Idream media
Idream media
సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడడంతో పాటు..ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లఖీంపూర్ ఖేరి హింసాకాండపై రైతుల ఉద్యమం ఉధృతమవుతోంది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా ను తప్పించేవరకూ ఈ ఉద్యమం ఆగేలా కనిపించడం లేదు. తాజాగా సోమవారం రైతులు నిర్వహించిన రైల్ రోకో కూడా ఈ అంశం చుట్టూ ప్రధానంగా సాగింది. మరోవైపు.. బీజేపీలో కూడా అజయ్ మిశ్రాపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. యూపీలో పార్టీకి సమీకరణాల పరంగా కలిసి వస్తుందని కేంద్రంలో అజయ్ మిశ్రాకు సహాయ మంత్రి పదవి ఇచ్చి కీలకమైన హోంశాఖను అప్పజెప్పింది.లఖీంపూర్ ఘటనతో కలిసిరావడం అటుంచితే.. పార్టీకి పెద్ద ప్రమాదంగా మారింది.
సిట్ దర్యాప్తులో అజయ్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రా పాత్ర ఉందన్నట్లుగానే వివరాలు బయటకు వస్తున్నాయి. దీనికితోడు.. ఆ ఘటనకు ముందు రైతులను రెచ్చగొట్టే విధంగా అజయ్ మిశ్రా స్పందించారు. దాంతో నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన రైతులపై కాన్వాయ్‌ను నడిపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు వేయకపోతే.. పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బ్రాహ్మణుల కోపం చల్లార్చేందుకు పార్టీ తీసుకున్న చర్యలు విఫలం అయ్యే చాన్స్ కూడా ఉంది. ఈ క్రమంలో అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.
Also Read : యూపీ బీజేపీకి శిరోభారం, రైతు ఉద్యమం రాజుకుంటుందనే ఆందోళన
లఖీంపూర్ ఖేరీలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి తనయుడి కాన్వాయ్ దూసుకెళ్లి నలుగురు రైతులు మరణించగా, ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటన దేశమంతటినీ కదిలించింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, ఘటనకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తనయుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేసినా, అరెస్టుకు సర్కారు వేచి చూసింది. అయితే సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని మందలించడం, ఒక వ్యక్తిని కాపాడే క్రమంలో పార్టీ పరువు బజారుకీడ్చారని ఓ వర్గం నేతలు మండిపడుతుండడంతో ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయకతప్పలేదు. కానీ.., కేంద్రమంత్రి అజయ్ మిశ్రాపై మాత్రం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత రాజీనామా చేయించడం లేక మరోటా అనేది తేల్చే అవకాశముంది.
రైతులు మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు, ఉద్యమకారుల మృతికి కారుకులైన తండ్రీకొడుకులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా సోమవారం నిర్వహించిన రైల్ రోకో వల్ల ప్రధాన నగరాల్లో రైల్ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉత్తర రైల్వే జోన్‌లో ఈ ప్రభావం బాగా కనిపించింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎక్కడిక్కడే రైళ్లను అడ్డుకోవడం ద్వారా తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు రైతులు. దీంతో కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకోకతప్పేలా కనిపించడం లేదు. మరోవైపు పోలీసులు కూడా లఖీంపూర్ ఖేరీ హింసాకాండపై విచారణను వేగవంతం చేశారు.
Also Read : కేంద్ర మంత్రి మాటలు అవాస్తవమేనా? రైతుల మృతికి కారకులెవరు?