Idream media
Idream media
‘తెలియదు’ ఈ పదం చెప్పేందుకు ఎవరైనా నామోషీగా భావిస్తారు. తెలియదు అంటే ఎక్కడ తమను అజ్ఞానులుగా ఎదుటివారు లెక్కగడతారేమోనని సంకోచిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో తెలియదు అంటేనే ఫలితం బాగుటుంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తెలియదు అనే పదాన్ని నిర్భయంగా చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జనసేన పార్టీ టీడీపీకి దగ్గరవుతోందన్న వార్తలు రాజకీయ వార్గల్లోనూ, మీడియాలోనూ షికార్లు చేస్తున్నాయి. ఈ పొత్తు రాజకీయాలపై ప్రత్యేక కథనాలు కూడా ప్రసారమవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఈ విషయం సోము వీర్రాజుకు తెలియదట. జనసేన, టీడీపీకి దగ్గరవుతోందన్న వార్తలపై మీ స్పందన ఏమిటని అడిగిన ప్రశ్నకు.. సోము వీర్రాజు తెలియదు అని చెప్పేశారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పిన సోము వీర్రాజు.. ఎంతో లౌక్యంగా సమాధానం చెప్పారు. తద్వారా మీడియాకు బ్రేకింగ్ న్యూస్ లేకుండా చేశారు.
Also Read : బద్వేల్ ఉప ఎన్నిక టీడీపీ, జనసేన ఔట్ : నిజంగా సానుభూతేనా? లేక ఈ కారణాలున్నాయా?
పొత్తు విఛ్చిన్నాలు, కొత్త పొత్తులపై మీడియాలో జరుగుతున్న ప్రచారం.. సోము వీర్రాజుకు తెలియకుండా ఉండదు. కానీ ఈ విషయంలో ఆయన సైలెంట్‌గా ఉంటూ.. ఏమీ తెలియనట్లుగా ఉండాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. జరగాల్సింది జరగక మానదు.. అన్నట్లు సమయం వచ్చినప్పుడు జరగాల్సినవన్నీ జరుగుతాయనే ధోరణిలో ఉన్నారు.
బీజేపీ–జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయన్న సోము వీర్రాజు.. బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తామని చెప్పారు. తద్వారా జరుగుతున్న ప్రచారానికి కొంత బ్రేక్ వేసే ప్రయత్నం చేశారు. అయితే పోటీ చేయబోమని ప్రకటించిన పవన్ కల్యాణ్.. బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వస్తారా..? అంటే సందేహమే.
పోటీకి దూరంగా ఉంటామని జనసేన, పోటీ చేస్తామని బీజేపీలు ప్రకటించిన తర్వాత.. ఆ రెండుపార్టీల మధ్య పొత్తు ఎక్కడ ఉందనే ప్రశ్న ఉత్పన్నమవక మానదు. పొత్తు వ్యవహారంపై ఎవరికి వారు తమకు తాముగా ముందు బయటపడకూడదనే వ్యూహంతో ఉన్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ అర్థం చేసుకోవాలని జనసేన, జనసేనే కటిఫ్ చెప్పాలని బీజేపీలు రాజకీయాలు చేస్తున్నాయి. తాజాగా బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రచారానికి పవన్‌ను పిలుస్తామంటున్న బీజేపీకి.. ఆ సమయంలోనైనా జనసేనాని నుంచి స్పష్టమైన సమాధానం వస్తుందా..? లేదా..? చూడాలి.
Also Read : జనసేన అడుగు.. బీజేపీకి అర్థం అవుతోందా..?