ఏపీలో మాస్క్ ల వెల్లువ.. ఒక్కొక్కరికి మూడు మాస్కులు ఇవ్వనున్న జగన్ సర్కార్..

కరోనా వైరస్ నుంచి రక్షణ ఇచ్చే మాస్కుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇకపై మెడికల్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదు. వందల రూపాయలు ఖర్చు పెట్టి మాస్కులు కొనాల్సిన అవసరం అంతకన్నా లేదు. కరోనా వైరస్ కట్టడికి ఏపీలో జగన్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్కరికి మూడు మాస్కుల చొప్పున రాష్ట్రంలోని ప్రజలందరికీ దాదాపు 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయనున్నారు.

ఈ రోజు కరోనా వైరస్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు ధరించడం వల్ల కరోనా వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. వృద్ధులు, బీపీ షుగర్ ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు వైద్యసహాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ పై జరుగుతున్న మూడో దశ పూర్తయింది. కోటి 43 లక్షల కుటుంబాలను ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వాలంటీర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. 32,349 మందికి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని సర్వే నివేదిక వెల్లడించింది. ఇందులో 9,105 మంది హై రిస్క్ లో ఉన్నారని పేర్కొంది. వీరందరికీ తక్షణమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించింది. అయితే సర్వే నివేదికలో సూచించిన 32,349 మందికి పరీక్షలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కరోనా జోన్లుగా గుర్తించిన 45 ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు.

Show comments