Rishabh Pant, Wicket Keeper – ధోనీ రికార్డును అధిగమించిన రిషబ్ పంత్

దక్షిణాఫ్రికా లోని సెంచూరియన్ లో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ మూడవ రోజున భారత వికెట్ కీపర్  రిషబ్ పంత్  భారతజట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎం. ఎస్. ధోనీ పేరిట ఉన్న ఒక రికార్డును అధిగమించాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ వాన్ ముల్డర్ మహమ్మద్ షమీ బౌలింగ్ లో అందించిన క్యాచ్ పట్టడం ద్వారా అతి తక్కువ టెస్ట్ మ్యాచ్ లలో వందమంది బ్యాటర్లను అవుట్ చేసిన భారత వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు.

రిషబ్ పంత్ తన 26వ టెస్టు మ్యాచ్ లో, యాభై ఇన్నింగ్స్ లు ఆడి ఈ మైలురాయిని చేరుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు ధోని, వృద్ధిమాన్ సాహా పేరిట ఉండేది. ఈ ఇద్దరు భారత వికెట్ కీపర్లు 36 టెస్టు మ్యాచ్ లు ఆడి ఈ మైలురాయిని చేరుకున్నారు. పంత్ అవుట్ చేసిన వందమంది బ్యాటర్లలో 92 మందిని క్యాచ్ పట్టడం ద్వారా, 8 మందిని స్టంపింగ్ చేయడం ద్వారా అవుట్ చేశాడు. ఇప్పటి వరకు ఇలా అవుట్ చేసిన ఆరవ భారత వికెట్ కీపర్‌ గా రిషబ్ పంత్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. వీరిలో అత్యధికంగా 294 మందిని అవుట్ చేసి ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఈ విభాగంలో ప్రపంచ రికార్డు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ పేరిట ఉంది. కేవలం కేవలం 22 టెస్టు మ్యాచ్ లాడి వందమంది బ్యాటర్లను అవుట్ చేయడంలో భాగం పంచుకున్న వికెట్ కీపరుగా రికార్డు సృష్టించాడు డీకాక్.

పంత్ పేరిట మరో రెండు రికార్డులు

ఈ సంవత్సరం మొదట్లో ఆస్ట్రేలియా మీద జరిగిన టెస్టు సిరీస్ లో తన కెరీర్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసి, వేగంగా ఈ మైలురాయిని చేరిన భారత వికెట్ కీపరుగా ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు పంత్. వెయ్యి టెస్టు పరుగులు చేయడానికి పంత్ 27 టెస్టు ఇన్నింగ్స్ ఆడితే, ధోనీ 32 ఇన్నింగ్స్ ఆడాడు. వేగంగా వెయ్యి టెస్టు పరుగులు చేసిన వికెట్ కీపరుగా ప్రపంచ రికార్డు క్వింటన్ డీకాక్ పేరిట ఉంది. ఈ మైలురాయిని డీకాక్ 21 ఇన్నింగ్స్ లో చేరుకున్నాడు.

డిసెంబర్ 10,2018 న ఆస్ట్రేలియా మీద ఆడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి పదకొండు క్యాచ్ లు పట్టడం ద్వారా అంతకు ముందు వృద్ధిమాన్ సాహా పేరిట ఒక టెస్టులో పది క్యాచ్ లు పట్టిన భారత వికెట్ కీపర్ రికార్డు అధిగమించాడు. అప్పటి వరకు కేవలం ఇద్దరు వికెట్ కీపర్ల పేరిట ఒక టెస్టులో పదకొండు క్యాచ్ లు పట్టిన రికార్డు ఉండేది. 1995లో దక్షిణాఫ్రికా మీద ఇంగ్లాండు వికెట్ కీపర్ జాక్ రస్సెల్, 2013లో పాకిస్తాన్ మీద దక్షిణాఫ్రికా పార్ట్ టైమ్ వికెట్ కీపర్ డి విల్లియర్స్ ఈ రికార్డు సాధించి ఉన్నారు.

రిషబ్ పంత్ ఆటతీరును కానీ, ఫామ్ ను కానీ చూస్తే 294 మంది బ్యాటర్లను అవుట్ చేయడంలో భాగం పంచుకుని ,అత్యుత్తమ భారత వికెట్ కీపరుగా ధోనీ పేరిట ఉన్న రికార్డును అతను అధిగమిస్తాడని క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : రెండు టికెట్ల కోసం పంతంతో క్రికెట్ ప్రపంచ కప్పును భారతదేశానికి తీసుకొచ్చిన బిసిసిఐ అధ్యక్షుడు

Show comments