యూపీలో మోదీ తొలి ప్రచార సభ.. ‘హిజాబ్‌’పై పరోక్ష వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌లో తొలిదశ పోలింగ్‌ గురువారం జరిగింది. రెండోదశకు అన్ని పార్టీలూ సిద్ధమైపోయాయి. హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార సభలో పాల్గొనలేదు. ఒకటి, రెండు సార్లు వర్చువల్‌గా మాత్రమే పాల్గొన్నారు. గురువారం తొలిసారిగా ఎన్నికల ప్రచార సభలో మోదీ హాజరయ్యారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు గుప్పించారు. హిజాబ్‌ వివాదానికి కారణం ప్రతిపక్షాలే అంటూ పరోక్షంగా విమర్శించారు.

ప్రధానమంత్రి మోదీ యూపీలో మరోసారి కాంగ్రెస్‌పైన, ఎస్పీలపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘‘త్రిపుల్‌ తలాక్‌ వ్యవహారంలో మా వెంట ముస్లిం మహిళలు నిలవడం కొందరికి కడుపునొప్పిగా ఉంది’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఇప్పుడిప్పుడే హక్కులను, అభివృద్ధిని సాధించుకుంటున్న ముస్లిం మహిళలను అడ్డుకోవడానికే ఇలాంటి కొత్త ఎత్తులు వేస్తున్నారు’’ అంటూ కర్ణాటకను రగిలిస్తున్న హిజాబ్‌ ధారణ అంశాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. ముస్లిం మహిళల భద్రతకు ఆదిత్యనాథ్‌ యోగి ప్రభుత్వంలోనే భరోసా దొరుకుతుందన్నారు. ‘‘త్రిపుల్‌ తలాక్‌ నుంచి ముస్లిం మహిళలకు బీజేపీ ప్రభుత్వం విముక్తి కలిగించింది. వాళ్లంతా కలిసి మోదీ సర్కారును బలపరచడం కొందరిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయినా.. మేం ప్రతి ముస్లిం మహిళ వెంట నిలబడతాం’’ అని వ్యాఖ్యానించారు.

ఎవరైతే యూపీని మత అల్లర్ల రహిత రాష్ట్రంగా తయారుచేశారో, ఎవరైతే భయంలేని పరిస్థితిని తల్లీబిడ్డలకు కల్పించారో, ఎవరైతే రాష్ట్ర పురోగతికి బాటలు వేశారో, ఎవరైతే నేరస్థులను జైళ్లకు పంపించారో వారినే గెలిపించాలని యూపీ ఓటరు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని మోదీ తెలిపారు. ఎస్పీ హయాంలో యూపీలోని ముజఫర్‌పూర్‌, షహరాన్‌పూర్‌లో జరిగిన మత ఘర్షణలను గుర్తుచేసి ఆయన.. అఖిలేశ్‌ యాదవ్‌ను ఈ మతదాడుల సృష్టికర్తగా దుయ్యబట్టారు. షహరాన్‌పూర్‌ మతదాడుల కేసులో ప్రధాన నిందితుడిని పశ్చిమ యూపీలో అఖిలేశ్‌ తన ఎన్నికల భాగస్వామిని చేసుకున్నారని, అక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ నేరస్థులకే సీట్లు దక్కాయని ఆరోపించారు. మాఫియాను ప్రోత్సహించే ఇలాంటి వ్యక్తుల్లో మార్పు వస్తుందని ఆశించొద్దని, ఒకనాడు ఏ మత అల్లరి మూకలను తూర్పారబట్టారో వారికే ఇప్పుడు హారతిపడుతున్నారని మండిపడ్డారు.

ఓట్లకోసం జనరల్‌ బిపిన్‌ రావత్‌పై కాంగ్రెస్‌ పార్టీ దొంగ ప్రేమను కురిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ఒక దశలో రావత్‌ను రోడ్డుసైడ్‌ పోకిరీ అని విమర్శించినవారే ఇప్పుడు ఆయన కటౌట్లు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. గురువారం ఆయన ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఎన్నికల సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ రావత్‌ ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన విషయం తెలిపిందే. రావత్‌ను విమర్శించినవారికి గట్టి బుద్ధి చెప్పాలని ప్రచారసభలో ప్రజలను మోదీ కోరారు.

Also Read : లక్ష్యం ఏదో గానీ.. నష్టం భారీగానే ఉంటోంది మోడీ సాబ్‌

Show comments