల్‌ విడుదలైన తర్వాత.. ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం అనారోగ్యంతో చనిపోయిన ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య సతీమణి సుధకే వైసీపీ టిక్కెట్‌ ప్రకటించింది.

రెండు ప్రధాన పార్టీలు ఉప ఎన్నిక సంగ్రామంలోకి దిగాయి. అయితే బీజేపీ, జనసేన పరిస్థితి ఏమిటన్నది ఇంకా తేలలేదు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి అధికారంలోకి వస్తామని చెబుతున్న బీజేపీ, వచ్చే ఎన్నికల్లో జనసేన ఢంకా భజాయిస్తుందంటున్న జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌లు.. ఇప్పటి వరకు బద్వేల్‌ ఉప ఎన్నికపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అసలు ఈ ఎన్నిక ఒకటి జరుగుతుందని కూడా ఆ రెండు పార్టీలు ఆలోచన చేయనట్లుగా ఆ పార్టీ నేతల తీరు ఉంది.

Also Read : ప‌వ‌న్ ది ప్ర‌భుత్వంపై అక్క‌సా? ఉక్కు ఉద్య‌మంపై చిన్న‌చూపా?

పొత్తు రాజకీయాలు చేస్తున్న బీజేపీ, జనసేనలు.. ఈ ఏడాది మార్చిలో జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశాయి. ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ గుర్తుపై మాజీ ఐఏఏస్‌ అధికారి రత్న ప్రభ పోటీ చేశారు. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు కరోనాతో మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే.. బీజేపీ ఈ ఉప ఎన్నికపై ఫోకస్‌ పెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి లోక్‌సభ సెగ్మెంట్‌లో తిష్టవేశారు. శోభా యాత్రలు చేశారు. టిక్కెట్‌ విషయంలో బీజేపీ, జనసేనల మధ్య ఏకాభిప్రాయానికి రావడానికి చాలా సమయం పట్టింది. ఎవరికి వారు పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. మేము పోటీ చేస్తాం.. అంటే మేమే చేస్తాం అంటూ జనసేన, బీజేపీ నేతలు పట్టుబట్టారు. ఢిల్లీ స్థాయిలో చర్చల తర్వాత.. ఎట్టకేలకు బీజేపీకి జనసేన అవకాశం ఇచ్చింది.

తిరుపతి ఉప ఎన్నికపై ఇంత ఆసక్తి చూపిన బీజేపీ, జనసేన పార్టీలు.. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై ఎందుకు ఉత్సాహం చూపడంలేదనేదే ప్రధాన ప్రశ్న. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికతో పోల్చుకుంటే.. బద్వేలు ఉప ఎన్నిక చాలా సులువైనది. అక్కడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. ఇక్కడ ఒకే ఒక్క నియోజకవర్గం. పరిధి తక్కువ కాబట్టి ప్రచారం చేసేందుకు, శక్తియుక్తులను ప్రయోగించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అయినా జనసేన, బీజేపీలు ఉప ఎన్నిక ఊసే ఎత్తడం లేదు.

Also Read : ఒక్కడే గెలిస్తే బాగోదని ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌, వెల్లడించిన నాదెండ్ల మనోహర్

వచ్చే ఎన్నికల్లో జనసేనదే అధికారమని, వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని, భయం అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిస్తామని, వైసీపీ కి 15 సీట్లే వస్తాయని.. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నిక రూపంలో పవన్‌కు మంచి అవకాశం వచ్చింది. ఈ ఎన్నికల్లో జనసేన సత్తాను చూపి.. వైసీపీ నేతల్లో భయం పుట్టించవచ్చు. ఈ దిశగా జనసేనాని అలోచిస్తారా..? అనేది క్లారిటీ రావాలి.

బీజేపీ, జనసేన పొత్తు పెటాకులవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇది ఎప్పుడు వాస్తవ రూపం దాల్చుతుందో చెప్పలేం. అప్పటి వరకు జరిగే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీ చేయాలి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి. అలా చేయని రోజు.. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు వికటించినట్లుగా భావించాలి. బద్వేలు ఉప ఎన్నికల్లో ఈ విషయంపై క్లారిటీ రావొచ్చు. బీజేపీ, జనసేనలు పోటీ చేయకుండా, పరిషత్‌ ఎన్నికల్లో మాదిరిగా టీడీపీకి లోపాయికారికంగా మద్ధతు తెలిపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రాజకీయాల్లో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. మరి బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు ఏం చేస్తాయో మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.

Also Read : మనిషి మారెను,భాష మారెను .. కులం మీద పవన్ యూ టర్న్

Show comments