TRS, Legislative Council – పెద్దల సభలోనూ తిరుగులేని మెజారిటీ

శాసనసభ తరహాలో శాసన మండలిలో కూడా తెరాస పార్టీ బలం పూర్తి స్థాయిలో పెరుగుతుంది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు కాసేపటి క్రితం ఎమ్మెల్యే కోటాలో అభ్యర్ధులను ప్రకటించిన సిఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీల మీద కూడా గట్టిగానే దృష్టి సారించారు. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తెరాస పార్టీ ఈ ఎమ్మెల్సీలు అన్నీ దాదాపుగా కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక కాసేపటి క్రితం తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.

ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం లో ఉన్న ఒక్కొక్క సిటుకు విడుదల చేసారు. మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది అని ఎన్నికల సంఘం పేర్కొంది. నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ ఉంటుందని, నవంబర్ 24 నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. నవంబర్ 26 ఉపసంహరణకు చివరి తేదీ కాగా డిసెంబర్ 10 పోలింగ్ ఉంటుందని పేర్కొంది. డిసెంబర్ 14 కౌంటింగ్ ఉంటుందని ప్రకటించింది.

పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని చెప్పిన ఎన్నికల సంఘం కోవిడ్ 19 ఉంది కాబట్టే ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణ ఉంటుందని పేర్కొంది. ఎన్నికల ప్రచారం లో ఇసిఐ ఇచ్చిన కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా సిఎం కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారు అనేది తెరాస పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్న అంశంగా ఉంది.

ఖమ్మం జిల్లా నుంచి దాదాపుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆయనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి దాదాపుగా పోటీ వచ్చే అవకాశం లేదని అంటున్నారు. దానికి కారణం రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్ ను ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే కోటా నుంచి తీసుకోగా.. ఖాళీ అయిన రాజ్యసభకు పొంగులేటిని పంపించి తుమ్మలను ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అదిలాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న ప్రేమ్ సాగర్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని ఆయనతో ఇప్పటికే తెరాస జిల్లా వర్గాలు చర్చలు జరుపుతున్నాయని అంటున్నారు.

Also Read : Banda Prakash, TRS – ముదిరాజ్ సామాజికవర్గం కోటాలో బండ ప్రకాష్ కు మంత్రి పదవి ?

ఇక వారితో పాటుగా నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపుగా కవిత పేరుని ఖరారు చేసారు సిఎం కేసీఆర్. ఇక వరంగల్ జిల్లా నుంచి మాజీ స్పీకర్ మధుసూధనా చారిని ఎంపిక చేసే అవకాశం ఉండగా రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. ఆయన మంత్రి మల్లారెడ్డికి దగ్గరి బంధువు కావడంతో కచ్చితంగా తీసుకునే అవకాశం ఉండొచ్చు అని తెరాస వర్గాలు అంటున్నాయి. ఇక నల్గొండ జిల్లా నుంచి ప్రధానంగా రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

టీడీపీ నుంచి తెరాసలోకి వెళ్ళిన ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డికి లేదా మోత్కుపల్లి నరసింహులుకి ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. మోత్కుపల్లి దళిత సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి కేబినేట్ లోకి తీసుకుంటారని కొందరు అంటున్నారు. అయితే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజిక వర్గ నేతలు బలంగా ఉండటం, ఉమామాధవ రెడ్డి సొంత నియోజకవర్గం భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండటంతో ఎమ్మెల్సీగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆమెకు పదవి దక్కే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

అయితే ఉమా మాధవరెడ్డి మరిది కృష్ణా రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఉంది. ఒకే కుటుంబానికి రెండు సీట్లు అనే చర్చ రాకుండా ఉండాలంటే మోత్కుపల్లి పేరుని పరిశీలించవచ్చు. అలా కాదు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. మెదక్ జిల్లా నుంచి ఇంకా ఎవరూ అనే దానిపై స్పష్టత రాకపోగా… మంత్రి హరీష్ రావుతో సన్నిహితంగా ఉండే నేతకు పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపుగా మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి పదవి దక్కే అవకాశం ఉందని తెరాస వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పదవులు మాత్రం సిఎం కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారాయనే మాట వాస్తవం.

Also Read : Ponguleti, Banda Prakash – రాజ్యసభ సభ్యుడికి ఎమ్మెల్సీ.. ఆ స్థానంలో సీనియర్‌ నేత..? కేసీఆర్‌ వ్యూహాలు

Show comments