PM Modi, New farm laws dismissed – ఫలించిన రైతుల పోరాటం.. సాగు చట్టాలు రద్దు..

ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడేళ్ళ కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గారు. వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రధాని వెనక్కు తగ్గుతున్నట్టుగా ప్రకటన చేసారు. కాసేపటి క్రితం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామనీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించడం సంచలనం అయింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులను ఉపసంహరించుకుంటామని ప్రధాని స్పష్టం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పినా సరే ఫలితం లేకపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేశారు.

దీనికి సంబంధించి దేశ ప్రజలను క్షమాపణ కోరుకుంటున్నాను అని మోడీ పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా స్వయంగా ప్రకటన చేయడంతో ఇప్పుడు దేశంలో రైతుల సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతులు ఈ పోరాటంలో ముందు ఉండి నడిపించారు. ఈ నేపధ్యంలో ఆయా రాష్ట్రాల రైతులకు దేశవ్యాప్తంగా ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన తర్వాత రైతు నేత రాకేష్ తికాయత్ ను కూడా పలువురు ప్రశంసిస్తున్నారు.

ఒకానొక దశలో రైతుల పోరాటం వెనక్కి తగ్గిన సమయంలో రాకేష్ ముందుండి రైతులను నడిపించడమే కాకుండా వాళ్లకు వ్యక్తిగతంగా అండగా నిలిచి రాజకీయాలతో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళారు. అప్పటి వరకు పంజాబ్, హర్యానా రైతులు మాత్రమే ఈ పోరాటంలో ముందు ఉండగా… ఉత్తరప్రదేశ్ రైతులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడంతో ఉద్యమ తీవ్రత మరింత పెరిగింది.ఇక ఢిల్లీ సరిహద్దులను స్తంభింప చేయడంతో దేశం పరువు కూడా పోయే సూచనలు కనిపించాయి. దక్షిణాది రాష్ట్రాలు ఈ పోరాటంలో వెనుకబడినా సరే పంజాబ్, హర్యానా రైతులు మాత్రం వెనక్కు తగ్గలేదు.

ఇక మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటమే ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రమే కాకుండా కేంద్రంలో అధికారాన్ని నిర్ణయించే రాష్ట్రం కావడం, అక్కడ విపక్షాలు వ్యవసాయ చట్టాల గురించి ప్రజల్లోకి బలంగా వ్యతిరేకతను తీసుకు వెళ్ళడంలో విజయవంతం కావడంతో మోడీ వెనక్కు తగ్గక తప్పలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం విషయంలో ఇప్పటి వరకు మోడీ వెనక్కు తగ్గలేదు. ఇక దేశ ప్రజలకు తన నిర్ణయాలతో అనేక సార్లు ఇబ్బంది పెట్టినా సరే మోడీ క్షమాపణ కోరిన సందర్భం లేదు.

కాని ఇప్పుడు మాత్రం వ్యవసాయ చట్టాలకు సంబంధించి క్షమించాలని కోరడం ఆశ్చర్యపరిచింది. ఏది ఎలా ఉన్నా సరే దాదాపు ఏడాది నుంచి రైతులు చేస్తున్న పోరాటం విజయవంతం కావడం, ప్రజా వ్యతిరేకతను కేంద్రం అర్ధం చేసుకుని వెనక్కు తగ్గడం మాత్రం ఒకరకంగా సంచలనం అనే చెప్పాలి. ఈ ఏడాది కాలంలో రైతుల నిరసనను ఎన్ని విధాలుగా తొక్కి పెట్టాలని కేంద్రం ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలో క్రూరంగా వ్యవహరించింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పలువురు రైతులు ఈ పోరాటంలో ప్రాణాలు కూడా కోల్పోయారు.

Also Read : Paddy Purchase – 48 గంటల డెడ్ లైన్ ఇచ్చిన కేసీఆర్, స్పీచ్ అయిన వెంటనే క్లారిటీ ఇచ్చేసిన మోడీ…!

Show comments