ర‌మ్య ఘ‌ట‌న : ప్ర‌భుత్వం – ప్ర‌తిప‌క్షం ఎవ‌రెలా వ్య‌వ‌హ‌రించారు..?

ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా ప్ర‌భుత్వ స‌హాయం కోసం ఎదురుచూస్తుంటారు. ప్ర‌భుత్వం స్పందించ‌ని ప‌క్షంలో ప్ర‌తిప‌క్షం అండ కోర‌తారు. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ ఏదైనా ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు వెంట‌నే స్పంద‌న వ‌స్తోంది. బాధిత కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవ‌డంతో పాటు, చ‌ట్ట‌ప‌రంగా కూడా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఏ ఒక్క సంఘ‌ట‌న‌కో ప‌రిమితం కాకుండా, ప్ర‌తీ అంశంలోనూ త్వ‌రిత‌గ‌తిన స్పందిస్తోంది. తాజాగా జ‌రిగిన రమ్య హత్య కేసునే తీసుకుంటే.. నిందితుడిని 24 గంటల్లోనే అరెస్టు చేశారు. అంత‌కు ముందే.. బాధిత కుటుంబానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించి, అండగా నిలిచారు.

అనుకోని ఘ‌ట‌నే అయిన‌ప్ప‌టికీ.. సాధార‌ణంగా ప్ర‌తిప‌క్షం ఏం డిమాండ్ చేస్తుంది.. బాధిత కుటుంబాలు ఏం కోరుకుంటాయి.. ఏపీ స‌ర్కార్ కూడా అదే చేసింది. అయినాప్ప‌టికీ టీడీపీ నుంచి నారా లోకేశ్ రంగంలోకి దిగి బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించే క్ర‌మంలో చేసిన హ‌డావిడి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టుతో టీడీపీ అధికారంలోకి వ‌చ్చేస్తుందంత ప్ర‌చారం చేసుకుంటున్నారు ఆ పార్టీ నాయ‌కులు. లోకేశ్.. ప్ర‌జ‌ల కోసం సుదీర్ఘ పోరాటం చేశారా, ఉద్య‌మం న‌డిపారా, అస‌లు ఆయ‌న ఎందుకు అరెస్టు అయ్యారు, ఆ అరెస్టులో అంత విష‌యం ఉందా.. అనే ఆలోచ‌న‌లు ఏమీ చేయ‌కుండానే లోకేశ్ ను ఓ హీరోగాను, ఆయ‌న అరెస్టుతో ఏదో జ‌రిగిపోయింద‌న్నంతగా మాట్లాడుతున్నారు. పైగా లోకేశ్ పొలిటిక‌ల్ కెరియ‌ర్ లో తొలిసారి అరెస్టు అయ్యారంటూ.. గొప్ప‌గా అభివ‌ర్ణిస్తున్నారు. నాయకుడి ప‌ట్ల అభిమానం స‌రైందే కానీ, మ‌రీ ఇలా వ్య‌వ‌హ‌రిస్తే అది రివ‌ర్స్ కొడుతుంద‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి.

దీనికి తోడు, ఇప్పుడు బాధిత కుటుంబం స్వ‌యంగా వెల్ల‌డించిన విష‌యాన్ని ప‌రిశీలిస్తే, టీడీపీ ఓవ‌రాక్ష‌న్ చేసింద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య సంఘటన జరగగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారని బాధితురాలి తల్లి జ్యోతి తెలిపారు. తమ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందించారని వెల్లడించారు. మరో రూ.4.5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించారని తెలిపారు. తమ కుటుంబానికి ముఖ్యమంత్రి పూర్తి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. నా చెల్లి లేదని నేను మర్చిపోకముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానని అండగా నిల‌వ‌డం గొప్ప విష‌య‌మ‌ని రమ్య సోదరి మౌనిక తెలిపారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి సాయం చేసిందన్నారు.

మీడియా సాక్షిగా బ‌హిరంగంగానే అంత ఆవేద‌న‌లో కూడా ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పేందుకు బాధిత కుటుంబం ముందుకు వ‌చ్చింది. ఇప్పుడు దీనికి టీడీపీ ఏం చెబుతుంది. బెదిరించారో, భ‌య‌పెట్టారో అంటుందా లేక నిశ్శ‌బ్దంగా ఉంటుందా చూడాలి. రాష్ట్రంలో టీడీపీ ఉనికి కోల్పోతోంది. అంత మాత్రాన.. ప్ర‌తీ విష‌యాన్ని రాజ‌కీయం చేయ‌డం ద్వారా వెలుగులోకి రావాల‌నుకోవ‌డం, నాయ‌కుడిగా గుర్తింపు వ‌స్తుంద‌నుకోవ‌డం అత్యాశే అవుతుంది. ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు వారికి చేరువై ఓదార్చ‌డం మంచిదే కానీ, వారి బాధ‌ల‌తో రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌దు.

Show comments