Idream media
Idream media
ఏడు పదుల వయసు.. నాలుగు పదుల రాజకీయ జీవితం.. అందులో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి హోదా.. అంతకు మించి ప్రతిపక్షపాత్ర. తెలుగు ప్రజల అభిమాన నటుడు, సంచలన రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావునే పార్టీ నుంచి తప్పించిన రాజకీయ చాణుక్యుడు. కానీ.. కేవలం రెండున్నరేళ్ల కాలంలో ఊహించని ఎదురుదెబ్బలు తింటున్నారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలోనే ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించి ఉండరేమో.. అని అంటున్నారు పరిశీలకులు. రెండున్నరేళ్ల కాలాన్ని అటుంచితే.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చంద్రబాబు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.
ఇటీవల చంద్రబాబు ఎదుర్కొన్న ఒత్తిళ్లకు తాను స్వయంగా ఓ కారణమైతే.. కొంత మంది నేతలు మరో కారణం. గత నెలలో పార్టీ నేత పట్టాభిరాం చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళాన్నే సృష్టించాయి. ముఖ్యమంత్రిపై పరుష పదజాలాన్ని ఉపయోగించడం చర్చనీయాంశమైంది. ఆ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన కొందరు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. ఆ దాడిని కూడా బాబు ఊహించలేకపోయారు. దాడిని ఎలివేట్ చేసుకోవడానికి ఈ వయసులో 36 గంటల పాటు దీక్ష చేశారు. ఇదే అదునుగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా ప్రయత్నించారు. దీనికిగాను ఆయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసారు. అయితే.. ఈ క్రమంలో చంద్రబాబుకు రాష్ట్రపతి అప్పాయింట్మెంట్ లభించినా.. కేంద్రంలోని పెద్దలైన ప్రధాని నరేంద్ర మోడీ.. నెంబర్ 2గా ఉన్న అమిత్ షాల అప్పాయింట్మెంట్ లభించలేదు. ఇది పెద్ద అవమానం.
ఒకప్పుడు గల్లీలోనే కాదు, ఢిల్లీలో కూడా ఆ మాటకొస్తే అమెరికాలో కూడా చక్రం తిప్పగల సమర్దుడు చంద్రబాబు అని పేరుండేది. అలాంటి వ్యక్తిని అమెరికా సంగతి అటుంచితే హస్తినలో కూడా పట్టించుకునే వారు కరువయ్యారు. ఢిల్లీ సంగతి అటుంచితే.. ఏడుసార్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం కుప్పంలో ఘోర అనుమానాన్ని చవిచూశారు. కుప్పంలో మునిసిపాలిటీలో కూడా ఓటమిని ఎదుర్కొన్నారు. దీంతో సొంత ఇలాకాలోనే పట్టుకోల్పోతున్నామనే ఆవేదన నుంచి చంద్రబాబును కుంగదీస్తోంది. తీవ్రంగా వేధిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడిపించడం, అధికార పక్షాన్ని ఢీ కొట్టడం చంద్రబాబుకు ఏమంత ఈజీగా కనిపించడం లేదు. ఈ క్రమంలో డిఫ్రెషన్ కు లోనవుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఎక్కి ఎక్కి ఏడ్చేందుకు అది కూడా ఓ కారణమని భావిస్తున్నారు.