ఏపీలో బీజేపీ వ్యూహం ఎందుకు మారింది..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో బలపడే ప్రయత్నం చేేస్తోంది. ఈ తరుణంలో బిజెపి నేతలు కొన్ని కొన్ని వివాదాస్పద అంశాలను కూడా ప్రస్తావిస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ అనే అంశాన్ని ఏపీ బిజెపి పదే పదే ప్రస్తావించేందుకు సిద్దమవుతోంది. కాపు రిజర్వేషన్ విషయంలో గతంలో టీడీపీ ఇబ్బంది పడింది. రిజర్వేషన్ పేరుతో చంద్రబాబు చేసిన రాజకీయానికి అటు కాపుల్లో సైతం తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. 

కాపు ఉద్యమం చేసే వాళ్ళను ఆయన ఇబ్బంది పెట్టిన తీరుపై పెద్ద చర్చ జరిగింది. ఇక ఇప్పుడు ఈ కాపు ఉద్యమం గురించి బిజెపి నేతలు పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయం చేయడానికి సిద్దమయ్యారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ను బిజెపిలోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయనే మాట వినపడుతోంది. ఇప్పటికే కాపు సామాజికవర్గ నేతను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన ఆ పార్టీ… కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీని వాడుకునే ప్రయత్నం చేస్తోంది.

కాపు రిజర్వేషన్ విషయంలో బిజెపి నిజంగా పోరాటం చేస్తే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఇచ్చేసే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని రాజకీయంగా వాడుకోవడం ద్వారా కాపులను తమవైపుకి తిప్పుకునే ప్రయత్నాలు కాస్త గట్టిగానే చేస్తోంది అనే మాట వినపడుతోంది. ఇటు మెగాస్టార్ చిరంజీవిని దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చిరంజీవి… సిఎం జగన్ తో సన్నిహితంగా ఎక్కడ ఉంటారో అనే ఆందోళనలో కూడా బిజెపి నేతలు ఉన్నారు. దీనితో ఆయనకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చే ఏడాది రాజ్యసభ సీటు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది అనే టాక్ ఉంది.

కాపు ఉద్యమం గురించి బిజెపి రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు పదే పదే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కాని ఇతర బిజెపి నేతల నుంచి పెద్దగా స్పందన రావడంలేదనే చెప్పాలి. మరి ఈ విషయంలో బిజెపి ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. అయితే పవన్ కళ్యాణ్… బిజెపి తో ఉండటం ద్వారా కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆయన ప్రజా ఉద్యమాలు చేసే విషయంలో సమర్థవంతంగా ముందుకు వెళ్ళడం లేదు. దీనిపై జనసేన నేతల్లో కూడా వ్యతిరేకత గట్టిగానే వస్తోంది. మరి ముద్రగడ ఆ పార్టీలోకి వెళ్తారా లేదా… బిజెపి నుంచి చిరంజీవికి రాజ్యసభ సీటు వస్తుందా లేదా చూడాలి.

Also Read : కాపు రిజర్వేషన్‌పై పార్లమెంట్‌లో మాట్లాడిన ఎంపీ.. లక్ష్యం అదేనా..?

Show comments