రాయ‌దుర్గంపై చెర‌గ‌ని ముద్ర “పాటిల్‌”

రాయ‌దుర్గం మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి వెళ్లిపోయారు. 35 ఏళ్ల‌కు పైగా రాయదుర్గం రాజ‌కీయాల‌పై ముద్ర వేశారు. నా ఏడెనిమిదేళ్ల వ‌య‌సులో చూసిన మొద‌టి నాయ‌కుడు NC. శేషాద్రి తెల్ల‌టి బ‌ట్ట‌ల్లో గంభీరంగా ఉండేవాడు. గుర్రం బండిలో తిరిగే వాడు.

1972లో గొల్లంప‌ల్లి తిప్పేస్వామి ఎమ్మెల్యే. ఆయ‌న‌కు చ‌దువు రాదు. కానీ జ‌నం మ‌నిషి. గుండెపోటుతో చ‌నిపోతే ఉప ఎన్నిక వ‌చ్చింది. ప‌య్యావుల వెంక‌ట‌నారాయ‌ణ గెలిచారు. రాయ‌దుర్గం బజారుల్లో వంద‌లాది ఆవు దూడ‌ల‌తో ఊరేగింపు జరిగింది (అప్ప‌టి కాంగ్రెస్ గుర్తు ఆవు దూడ‌). స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రంగ‌ప్ప‌కి ఏనుగు గుర్తు వ‌చ్చింది. ఆయ‌న కూడా పంతానికి స‌ర్కస్ నుంచి రెండు ఏనుగులు తెచ్చి ఊర్లో ఊరేగించారు.

1978 త‌ర్వాత మ‌హారాష్ట్ర‌లో బోర్‌వెల్స్ వ్యాపారం చేస్తున్న పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి యువ‌కుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. స‌మితి ఉపాధ్య‌క్షుడిగా గెలిచిన‌ప్పుడు జ‌రిగిన ఊరేగింపు రాయ‌దుర్గాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వేలాది మందిని స‌మీక‌రించి అంత పెద్ద ఊరేగింపు జ‌ర‌గ‌డం అదే మొద‌టిసారి.

రాజ‌కీయాల్లో ఎంట్రీ ఫిక్స్ అయిన త‌ర్వాత కాంగ్రెస్ టికెట్ రేస్‌లో నిల‌బ‌డ్డారు. 83లో తెలుగుదేశం వ‌చ్చిన‌పుడు రాయ‌దుర్గంలో స‌రైన నాయ‌కుడు లేరు. జ‌నానికి పెద్ద‌గా తెలియ‌ని కాటా గోవింద‌ప్ప‌కి టికెట్ ఇచ్చారు. సారా వ్యాపారంలో అప్ప‌టికే బాగా డ‌బ్బు సంపాదించిన హుళి కుంట‌ప్ప‌కి కాంగ్రెస్ టికెట్ వ‌చ్చింది. వేణుగోపాల్‌రెడ్డి త‌గ్గ‌లేదు. ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. NTR వీరాభిమాని అయిన ఉపేంద్ర‌రెడ్డి తెలుగుదేశానికి ప‌ని చేయ‌లేని ప‌రిస్థితి. వేణుగోపాల్‌రెడ్డి సొంత బంధువు, ఒకే ఊరు. ముక్కోణ‌పు పోటీలో అనూహ్యంగా తెలుగుదేశం గాలిలో కూడా వేణుగోపాల్‌రెడ్డి గెలిచారు. కాంగ్రెస్ అనుబంధ స‌భ్యుడిగా ఉన్నారు.

1985లో హుళి కుంట‌ప్ప‌తో ఒప్పందం మేర‌కు వేణుగోపాల్‌రెడ్డి పోటీ చేయ‌లేదు. తెలుగుదేశం త‌ర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గుక్కెడు నీటికోసం అల‌మ‌టించే రాయ‌దుర్గానికి శాశ్వ‌త నీటిప‌థ‌కం తెచ్చిన ఘ‌న‌త పాటిల్‌దే. అనంత‌పురం స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న ఉన్న వ్య‌క్తి. రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాడేవారు. సాహిత్య స‌మావేశాల్లో ఇష్టంగా పాల్గొనేవారు. సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఉన్న మ‌నిషి. అనారోగ్యంతో ఈ మ‌ధ్యకాలంలో యాక్టివ్ గా లేరు. అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక ముద్ర వేసిన నాయ‌కుడు. ఆత్మ‌కి శాంతి క‌ల‌గాలి.

Also Read : అనంత ‘పెద్దాయన’ పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి కన్నుమూత

Show comments