కరోనాపై పోరు: భారత్‌ సహాయం ఆర్థించిన అమెరికా

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయనే సామెత కరోనా వైరస్‌ సాక్షిగా నిజమవుతోంది. నిన్న మొన్నటి వరకూ ప్రపంచంలో ఏ రంగంలోనైనా తమకు తిరుగేలేదు, తమ మాటే వేదం అనే తీరుతో ఉన్న అమెరికా కరోనా వైరస్‌ ధాటికి విలవిలలాడుతోంది. అగ్రరాజ్యం అనే మాట ఒట్టి డొల్ల అని కరోనా సాక్షిగా బయటపడుతోంది. తమ దేశంలో కరోనా వైరస్‌ నియంత్రణకు, బాధితులకు వైద్యం చేసేందుకు ఇతర దేశాల సహాయాన్ని అమెరికా కోరుతోంది.

తాజాగా అమెరికా కరోనాపై పోరు చేసేందుకు భారత్‌ సహాయాన్ని అర్థించింది. కరోనా వైరస్‌ చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న మలేరియా వ్యాధికి వాడే మందు హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను తమకు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు స్వయంగా దేశ ప్రధానికి మోదీకి ఫోన్‌ చేసి అడిగారు. ఈ విషయం స్వయంగా ట్రంప్‌ వెల్లడించారు. ‘‘ నేను ఈ రోజు ఉదయం భారత్‌ ప్రధాని మోదీతో మాట్లాడాను. వారు భారీ స్థాయిలో హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను తయారు చేస్తున్నారు. అమెరికా కోరిన మేరకు ఔషధాన్ని అందించాలని కోరాను. భారత్‌ దీన్ని సీరియస్‌గా పరిశీలిస్తోంది’’ అని శనివారం ట్రంప్‌ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

గత నెల 25వ తేదీన భారత్‌ ప్రభుత్వం హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఔషధ ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపునిచ్చింది. కరోనాపై పోరాడేందుకు భారత్, అమెరికా భాగస్వామ్య బలాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తామని తమ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషనలో ట్రంప్, మోదీలు నిర్ణయానికి వచ్చారు.

కాగా, కరోనా వైరస్‌ భారిన పడిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఈ వైరస్‌ వల్ల ఇప్పటి వరకూ అమెరికాలో 3.11 లక్షల మంది ఆస్పత్రిపాలయ్యారు. వీరిలో 8,438 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో రోజు రోజుకు పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఈ వైరస్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ లేదా నయం చేసే ఔషధం కనుగోనడంపై అమెరికా పరిశోధకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అప్పటి వరకూ తమ దేశంలోని కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఔషధం ఇచ్చేందుకు ట్రంప్‌ భారత్‌ సహాయాన్ని ఆర్థించారు.

Show comments