కేసీఆర్‌ మాట అన్నారంటే వెనక్కి తగ్గరు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రశంసల వర్షం

ముఖ్యమంత్రి చేసే పనులను, ఆయన వ్యక్తిత్వాన్ని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు కొనియాడడం, ఆకాశానికెత్తేయడం సర్వసాధారణం. ఇక ప్రతిపక్ష పార్టీలు అయితే.. ప్రభుత్వం ఏమి చేసినా విమర్శించడమో, లేదా మౌనంగా ఉండడమో చేస్తాయి. ముఖ్యమంత్రిని విమర్శించేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తుంటాయి. మరికొంత మంది ప్రతిపక్ష నేతలు అవకాశాలు సృష్టించుకుని మరీ విమర్శలు చేస్తారు. అయితే ఇందుకు భిన్నంగా తెలంగాణలో రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలపైన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రశంసల జల్లు కురిపిస్తుండడం విశేషం. కాంగ్రెస్‌ నేతలు అలా మాట్లాడడం వెనుక కారాణాలేమైనా.. టీఆర్‌ఎస్‌కు మాత్రం ఈ పరిణామాలు లాభిస్తున్నాయి.

సీఎం కేసీఆర్, దళిత బంధు పథకంపై తెలంగాణ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. దళిత బంధు మంచి పథకమని, స్వాగతిస్తున్నామన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల వేళ ఈ పథకం తెచ్చారని, కేవలం ఉప ఎన్నికల్లో గెలిచేందుకే పైలెట్‌ ప్రాజెక్టుగా హుజురాబాద్‌ను ఎంచుకున్నారనే విమర్శలు వస్తున్న వేళ జీవన్‌ రెడ్డి ఇలా కొనియాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకా అమలు కూడా కాని పథకాన్ని జీవన్‌ రెడ్డి కొనియాడడంతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేచింది.

పథకంతోపాటు కేసీఆర్‌ వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తేలా జీవన్‌ రెడ్డి కొనియాడారు. కేసీఆర్‌ ఒక మాట అన్నారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లరంటూ ప్రశంసించారు. తాను అనే మాటకు కార్యరూపం ఇచ్చే పరిస్థితి ఉంటేనే కేసీఆర్‌ మాట్లాడతారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇదే నేత.. గతంలో కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దళితుడును ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చేయలేదని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి అటకెక్కించారని ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. గతంలో ఇలా మాట్లాడిన జీవన్‌ రెడ్డి తాజాగా స్వరం మార్చడం విశేషం.

జీవన్‌ రెడ్డి ఇలా మాట్లాడడంతో ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు వద్దన్నా వస్తాయి. మొన్నటి వరకు పీసీసీ అధ్యక్షుడు రేసులో ఉన్న జీవన్‌ రెడ్డి.. అధికార పార్టీ అధినేతపై, ప్రభుత్వ పథకంపై ప్రశంసలు కురిపించేలా మాట్లాడడంతో కాంగ్రెస్‌లో మరో వికెట్‌ పడడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బడా నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడం కొత్తేమీ కాదు. రాష్ట్ర విభజనకు ముందే కె.కేశవరావు, ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడుగా పని చేసిన డి.శ్రీనివాస్‌లు గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఇతర నేతల లిస్ట్‌ భారీగానే ఉంది. వీరి సరసన జీవన్‌ రెడ్డి కూడా చేరతారా..? లేదా..? చూడాలి.

Also Read : పీసీసీని మారిస్తే ఏపీ కాంగ్రెస్ రాత మారుతుందా..?

Show comments