Idream media
Idream media
దేశ వ్యాప్తంగా ఖాళీ ఉన్న శాసన సభ స్థానాలు, పార్లమెంట్ స్థానాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది. దేశంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసారు. పశ్చిమ బెంగాల్‌లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానంకు ఎన్నిక నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలు ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.
సెప్టెంబర్ 30న పోలింగ్, అక్టోబర్ 3న కౌంటింగ్ ఉంటుందని తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6న విడుదల చేస్తామని నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 13 అని పేర్కొంది. దేశవ్యాప్తంగా 32 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో ఖాళీలు ఉన్నట్టుగా తెలిపింది. వీటి భర్తీ కోసం ఉప-ఎన్నికల నిర్వహణపై రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఎన్నికల సంఘం కోరింది. తమ అభిప్రాయాలను అన్ని రాష్ట్రాలు చెప్పడంతో ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. అయితే ఒడిశా, బెంగాల్ చీఫ్ సెక్రటరీలు మాత్రం ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.
Also Read : వచ్చే ఎన్నికలకు అయ్యన్న ఔటేనా!
వరదల వల్ల గానీ కరోనాతో గాని తమకు ఇబ్బంది లేదని తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. దీనితో ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు రెడీ అయింది ఎన్నికల సంఘం. అయితే ఇక్కడ మమతా బెనర్జీ వ్యూహం ఉందనే మాట వినపడుతుంది. ఈ ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో నందిగ్రాం నుంచి మమతా బెనర్జీ… మాజీ మంత్రి సువెందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. వాస్తవానికి భవాని పూర్ నుంచి మమత ఎప్పుడూ పోటీ చేస్తారు. కాని సువెందు అధికారిని ఇబ్బంది పెట్టేందుకు సిద్దమైన మమత అక్కడ పోటీ చేసి సువెందును నందిగ్రాం దాటకుండా చేయగలిగారు.
అయితే స్వల్ప తేడాతో ఓడిపోయిన మమత… చట్ట సభల్లో సభ్యురాలు కాకుండానే సిఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. రాజ్యాంగం ప్రకారం… చట్ట సభలకు ఎన్నిక కాని వ్యక్తి సిఎం పదవి చేపట్టిన ఆరు నెలల్లో చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. లెక్క ప్రకారం ఈ ఏడాది మే లో ఆమె సిఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. అంటే నవంబర్ 5 లోపు ఆమె శాసన సభకు ఎన్నిక కావాల్సి ఉంది. లేకపోతే రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేస్తే తనకు కొరకరాని కొయ్యగా మారిన గవర్నర్ జగదీప్ దంకర్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయిస్తారా అనేది అనుమానమే.
దీన్ని బిజేపి తనకు అనువుగా మార్చుకుని బెంగాల్ లో చీలిక రాజకీయం మొదలుపెట్టే సూచనలు ఉన్నాయి. తాను రాజీనామా చేసి గవర్నర్ ఏదైనా అభ్యంతరం చెప్తే పార్టీలో సీనియర్ నేతను సిఎంను చేయాల్సి ఉంటుంది. సీనియర్ నేత శాసనా సభ పక్ష నేత అయితే తృణముల్ కాంగ్రెస్ చీలిపోయినా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ అంచనా వేసుకున్న దీదీ వ్యూహాత్మక అడుగులు వేసారు. తన సొంత నియోజకవర్గం భవానీ పూర్ నుంచి మమత ఈసారి బరిలోకి దిగుతారు. భవానీ పూర్ మమతకు కంచుకోట… దీనితో ఆమె అక్కడి నుంచి ఎన్నిక కావడం ఖాయంగా కనపడుతుంది.
Also Read : ఆస్తుల అమ్మకం.. సాగర్‌ను లీజుకిచ్చేస్తారా..? ఆలోచింపజేస్తున్న ఖర్గే వ్యాఖ్యలు
మళ్ళీ మూడో వేవ్ పొంచి ఉన్న నేపధ్యంలో జాగ్రత్త పడిన మమత… ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఇక ఏపీ తెలంగాణా విషయానికి వస్తే రెండు రాష్ట్రాల్లో ఖాళీ ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల సంఘం. ఏపీలో బద్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మరణంతో ఉప ఎన్నిక రాగా, తెలంగాణాలో హుజూరాబాద్ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. ఈ ఉప ఎన్నిక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపొయింది.
– Venkat G