Amaravati Movement – అమరావతి ఉద్యమం ఎందుకు విఫలమైంది..?

అమరావతి ఉద్యమం… తెలుగుదేశం పార్టీ దర్శకత్వం వహించి, తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేసి, తెలుగుదేశం పార్టీ భుజాన మోసి, నేడు ఒక దశ దిశ లేకుండా చేసిన ఉద్యమం. రైతుల ఉద్యమం అని అమరావతి ప్రాంత వాసులు చెప్పినప్పుడు రైతులతో ఉద్యమం నడిపించి ఉంటే, రాజకీయ పార్టీల జోక్యం లేకుండా ఉండి ఉంటే మరొక రకంగా ఉండేది. ఉద్యమాల్లో ఆరితేరిన వామపక్షాలను కలుపుకుని వెళ్లి ఉంటే పరిస్థితి ఇంకొక రకంగా ఉండేది. కానీ అమరావతి ఉద్యమం విషయంలో తెలుగుదేశం పార్టీ జోక్యం చేసు కోవడమే ఆ ఉద్యమానికి ప్రధాన సమస్యగా మారింది అనేది చాలా మంది మాట్లాడే మాట.

రాష్ట్ర నడిబొడ్డున రాజధాని ఉండాలనే పేరుతో ఆరేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు తన వారికి ఆర్ధికంగా మేలు చేయాలనే లక్ష్యంతో, ముందుగానే భారీగా భూములు కొనుగోలు చేసి రాజధానిగా అమరావతి కి శ్రీకారం చుట్టారు. అయితే రాజధాని పేరుతో అభివృద్ధి మొత్తం ఒక చోట కేంద్రీకృతం అయిపోతుందని, కాబట్టి అధికార విస్తరణతో పాటు, అభివృద్ధి విస్తరణ కూడా జరగాలని మూడు రాజధానులు అనే సిద్ధాంతాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైకి తీసుకువచ్చారు. సౌత్ ఆఫ్రికా మోడల్ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసన రాజధానితోపాటు గా పరిపాలన రాజధాని, న్యాయ రాజధాని ఉండాలని సంకల్పించారు.

ఈ క్రమంలోనే అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేస్తూ విశాఖలో పరిపాలన రాజధాని అలాగే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి క్యాబినెట్ లో బిల్లు ఆమోదించడమే కాకుండా శాసనసభలో కూడా బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పెట్టినా సరే గవర్నర్ ద్వారా దీనికి ఆమోదం తీసుకువచ్చారు. ఇక మూడు రాజధానులు ప్రకటన వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు కొంతమంది నిరసనలకు దిగారు.

ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి అన్యాయం చేయడానికి వీలు లేదని అమరావతి అన్యాయం చేస్తే మాత్రం తాము ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధం అవుతామని ఆ ప్రాంత రైతులు కొంతమంది ప్రకటనలు చేశారు. అయితే ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే విషయంలో, ఉద్యమంలో కొంతమందిని కలుపుకొని వెళ్లే విషయంలో, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే విషయంలో మాత్రం అమరావతి ప్రాంత రాజధాని ఉద్యమ జేఏసీ విఫలమైంది. ఉద్యమం కోసం ఏర్పాటుచేసిన జేఏసీలో చంద్రబాబు నాయుడు మాట వినే వాళ్ళు ఉన్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి.

Also Read : Praises To Jagan Rule – దేశానికే ఆదర్శంగా జగన్ పాలన

ఈ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ జోక్యం ముందు నుంచి ఉండడంతో ఉద్యమానికి కులం పేరు అదే విధంగా ఒక పార్టీ పేరు అనేది వచ్చేసింది. ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు అనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు కూడా దాదాపుగా వచ్చారు. అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు నడిపిస్తున్నారు కాబట్టే గుంటూరు జిల్లాలో గాని కృష్ణా జిల్లాలో గాని తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయింది… అమరావతి ప్రభావం ఎక్కడ కనపడకుండా పోయింది అని, కొంత మంది అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వంతో చర్చల కోసం మంత్రి బొత్స సత్యనారాయణ ఆహ్వానించిన సమయంలో కూడా అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబు మాట విని ఆగిపోయారు అనే ఆరోపణలు వినిపించాయి. అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా ముందుండి నడిపించే ప్రయత్నం చేయడం వెనక కారణం ఏంటనేది తెలియకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో సానుకూలంగా ఒకానొక సందర్భంలో వ్యవహరించకపోవడానికి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రైతులు నడవడం అని చాలా మంది అభిప్రాయపడ్డారు.

కనీసం రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాట కూడా వినకుండా కేవలం చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే అమరావతి ప్రాంత ఉద్యమం ముందుకు వెళ్లడం అమరావతి ప్రాంతంలో చేసిన నిరసనలకు సంబంధించి చంద్రబాబు నాయుడు సన్నిహితుల వద్ద నుంచి వచ్చే ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించడం అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చింది అనే చెప్పాలి. రాష్ట్రం కోసం రాజధాని ఆంధ్రప్రదేశ్ కోసం అమరావతి అని చెప్పినప్పుడు అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించకుండా కేవలం మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం చేశారు.

అమరావతి కోసం బందుకు పిలుపునిస్తే కేవలం ఆ గ్రామాల్లో మాత్రమే బందు జరగడం, కనీసం విజయవాడ లాంటి నగరంలో కూడా బంద్ నిర్వహించ లేకపోవడం రైలురోకో, రాస్తారోకోలు వంటి కార్యక్రమాలు చేయలేకపోవడం అమరావతి ఉద్యమానికి పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి. ఇక తెలుగుదేశం పార్టీ తర్వాత ఉద్యమానికి మద్దతు పలికిన వామపక్షాలు కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వినడం అమరావతికి మరింత ఇబ్బందికరంగా మారిన అంశం. దీనితోనే అమరావతి ఉద్యమం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకపోయిందని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా అమరావతి ఉద్యమం గురించి పెద్దగా కథనాలు కూడా వేయలేకపోతోంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కౌలు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎక్కడా ఇబ్బంది పెట్టకపోవడంతో పెద్దగా రైతులు కూడా అమరావతి ఉద్యమానికి ముందుకు రాలేదు.

Also Read : YS Jagan – ఇన్నాళ్ళూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క

Show comments