జిల్లాల పున‌ర్విభ‌జ‌న నోటిఫికేషన్‌లో స్వ‌ల్ప మార్పులు

ఏపీలో అద‌నంగా ప‌ద‌మూడు జిల్లాలు ఏర్పాటు చేసి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్ స‌ర్కారు జిల్లాల పున‌ర్విభ‌జ‌న నోటిఫికేష‌న్ పై స్వ‌ల్ప మార్పులు చేసింది. ప్ర‌జ‌లు, స్థానికంగా ప్ర‌ముఖుల అభిప్రాయాల‌కు అనుగుణంగా మార్పులు చేస్తోంది. జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చుకునేందుకు కేంద్రం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్రం జూన్ వరకు సమయం ఉందనడటంతో ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల విభజన ప్రక్రియను వేగవంతం చేసింది.ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిత జిల్లాలు, వాటి పేర్లను ముసాయిదా నోటిఫికేషన్ రూపంలో ఇచ్చి వాటిపై అభ్యంతరాలను స్వీకరించే పనిలో ఉంది. త్వరలో ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లాల విభజన ఉగాది నుంచి అమల్లోకి వస్తుంది. పరిస్థితుల్ని బట్టి ఉగాది నాటికి కొత్త జిల్లాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వ విభాగాలు చెబుతున్నాయి.

ఇప్పుడు తాజాగా జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్‌లో ప్రభుత్వం స్వ‌ల్ప మార్పులు చేసింది. నాలుగు జిల్లాల పరిధిలోని రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలో రొంపిచర్ల మండలాన్ని పలమనేరు డివిజన్‌ నుంచి చిత్తూరులో కలుపుతూ ఉత్తర్వులు (జీఓ 70) ఇచ్చింది.చిత్తూరు జిల్లాకు చిత్తూరే హెడ్‌ క్వార్టర్‌గా ఉంటుందని గెజిట్‌లో ప్రకటించారు. కొత్తగా ప్రతిపాదించిన సత్యసాయి జిల్లాలోని రెవెన్యూ డివిజన్లలోనూ మార్పులు చేశారు. ఇంతకుముందు నాలుగు మండలాలతో కొనసాగించిన ధర్మవరం డివిజన్‌ను ఇప్పుడు రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఈ డివిజన్‌లోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలను పుట్టపర్తి డివిజన్‌లో కలిపారు. ఇందులో ఇప్పటికే బుక్కపట్టణం, కొత్తచెర్వు, పుట్టపర్తి, నల్లమాడ మండలాలు ఉన్నాయి.

ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రద్దుకు ప్రతిపాదించిన కదిరి రెవెన్యూ డివిజన్‌ను తిరిగి కొనసాగించేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ డివిజన్‌లో కదిరి, తలుపుల, నంబపూలకుంట, గాండ్లపెంట, నల్లచెర్వు, తనకల్‌, ఓడి చెర్వు, అమడగూరు మండలాలను ప్రతిపాదించారు. ఇక సత్యసాయి జిల్లాలో 13 మండలాలతో పెనుకొండ డివిజన్‌ పెద్దదిగా ఉంది. ఈ జిల్లాకు పుట్టపర్తి హెడ్‌ క్వార్టర్‌గా ఉంటుందని ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించి పలు కీలక మార్పులు చేశారు. గురజాల డివిజన్‌లో ఉన్న పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, క్రోసూరు మండలాలను నర్సరావుపేట డివిజన్‌లో కలుపుతూ ప్రతిపాదించారు. దీంతో డివిజన్‌లో మొత్తం మండలాల సంఖ్య 18కి చేరగా, గురజాల డివిజన్‌లో 10 మండలాలున్నాయి.

ప్రకాశం జిల్లాలోనూ పలు మార్పులు ప్రతిపాదించారు. ఇంతకు ముందు ఇచ్చిన గెజిట్‌లో పొదిలిని రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదించారు. తాజా సవరణలతో పొదిలి స్థానంలో కనిగిరి రెవెన్యూ డివిజన్‌గా ఉంటుందని ఉత్తర్వులు ఇచ్చారు. కనిగిరి డివిజన్‌లో పొన్నలూరు మండలాన్ని, ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లో తాళ్లూరు మండలాన్ని కలిపారు.

Show comments