గొల్లపల్లి వర్సెస్‌ రాపాక…రాజోలులో రగులుతున్న రాజకీయం

రాజోలులో రాజకీయం రగులుతోంది. మాజీమంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు, ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ల మధ్య సాగుతున్న దూషణల పర్వం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి పండుగ నాడు మొదలైన విమర్శలు.. ప్రతివిమర్శలు కాస్తా.. వ్యక్తిగత దూషణల వరకు వెళుతున్నాయి. కోడిపందేలు పండుగ మూడు రోజులతో ముగిసినా వీరిద్దరూ మాత్రం పందెం పుంజుల్లా ఇప్పటికీ తలపడుతూనే ఉన్నారు. 

గొల్లపల్లి సూర్యారావుకు కోనసీమ రాజకీయాల్లో ఒక గుర్తింపు ఉంది. అల్లవరం నుంచి ఆయన 1985, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఎన్టీఆర్‌ క్యాబినెట్‌లోను, తరువాత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉండగానే 2009 ఎన్నికల్లో గొల్లపల్లికి అవకాశం రాలేదు. దీనితో టీడీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ఏడాది ముందే గొల్లపల్లిని అమలాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా చంద్రబాబు ఎంపిక చేశారు. తరువాత పండుల రవీంద్రబాబు రావడంతో గొల్లపల్లిని రాజోలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. అయిష్టంగానే ఇక్కడ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

ఇక రాపాక వరప్రసాద్‌ సైతం రాజోలు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. జనరల్‌గా ఉన్న రాజోలు 2009 ఎన్నికల నాటికి నియోజకవర్గ పునర్విభజనలో ఎస్‌సీలకు రిజర్వ్‌ అయింది. అప్పట్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్‌ విజయం సాధించారు. తిరిగి 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో గెలిచారు. జనసేన తరపున గెలిచిన ఎకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. తరువాత పార్టీ విధానాలు నచ్చని రాపాక ఆ పార్టీకి దూరమై వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచారు. ఒకే నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ గొల్లపల్లి, రాపాకల మధ్య పెద్దగా విభేదాలు లేవు. ఒకరిని ఒకరు పెద్దగా విమర్శించుకున్న దాఖలాలు కూడా లేవు. కాని సంక్రాంతి పండుగ నాటి నుంచి వీరి మధ్య విమర్శలు పెరిగాయి. అవి కాస్తా వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం విశేషం.

తొలుత మాజీమంత్రి గొల్లపల్లి, ఎమ్మెల్యే రాపాక మీద విమర్శలకు దిగారు. దీనికి రాపాక బదులిచ్చారు. ఈ విమర్శలు కాస్తా పరస్పర అవినీతి ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లాయి. ఇది కాస్తా ఇద్దరి పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబాల వరకు వెళ్లింది. రాపాక అంటేనే అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ అని గొల్లపల్లి విమర్శించారు. సముద్రపు ఇసుకను కొల్లగొట్టి కోట్లు గడిస్తున్నారని, ఏకంగా రూ.70 కోట్లతో ఇళ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇంటి నిర్మాణం కోసం ఇసుక, సిమెంట్‌, ఐరెన్‌ ఇలా ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఇండెంట్‌ వేసి దోచేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలి పేకాట ఆడడమే రాపాక పని అని ఆరోపణలకు దిగారు.

దీనికి రాపాక దీటుగా బదులిచ్చారు. రూ.70 కోట్లతో ఇళ్లుకడుతున్నట్టు నిరూపించమని సవాల్‌ విసిరారు. పనిలోపనిగా రావులపాలెంలో గొల్లపల్లి దేవస్థానం భూమి ఆక్రమించారని ఆరోపించారు. రావులపాలెంలో నీవే అంతస్తల మీద అంతస్తుల ఇళ్లు కట్టావని విమర్శించారు. నీవు నాతో పేకాట ఆడిన విషయం మరిచావా? అని రాపాక మండిపడ్డారు. ఇలా వీరిమధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా సాగుతున్నాయి. వీరి ఆరోపణలతో సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది. వీరి అనుకూల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీరి ఆరోపణలను సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పరస్పరం చేసుకుంటున్న విమర్శల నేపథ్యంలో రాజోలు రాజకీయం రసకందాయంలో పడింది.

Also Read : కాపు ఉద్యమ కేసులు ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం

Show comments